
జర్నలిస్టులకు ప్రత్యేక హెల్త్ కార్డులు ఇస్తాం
గుంటూరు మెడికల్: జర్నలిస్టులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా లలితా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ తరుపున పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తామని గుంటూరు లలితా సూపర్ స్పెషాలిటి హాస్పటల్ అధినేత, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్(ఐఎస్‌ఏ) జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ చెప్పారు. ఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలిగా డాక్టర్ విజయ ఎన్నికై న సందర్భంగా మంగళవారం గుంటూరు ఎల్‌వీఆర్ క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వీ సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శి కె.రాంబాబు, తదితరులు డాక్టర్ విజయను ఘనంగా సత్కరించి అభినందించారు. విజయ మాట్లాడుతూ జర్నలిజం వృత్తి ఎంతో రిస్క్‌తో కూడుకున్నదని, ప్రజలు, వ్యవస్థలకు సంధానకర్తగా జర్నలిస్టు పని చేస్తారని తెలిపారు. వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకుని తమవంతు బాధ్యతగా లలిత హాస్పిటల్ తరపున ప్రత్యేక హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా పూర్తిగా అండగా వుంటామని హామీ ఇచ్చారు. బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ తెలిపారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు లలితా హాస్పటల్ యాజమాన్యం చేస్తున్న ఉచిత వైద్యసేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యూనియన్ గుంటూరు నగర అధ్యక్షడు వర్రె కిరణ్‌కుమార్, కార్యదర్శి కందా ఫణీంద్ర కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుల్లగూర భక్తవత్సలరావు, శ్రీనివాసరావు, సుపర్ణ, చలపతిరావు, పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, జగన్‌మోహన్‌రెడ్డి, విద్యాధర మురళి, మార్కండేయులు, ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదు
జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజె) రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు హెచ్చరించారు. జర్నలిస్టులను కించపరిచే విధంగా వ్యవహరించకుండా, ప్రభుత్వ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. సోమవారం గుంటూరు ఎల్‌వీఆర్ క్లబ్‌లో యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సుబ్బారావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. హెల్త్ స్కీం కూడా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న ఒంగోలులో యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఐఎస్‌ఐ జాతీయ అధ్యక్షురాలు
డాక్టర్ పమిడిముక్కల విజయ
ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో
డాక్టర్ విజయకు సన్మానం

జర్నలిస్టులకు ప్రత్యేక హెల్త్ కార్డులు ఇస్తాం