కార్మికులపై కూటమి కత్తి
● 60ఏళ్లు దాటిన వారిని విధుల నుంచి తొలగింపు ● పారిశుద్ధ్య విభాగంలో 103 మందికి ఉద్వాసన ● ఇంజినీరింగ్ విభాగంలో 39 మంది తొలగింపు ● గత ప్రభుత్వ హయాంలో 60 ఏళ్లు నిండితే కుటుంబ సభ్యులకు అవకాశం ● ఇప్పుడు ఆ అవకాశం లేదని అధికారుల స్పష్టీకరణ
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) కూటమి ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోంది. ఆప్కాస్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ సిబ్బంది వందల మందిని 60 ఏళ్ల వయసు దాటిందనే సాకుతో విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శ్రామిక వర్గం నిరసన గళం వినిపిస్తోంది.
వైఎస్సార్ సీపీ హయాంలో కుటుంబ సభ్యులకు అవకాశం
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 103 మంది పారిశుద్ధ్య, 39 మంది ఇంజినీరింగ్ కార్మికులను కూటమి ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. గత వైఎస్సార్ సీపీ పాలనలో 60 ఏళ్ళు వయసు నిండిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. దీంతోపాటు ఆప్కాస్ పద్ధతిలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకూ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఆప్కాస్ పద్ధతిలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ఉద్యోగం ఇవ్వడం లేదు.. 60 ఏళ్లు పూర్తయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ విధానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పోస్టులు అమ్ముకునేందుకే కుట్ర!
2025 మార్చి 31కి 142 మందిని విధుల నుంచి తొలగించాలని నగరపాలక సంస్థలోని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇంజినీర్ అధికారులకు జాబితాతో కూడిన సర్క్యులర్‌ను ఉన్నతాధికారులు జారీ చేశారు. జాబితాలో ఉన్న కార్మికులను మంగళవారం నుంచి విధులకు రానివ్వద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోస్టులు అమ్ముకునేందుకే కూటమి ప్రభుత్వం 60 ఏళ్ల వయసు దాటిన వారిని విధుల నుంచి తొలగిస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
కార్మికులపై కక్ష సాధింపు చర్యలు
గుంటూరు నగరపాలక సంస్థలో 60 ఏళ్లు పూర్తయిన పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కార్మికులను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం దారుణం. పనిచేసిన కాలానికి గ్రాట్యూటీ అమలు చేయకుండా కనీస పెన్షన్ ఇవ్వకుండా వారిని ఇంటికి పొమ్మనడం తగదు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే. ఇప్పటికై నా సర్కారు గ్రాట్యూటీ చెల్లించి కనీసం పెన్షన్ రూ.5,000 ఇవ్వాలి. తొలగించిన కార్మికుల కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలి.
–బందెల రవికుమార్,
ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి
కార్మికులపై కూటమి కత్తి


