అధికారులు సమన్వయంతో పనిచేయాలి
గుంటూరు వెస్ట్: అమరావతి రాజధాని పరిధిలో భారీ నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్న దృష్ట్యా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, ఇతర అంశాలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. నిర్మాణాలకు వచ్చే కార్మికులకు భద్రత ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అసాంఘిక శక్తుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ రంగంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోపాటు, అనుకోని ఘటనలు జరిగినప్పుడు వైద్యులు, అంబులెన్సులు, మందులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. రాజధాని పరిధిలో పీహెచ్‌సీని ఇప్పటికే 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. కార్మికులకు అవసరమైన చికిత్స అక్కడ చాలా వరకు అందుబాటులో ఉంటుందన్నారు. నిర్మాణ పనులకు కార్మికులు కుటుంబ సభ్యులతో వస్తారు కనుక, చదువుకునే పిల్లలను స్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ రాజధానిలో భారీ నిర్మాణాలతో చాలా మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అయితే వారి రక్షణకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. రాజధాని పరిధిలో శాంతి భద్రతలు చక్కగా ఉండేలా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్మికులకు చట్టపరంగా అందించాల్సిన సౌకర్యాలపై కార్మిక శాఖ దృష్టి పెట్టాలన్నారు. నిర్మాణ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకూడదని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జెడ్పి సీఈఓ జ్యోతిబసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీపీఓ నాగసాయికుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు కృషి
ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. కలెక్టర్ వర్చువల్‌గా మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు భూములను గుర్తించామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఈ–వేస్ట్ కార్యక్రమాన్ని ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నగరపాలక సంస్థతో అనుసంధానమైన ఏజెన్సీకి అందిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీపీఓ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు


