‘ఫ్రీ’గా పట్టేసి.. రూ.కోట్ల భూమి కాజేసిన ఉన్నతోద్యోగి | - | Sakshi
Sakshi News home page

‘ఫ్రీ’గా పట్టేసి.. రూ.కోట్ల భూమి కాజేసిన ఉన్నతోద్యోగి

May 25 2025 8:04 AM | Updated on May 25 2025 8:04 AM

‘ఫ్రీ’గా పట్టేసి.. రూ.కోట్ల భూమి కాజేసిన ఉన్నతోద్యోగి

‘ఫ్రీ’గా పట్టేసి.. రూ.కోట్ల భూమి కాజేసిన ఉన్నతోద్యోగి

సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా, అమరావతి మండలం, లేమల్లె గ్రామ శివారు అయిన కర్లపూడి గ్రామంలో సర్వే నెంబర్‌ 290లోని సుమారు 15 ఎకరాల చెరువు పోరంబోకు భూమి ఉంది. ఇందులో కొంతమంది పేదలకు గతంలో అసైన్‌ చేయగా, మరికొంత భూమిని ఇంకొందరు స్వాధీనంలో ఉంచుకున్నారు. కొంత మందికే పట్టాలు ఉన్నాయి. మిగిలిన వారిలో మరికొందరికి పాత తేదీలు వేసి నకిలీ పట్టాలు సృష్టించారు.

పాత తేదీలతో పక్కాగా నకిలీలు..

ఈ భూమి గుంటూరు నుంచి అమరావతి మెయిన్‌ రోడ్డు పక్కనే కర్లపూడి గ్రామంలో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఉంటుంది. రాజధాని రావడంతో ఈ భూముల ధరలు కూడా పెరిగాయి. దీనిపై కన్నేసిన ఒక డెప్యూటీ కలెక్టర్‌ పల్నాడు జిల్లాలో పోస్టింగ్‌లో ఉన్న సమయంలో చక్రం తిప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్రీ హోల్డ్‌ చేయించారు. అసైన్‌ భూములకు ఫ్రీ హోల్డ్‌ చేయాలంటే జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీ (డీఎల్‌ఆర్‌సీ)లో ఆమోదం పొందాలి. ఇవేమీ లేకుండానే తహసీల్దార్‌, ఆర్‌డీవో రిమార్కులతో ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇచ్చిన ఆదేశాలలో కూడా చెరువు పోరంబోకును ఎందుకు ఫ్రీ హోల్డ్‌ చేస్తున్నారనే అంశాన్ని కూడా పొందుపరచలేదు. దీనికి సంబంధించిన నోట్‌ ఫైల్‌ కూడా లేదని చెబుతున్నారు. ఈ భూమిలో 19 మంది హక్కుదారులు ఉన్నట్లు చూపించారు. వీరిలో కొందరు రైతుల వద్ద పట్టాలు ఉన్నాయి. మరికొందరి వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. దీంతో గతంలో రెవెన్యూ విభాగంలో పనిచేసి రిటైర్‌ అయిన కొంతమంది అధికారులతో సంతకాలు పెట్టించి పాత స్టాంప్‌ పేపర్లపై సదరు సర్వే నెంబర్‌లోని రైతులకు పూర్వకాలంలోనే పట్టాలు వచ్చినట్లుగా నకిలీవి సృష్టించారని సమాచారం. వీటి ఆధారంగా సర్వేనెంబర్‌ 290లోని 15 ఎకరాలకు పూర్వకాలంలోనే పట్టాలు మంజూరు అయినట్లుగా రికార్డ్‌ తయారు చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఫ్రీ హోల్డ్‌ జీవో ప్రకారం ఆదేశాలు తెచ్చుకున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు ప్రణాళిక

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 7వ తేదీన ఫ్రీ హోల్డ్‌ అయిన భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై రాష్ట్ర స్థాయిలో కమిటీని సర్కారు నియమించింది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా, ఆ పార్టీ కోసం ఎంతో చేశానని చెప్పే సదరు డెప్యూటీ కలెక్టర్‌ తన పలుకుబడిని ఉపయోగించారు. ఆగస్టు 19వ తేదీన ఆ భూములకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం విశేషం. అసలు లబ్ధిదారులకు నామమాత్రంగా డబ్బులు చెల్లించి ఒక సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ సంస్థలో సదరు డెప్యూటీ కలెక్టర్‌కు వాటాలు ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా ఈ భూమిలో వెంచర్లు వేసి రూ.కోట్లు సంపాదించేందుకు సీఆర్‌డీఏ అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

నిబంధనలు పాటించకుండానే ఫ్రీ హోల్డ్‌ అమరావతిలో చెరువు భూమికి రెక్కలు చక్రం తిప్పిన డెప్యూటీ కలెక్టర్‌ డీఎల్‌ఆర్‌సీ మీటింగ్‌ జరగకుండానే ఆదేశాలు ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత రిజిస్ట్రేషన్లు రూ.కోట్ల విలువైన 15 ఎకరాలు బినామీ పేర్లతో హస్తగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement