
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి
తెనాలి: ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల సోదాలపై సాక్షి మీడియా తెనాలి ప్రతినిధులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. వహాబ్ రోడ్డులోని అజీమ్‌ఖాన్ వీధిలోని సాక్షి రీజనల్ సెంటర్ కార్యాలయం నుంచి సాయంత్రం ప్రదర్శనగా మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ దగ్గర్లోని వెటర్నరీ కాలనీలో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసం ఉంటున్న అపార్టుమెంటుకు నగర సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ ప్రకా ష్‌లు సిబ్బందితో పాటు అక్రమంగా ప్రవేశించినట్టు తెలిపారు. సెర్చ్ వారంట్, ఎలాంటి నోటీసు లేకుండా వచ్చి భయానక వాతావరణం సృష్టించారని పేర్కొన్నారు. గౌరవప్రదమైన పత్రికా ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్.ధనుంజయరెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించటంతోపాటు సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగే రీతిలో పోలీసులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఇది సాక్షి ఎడిటర్‌పై మాత్రమే జరిగిన దాడి కాదనీ, భవిష్యత్‌లో మొత్తం మీడియాపై ఇవే దాడులు, బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాక్షి తెనాలి రీజనల్ సెంటర్ ఇన్‌చార్జి బి.ఎల్.నారాయణ, సాక్షి మీడియా విలేకరులు కేజే నవీన్, ఆలపాటి సుధీర్, తాడిబోయిన రామకృష్ణ, సాక్షి టీవీ ప్రతినిధి తోట శ్రీనివాసరావు, వేమూరు ఆర్‌సీ ఇన్‌చార్జి బుల్లయ్య, సర్కులేషన్ ఇన్‌చార్జి దాసు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావంగా స్థానిక పత్రిక సంపాదకుడు అడపా సంపత్‌రాయుడు పాల్గొన్నారు.