
పెళ్లయి ముచ్చటగా మూడేళ్లు మాత్రమే అయిన ఆ దంపతులకు నూరేళ్లు నిండిపోయాయి. బీఎస్సీ నర్సింగ్ చివరి పరీక్ష రాసిన భార్య ఇక తాము కన్న కలలు నిజమవబోతున్నాయని, ఇక తమ భవితకు ఎటువంటి బెంగ అవసరం లేదంటూ ఉత్సాహంగా ఇంటికెళుతున్న తరుణంలో మృత్యువు లారీరూపంలో వచ్చి వారి కలలను చిదిమేసింది. ఆశలను సమాధి చేసింది.
పెదకాకాని: జాతీయ రహదారిపై వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి అతివేగంగా వెళుతున్న లారీ ఢీ కొనడంతో సంఘటనా స్థలంలోనే భార్య, చికిత్స పొందుతూ భర్త మృతి చెందిన సంఘటన పెదకాకాని వద్ద చోటు చేసుకుంది. ఇరువురి మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కథనం ప్రకారం మంగళగిరి పట్టణానికి చెందిన గాలి శ్యామ్ తన కుమార్తె గాలి దేవనిస్సీ(24)ని అదే ప్రాంతానికి చెందిన మిర్యాల వంశీ(29)కి ఇచ్చి 2020లో వివాహం జరిపించారు.
వంశీ ప్లంబర్ వర్క్ చేస్తుండగా దేవనిస్సీ బీఎస్సీ నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతుంది. ఈనెల 3వ తేదీ చివరి పరీక్ష రాసేందుకు భర్త బైక్‌పై గుంటూరు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం భార్యాభర్తలు అదే బైక్‌పై మంగళగిరి తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్ పెదకాకాని శివారు వెంగళరావునగర్ సమీపంలోకి చేరుకునే సరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ రెండు చక్రాలు బైక్‌పై నుంచి వెళ్లగా దేవనిస్సీ సంఘటనా స్థలంలోనే మృతిచెందింది.
తీవ్రగాయాలైన వంశీని చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న వంశీ కొద్దిసేపటి తరువాత మరణించాడు. అజాగ్రత్తగా అతివేగంగా వాహనం నడిపి ఇరువురు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి గాలి శ్యామ్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.