
మద్యం మత్తులో రోకలి బండతో దాడి
తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ యువకుడు మృతి
దుగ్గిరాల: మద్యం మత్తులో రోకలిబండతో మోదడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మోరంపూడి గ్రామంలోని వైఎస్సార్ విగ్రహం కూడలి దగ్గర రఘునాథరావు(35), కూచిపూడి గోపి ఇరువురూ పూటుగా మద్యం సేవించారు. అనంతరం ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈక్రమంలో గోపి దగ్గరే ఉన్న ఇంటి నుంచి రోకలిబండ తీసుకువచ్చి రఘనాథ రావు తలపై గట్టిగా కొట్టాడు. దీంతో రఘునాథరావు కుప్పకూలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న రఘనాథరావును చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ హాస్పటల్‌కి తరలించారు, అక్కడినుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. మృతుడికి భార్య దివ్య, వరుసగా 7, 5, 2 సంవత్సరాలు వయసున్న శాన్సీ, హిమాన్సీ, జస్వీ అనే కుమార్తెలు కలరు. దుగ్గిరాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
లక్ష్మీపురం: బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని సెకండ్ సెమిస్టర్ పరీక్షలకు సరిగ్గా చదవలేకపోయానని మార్కులు తక్కువ వస్తాయనే మనస్థాపంతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన ఆదివారం కుందుల రోడ్డులో చోటుచేసుకుంది. పట్టాభిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణనగర్ వైట్ హౌస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే కల్లూరి హరనాథ్‌బాబు గుంటూరు హౌసింగ్ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. ఆయనకు ఇద్దరు ఆడ సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తె ఇంధు మేఘన (20) ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీలో తృతీయ సంవత్సరం బీటెక్ చదువుతోంది. వారం రోజులుగా పాస్‌పోర్ట్ పనిమీద తిరుగుతూ సెకండ్ సెమిస్టర్‌కు పూర్తిగా సిద్ధం కాలేక పోయింది. ఈనేపథ్యంలో మనస్తాపం చెంది ఇంట్లో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పట్టాభిపురం ఎస్సై తరంగిణి ఘటనా ప్రదేశంలో ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు.

మద్యం మత్తులో రోకలి బండతో దాడి