
బీభత్సం.. అస్తవ్యస్తం
● తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో భీకర ఈదురుగాలులు ● పలుచోట్ల విరిగిన కరెంటు స్తంభాలు, తెగిన విద్యుత్ తీగలు ● గాల్లోకి ఎగిరిన హోర్డింగ్‌లు, ఇళ్ల పైకప్పులు ● నేలకొరిగిన చెట్లు ● విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ, రూరల్ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు గాల్లోకి ఎగిరాయి. రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు నేలకు ఒరిగాయి. విద్యుత్ స్తంభాలు గాలి విరిగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నీడ కోసం ఏర్పాటు చేసిన ఐరన్ షె ల్టర్లు ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి 10 అడుగుల దూరం వరకు వెళ్లాయి. తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత జాతీయ రహదారి వెంబడి స్పెన్సర్ దగ్గర నుంచి ఉండవల్లి సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగి తాత్కాలికంగా రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వర్షం తగ్గుముఖం పట్టిన తరువాత స్థానికులు ఆ చెట్లను తొలగించారు. రోడ్డు పక్కన పలు నివాసాలపై ఏర్పాటు హోర్డింగ్‌లు గాల్లోకి ఎగిరిపోయాయి. నులకపేట తెల్ల క్వారీ, మదరసా, ఎర్రక్వారీ ప్రాంతాల్లో చెట్లు విరిగి ఇళ్లపై పడి రేకులు పగిలిపోయాయి. ఉండవల్లి ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో ఓ ఇంటి పైకప్పు పూర్తిగా గాల్లోకి ఎగిరి గోడలు కూలాయి. ఉండవల్లిలోని పుష్కరాల కాలనీలో గాలివాన బీభత్సానికి ఇంటి పైకప్పులు పైకి లేచిపోయాయి. సీతానగరంలో రెండు చోట్ల ఇంటి పైకప్పు గాల్లోకి ఎగిరాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాడేపల్లి పట్టణ రూరల్ పరిధిలో నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉండగా 25 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉండవల్లిలో 6 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ కూలిపోయింది. విద్యుత్‌శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదిక పనులు చేపట్టి సాయంత్రం 6 గంటలకల్లా పలుచోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి డ్రైనేజీలు పొంగి మురుగునీరు ఇళ్లముందు వరకు వచ్చాయి.

బీభత్సం.. అస్తవ్యస్తం