
కాలువలకు మరమ్మతులు చేయించాలి
బాపట్ల: కృష్ణా పశ్చిమ కాలువ, దుగ్గిరాల డివిజన్, రేపల్లె డివిజన్‌లోని నీటి పారుదల కాలువలకు మరమ్మతులు చేయించాలని పలువురు రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళీని కలిసి సోమవారం వినతిపత్రం అందించారు. అమృతలూరు, చెరుకుపల్లి, నగరం, భట్టిప్రోలు, వేమూరు మండలాల పరిధిలోని రైతులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. కృష్ణ పశ్చిమ కాలువ, దుగ్గిరాల డివిజన్, రేపల్లె డివిజన్‌లోని నీటి పారుదల ఆధారిత భూములలో వరి పంట సాగు చేస్తున్నామని వివరించారు. రేపల్లె మెయిన్ డ్రెయిన్ (గంగోలు కాలువ) నుంచి 30 ఏళ్లుగా మురుగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని వివరించారు. ఈ ఏడాది(2024–25) ఖరీఫ్ సీజన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా రేపల్లె మెయిన్ డ్రెయిన్ పొంగి చెరుకుపల్లి మండలంలోని కనగాల, గూడవల్లి, నడింపల్లి, పొన్నపల్లి గ్రామాలలో, అమృతలూరు, భట్టిప్రోలు, వేమూరు, నగరం మండలంలోని కొన్ని గ్రామాలలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని వివరించారు. 2025–26 ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే కాలువను పూర్తిస్థాయిలో పూడిక తీసి, సామర్థ్యం పెంచి ముంపు నివారించాలని రైతులు కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మేక మహే ష్, గోగినేని బాలకోటేశ్వరరావు, గడ్డిపాటి రాఘవేంద్రరావు, కోట నాగ కోటి వెంకటరమణ తదితరులు ఉన్నారు.