బడ్జెట్ లెక్కలపై అధికారుల వద్ద సమాధానం లేదు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన బడ్జెట్‌లో చాలా లోపాలున్నాయని వాటిపై ప్రశ్నిస్తే అధికారుల వద్ద నుంచి ఎటువంటి సమాధానం లేదని నగర డెప్యూటీ వనమా బాలవజ్రబాబు(డైమండ్‌బాబు) విమర్శించారు. సోమవారం నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ ఆమోద సమావేశం జరిగిన తీరును వజ్రబాబు ఖండించారు. కౌన్సిల్ హాల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. రూ.1534 కోట్లు బడ్జెట్ అంచనాల్లో చూపి, రూ.1018కోట్లు ఖర్చుపెడుతున్నట్లు చెప్పారని, ఈ నిధులు 57 డివిజన్లకు ఏ విధంగా ఖర్చు పెడతారని ప్రశ్నిస్తే సమాధానం లేదని విమర్శించారు. రూ.670కోట్ల ప్రారంభ నిల్వ చూపిన అధికారులు అది ఏయే ఖాతాల్లో ఉందని అడిగితే సమాధానం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ సంవత్సరంలో నగరపాలక సంస్థ ఖర్చు పెట్టబోయే రూ.187కోట్లకు లెక్కల్లో సారూప్యత లేదని, దీనిపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశామని వెల్లడించారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కింద రూ.150 నుంచి రూ.200కోట్ల వరకు ఉండాలని, ప్రస్తుతం రూ.45కోట్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారని విమర్శించారు. సాధారాణ ఖర్చుల కింద ఈ సంవత్సరం రూ.169 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపారని, వాటికి ఎలా ఖర్చుపెట్టారో చూపలేదని పేర్కొన్నారు. వీటన్నింటికీ ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ పులి శ్రీనివాసులు సీఎంఓలో పనుందని చెప్పి వెళ్లిపోయారని వజ్రబాబు విమర్శించారు. ఇన్‌ఛార్జ్ మేయర్ సజీల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.అధికారులు కూటమి ప్రభుత్వానికి అమ్ముడుపోయారని ఆయన వజ్రబాబు ఆరోపించారు.
సుదీర్ఘంగా చర్చ జరగాల్సి ఉంది కూటమి సర్కారులో అధికారులు అమ్ముడుపోయారు కౌన్సిల్ నుంచి కమిషనర్ బయటకువెళ్లిపోవడమేమిటీ? నగర డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ధ్వజం


