
ప్రశంసా పత్రాలు అందజేస్తున్న డీఎంహెచ్‌వో శ్రావణ్‌బాబు
గుంటూరు మెడికల్: నేషనల్ స్టూడెంట్స్ సర్వీసెస్ (ఎన్‌ఎస్‌ఎస్) డే సందర్భంగా ఆదివారం గుంటూరు వైద్య కళాశాల వైద్య విద్యార్థినులు రక్తదానం చేశారు. స్థానిక ఆకులవారితోటలోని మెడికల్ కాలేజీ బాలికల వసతి గృహంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని గుంటూరు డీఎంహెచ్‌వో డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భవ– సేవా పక్వాడా అనే కార్యక్రమం ద్వారా రక్తదానం ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. డోనేట్ బ్లడ్– సేవ్ లైఫ్ అనే నినాదంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రక్తదానం చేసిన వైద్య విద్యార్థినుల్ని అభినందించి వారికి ప్రశంసా పత్రాల్ని డాక్టర్ శ్రావణ్‌బాబు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ బి. లక్ష్మానాయక్, లంకపల్లి మధుసూధనరావు, జ్యోతుల వీరాస్వామి, శ్రీనివాసరావు, శ్రీవిద్య, జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్‌కుమార్ పాల్గొన్నారు.