
ఎండు గడ్డి ధరకు రెక్కలు
ఫిరంగిపురం: ఈ ఏడాది ఎండుగడ్డి ధరలు అమాంతం పెరగడంతో పాడి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. మండలంలో పత్తి, మిర్చి ఎక్కువగా వేయడం , వరి తక్కువగా వేయడంతో కొరత ఏర్పడింది. దీంతో పొన్నూరు , తెనాలి, కొల్లూరు, కొల్లిపర, బాపట్ల ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకు వస్తున్నారు. అక్కడ ఎకరా గడ్డి ధర రూ.7 వేలు ఉంది. దాన్ని ట్రాక్టర్‌పై వేసినందుకు రూ.2 వేలు, రవాణా ఖర్చులు రూ.6వేలు కలిపి రూ.15వేలు అవుతోంది. పశువులకు ఏడాదికి సరిపడా వరిగడ్డి నిల్వ చేసుకోవాలంటే ఒక్కో దానికి సుమారు వంద మోపుల చొప్పున గడ్డి కావాలి. ఎకరాకు 80 కట్టలు మాత్రమే వస్తున్నాయి. దీంతో రైతులు రెండెకరాల గడ్డి కొనుగోలు చేయక తప్పడం లేదు. ట్రాక్టర్‌కు రెండు ఎకరాల గడ్డి అంటే సుమారు 160 కట్టలు దాకా వస్తాయి. రవాణాకు రూ.22వేలు వరకు రైతులు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మరో రెండు వేల రూపాయల వరకు బీపీటీ గడ్డికి చెల్లించాల్సి వస్తోంది.
పాడి పైనే ఆధారం
మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది పాడిపైనే ఆధార పడుతుంటారు. మండలంలోని 18 గ్రామాల్లో ఆవులు, గేదెలు సుమారు 9వేల పైచిలుకు ఉన్నాయి. వీటి పోషణ కోసం భారీగా ఎండుగడ్డి కొనుగోలు చేయాల్సి వస్తోంది. వేసవిలో పచ్చిగడ్డి తక్కువగా ఉండటంతో మరలా పంటలు వేసే వరకు పశువులకు ఎండు గడ్డి వేయక తప్పదు. వేసవిలో పచ్చిమేత లేక ఇప్పటికే పాల శాతం పడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధర చెల్లించి ఎండు గడ్డి తెచ్చుకుంటున్నారు. మరి కొందరు అంత ధర చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మొక్క జొన్న, గడ్డిజొన్న చొప్పను పశుగ్రాసంగా వేయడంతో పాల దిగుబడి పడిపోతోంది. ఎండు గడ్డి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ధరకు అందించాలని పలువురు పాడి రైతులు కోరుతున్నారు.
ఎకరా రూ.7వేలు
పశుగ్రాసం కొరత
పాడి రైతుల ఇక్కట్లు