గురుశిష్యుల అనుబంధం వెలకట్టలేనిది
ఏఎన్‌యూ(గుంటూరు): గురుశిష్యుల అనుబంధం వెలకట్టలేనిదని హైదరాబాద్‌లోని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఎం.బాలలత అన్నారు. వర్సిటీలో గురువారం జరిగిన వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విలువలతో సమాజంలో బాధ్యతాయుతంగా ఆదర్శవంత జీవనాన్ని సాగించాలన్నారు. ప్రతిభతోపాటు స్థిరత్వం ముఖ్యమని సూచించారు. వ్యక్తి తలుచుకుంటే ఒక వ్యవస్థగా మారి, ఒక గొప్పశక్తి కాగలడని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి కార్యాలయ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధికారి చిటికెల చిన్నారావు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, కృత్రిమ మేధ ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలని చెప్పారు. వార్షికోత్సవానికి ఏఎన్‌యూ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. తర్వాత బాలలతను సత్కరించారు. అనంతరం రెక్టార్ ఆచార్య కె.రత్నషీలామణి, వీసీ కె.గంగాధరరావుతోపాటు పలువురిని సన్మానించారు. రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు పొందిన వర్సిటీ ప్రొఫెసర్లు ఎం.త్రిమూర్తిరావు, వై.అశోక్ కుమార్, ఎన్.వి.కృష్ణారావు, పూర్ణచంద్రరావులను వర్సిటీ వీసీ రెక్టార్ రిజిస్ట్రార్, ఓఎస్‌డీ తదితరులు సత్కరించారు. కార్యక్రమానికి ఎం. త్రిమూర్తిరావు, సీహెచ్ లింగరాజు, డాక్టర్ రవి శంకర్ రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పూర్వ ఐఏఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ విభాగాధిపతి డాక్టర్ జి.కొండలరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ వీరయ్య, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల రాణి పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగ కళాకార స్వర నేత్ర బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జానపద గాయకులు దామోదర గణపతి రావు బృందం పలు గీతాలను ఆలపించింది. సినీ గాయకురాలు సాయి శిల్ప గీతాలాపనతో అలరించారు. వర్సిటీలోని డ్యాన్స్ విభాగం విద్యార్థులు నృత్యాలతో ఆహూతులను ఆకట్టుకున్నారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, బృందాలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు.
సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత


