ముందు తరాలకు అందించాలి
తెలుగు భాషా వైభవాన్ని
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): తెలుగు భాషా వైభవాన్ని ముందు తరాలకు అప్పగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. ఉగాది పండగ సందర్భంగా సాహితీ సమాఖ్య, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీవేంకటేశ్వర విజ్ఙాన మందిరంలో ఆదివారం సాయంత్రం సాహితీ వసంతోత్సవం నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ డీవీఎస్‌బీ రామమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను మండల స్థాయిల్లోనూ నిర్వహించాలని చెప్పారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని అన్నారు. పీ–4 మంచి కార్యక్రమం అని, ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని చెప్పారు. సంగీత విద్వన్మణి ఆర్.సూర్యలక్ష్మీ శిష్య బృందంతో విష్ణుసహస్రనామ పారాయణం చేయగా, గుదిమెళ్ల శ్రీ కూర్మనాథస్వామి పంచాంగ శ్రవణం చేపట్టారు. అనంతరం సాహితీ సమ్మేళనంలో సుప్రసిద్ధ సినీ గేయ, గజల్ రచయిత రసరాజు, సుప్రసిద్ధ సినీ నటులు కేదార్ శంకర్, హాస్య రచయిత డాక్టర్ పీవీ రామ్‌కుమార్, సంభాషణ రచయిత కె.కృష్ణవేణి, అష్టావధాని సల్లాన్ చక్రవర్తుల సాహిత్ పాల్గొన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్‌వీఎస్.లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఆర్.రాము, టీఎంటీ ట్రస్ట్ కార్యదర్శి పి.రామచంద్రరాజు పాల్గొన్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ కృష్ణమోహన్
ముందు తరాలకు అందించాలి


