
పాఠశాల విద్యను కాపాడాలి
గుంటూరు వెస్ట్: పాఠశాల విద్యను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో డీఆర్వో షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12న విద్యా వ్యవస్థపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వాలని, ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉంచాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థి నిష్పత్తి 1:20 మాత్రమే ఉండాలని కోరారు. అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని విన్నవించారు. పదోన్నతులు, బదిలీలు వేర్వేరుగా నిర్వహించాలని చెప్పారు. మున్సిపల్ హైస్కూల్స్‌లోని పోస్టులన్నీ అప్‌గ్రేడ్ చేసి టీచర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రజల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా కార్యదర్శులు ఎం.గోవిందు, కె.రంగారావు, ఎం.కోటిరెడ్డి పాల్గొన్నారు.