టెన్త్‌ మూల్యాంకనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ మూల్యాంకనం ప్రారంభం

Apr 4 2025 1:16 AM | Updated on Apr 4 2025 1:16 AM

టెన్త

టెన్త్‌ మూల్యాంకనం ప్రారంభం

● విధులకు 945 మంది ఉపాధ్యాయులు ● మినహాయింపు కోరుతూ డీఈఓ వద్దకు క్యూ కట్టిన టీచర్లు ● షోకాజ్‌ నోటీసులు ఇస్తామని హెచ్చరించడంతో విధుల్లో చేరిక

గుంటూరు ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. గుంటూరు నగరంపాలెంలోని స్టాల్‌ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలో క్యాంపు అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అధ్యక్షతన జరిగిన మూల్యాంకనం విధులకు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈనెల 9 వరకు జరగనున్న వాల్యూయేషన్‌ విధులకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను నియమించారు. వీరిలో కొందరు గురువారం వాల్యూయేషన్‌ కేంద్రంలో రిపోర్టు చేసేందుకు వచ్చారు.

డీఈఓ సీరియస్‌

అయితే చాలామంది విధుల నుంచి మినహాయింపు కోరడంపై డీఈఓ సీవీ రేణుక అసహనం వ్యక్తం చేశారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ ఆర్డర్లు పొందిన ఉపాధ్యాయులు విధుల్లో చేరని పక్షంలో వారిని తన అనుమతి లేకుండా పాఠశాలల్లో విధులకు చేర్చుకోరాదని హెచ్‌ఎంలను ఆదేశించారు. సహేతుకమైన కారణాలు లేకుండా విధుల నుంచి తప్పించుకోవాలని చూసే ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. డీఈఓ హెచ్చరికలతో దిగి వచ్చిన ఉపాధ్యాయులు ఎట్టకేలకు స్పాట్‌ కేంద్రంలో రిపోర్టు చేశారు. చీఫ్‌ ఎగ్జామినర్లు 105, ఎగ్జామినర్లు 630, స్పోషల్‌ అసిస్టెంట్లు 210 మంది చొప్పున విధులకు హాజరయ్యారు. దూరవిద్య ఇంటర్‌ ఆన్సర్‌ షీట్లకు ఇదే ప్రాంగణంలో మూల్యాంకనాన్ని ప్రారంభించారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి వసతులు కల్పించినట్టు డీఈఓ సీవీ రేణుక చెప్పారు.

విధుల నుంచి మినహాయించండి

చాలామంది తమను విధుల నుంచి మినహాయించాలని కోరుతూ డీఈఓ సీవీ రేణుక వద్ద క్యూ కట్టారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, అత్యవసర శస్త్రచికిత్సలు చేయించుకున్న ఉపాధ్యాయులను విధుల నుంచి మినహాయించేందుకు అధికారులకు అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయులు ఏదో ఒక సాకుతో విధుల నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతల సిఫార్సులతో యత్నిస్తున్నారు. దాదాపు 50 మంది వరకు ఉపాధ్యాయులు వేర్వేరు కారణాలతో మినహాయింపులు కోరడంతో గురువారం మధ్యాహ్నానికీ మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఆ తర్వాత డీఈఓ హెచ్చరికతో గురువులు దిగొచ్చారు. మూల్యాంకనం ప్రారంభమైంది.

టెన్త్‌ మూల్యాంకనం ప్రారంభం 1
1/1

టెన్త్‌ మూల్యాంకనం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement