ప్రతీకారం.. ప్రాణభయం

2021లో రక్తపు మడుగులో తరుణ్‌ ... (ఫైల్‌) - Sakshi

తెనాలి: ప్రతీకారం... ప్రాణభయం... ప్రశాంతమైన డెల్టా ప్రాంతమైన తెనాలిలో రౌడీషీటర్ల అల్లర్లకు కారణమవుతున్నారు. పాతకక్షలు, ఎదురుదాడితో ప్రత్యర్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. పట్టపగలే కిరాతకానికి ఒడిగడుతున్నారు. కోర్టు కేసుల సమయంలోనే

కొన్ని కేసులు రాజీ బాట పడుతున్నాయి. మరికొన్ని విచారణలో కొన‘సాగు’తున్నాయి. స్థానిక పాండురంగపేటకు చెందిన రౌడీషీటర్‌ మత్తే ప్రశాంత్‌ దారుణహత్యతో మరోసారి ఇవి చర్చనీయాంశమయ్యాయి.

నాలుగేళ్ల క్రితం రైల్వేస్టేషను సమీపంలో యువకుడిని కొట్టి చంపిన కేసులో దాదాపు 18 మంది నిందితులున్నారు. వీరిలో ఒకరైన రౌడీషీటర్‌ మత్తే ప్రశాంత్‌ గుంటూరుకు మకాం మార్చాడు. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. భార్య పుట్టిల్లయిన భీమవరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి, తిరిగి గుంటూరు వెళ్తూ తెనాలిలో ఉంటున్న అమ్మను చూసేందుకని బుధవారం తెనాలి వచ్చాడు. ఆ రాత్రి స్నేహితులతో కలసి మద్యం తాగిన ప్రశాంత్‌, గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో చెంచుపేటలోని ఓ బార్‌ పక్కన రోడ్డులో హత్యకు గురైన విషయం తెలిసిందే. మాస్క్‌లు ధరించిన ఇద్దరు ప్రశాంత్‌ను వెంటాడి హత్య చేసినట్లు సీసీ టీవీ ఫుటేజిలతో వెల్లడైంది. ప్రశాంత్‌ కదలికలపై సన్నిహితులు లేదా ఆనాటి కేసులో సహ నిందితుల్లో ఎవరో ఒకరు ఉప్పందించిన కారణంగానే ప్రత్యర్థులు అతడిని మట్టుపెట్టినట్టు భావిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు యువకులతో పాటు ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కొన్నేళ్లుగా రౌడీషీటర్ల ఆగడాలు..

2014 ఎన్నికల సమయంలో మేడిశెట్టి కృష్ణని స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషను ఎదురుగానే హత్య చేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో జరిగిన ఈ హత్య స్థానికులను నివ్వెరపరచింది. ఆ తర్వాత కొన్ని నెలలకే వేమూరి సత్యం అనే రౌడీషీటరు ఆటోలో కంఠంరాజుకొండూరులోని మహంకాళమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యంలో దుగ్గిరాల మండలం మంచికలపూడి రోడ్డులో దారికాచి హతమార్చారు. సత్యం సోదరుడైన సుబ్రహ్మణ్యం(సుబ్బు)కు పోలీసులు పట్టణ బహిష్కరణ విధించారు. అప్పట్నుంచి విజయవాడలో ఉంటున్న సుబ్బు, పోలీసుల కళ్లుగప్పి తెనాలి రాకపోకలు సాగిస్తూ వచ్చాడు. 2019 ఎన్నికలకు ముందు విజయవాడలో రెక్కీ నిర్వహించిన సుబ్బు ప్రత్యర్థులు, అతడు రోజూ సమీపంలోని టీ స్టాల్‌కు వస్తాడని తెలుసుకుని కాపుకాచారు. పకడ్బందీ ప్లానుతో వెంటాడి మరీ హత్య చేశారు.

ఈ మధ్యలో పెరోల్‌పై వచ్చిన ఓ యువకుడిని, ప్రత్యర్థులు ప్రకాశంరోడ్డులోని పెట్రోలు బంకు ఎదురుగా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో సాయంత్రం వేళ దారికాచి హత్య చేశారు. మాదిగ దండోరా ఉద్యమలో చురుకుగా పనిచేసిన పమిడిపాటి కోటయ్య మాదిగను తెనాలి– గుంటూరు వయా నారాకోడూరు రోడ్డుమార్గంలో వేజండ్ల వద్ద దారికాచి హత్యచేసిన విషయం తెలిసిందే. పట్టణానికే చెందిన ఒకరిని చంపుతానని కోటయ్య మాదిగ బహిరంగంగా చెబుతుండటంతో, ఎక్కడ తనను చంపుతాడోనని, అతడు తన అనుచరులతో కలసి ముందే అతడిని హతమార్చినట్టు అప్పట్లో వెల్లడైంది. 2021 జూన్‌లో అమరావతి ప్లాట్స్‌లోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద చప్పిడి తరుణ్‌ని ప్రత్యర్థులు తుదముట్టించారు. బ్యాడ్మింటన్‌ బాట్‌ కవర్లలో కత్తులు దాచుకుని, వీపునకు తగిలించుకు వచ్చిన నిందితులు, తరుణ్‌ కనిపించగానే కత్తులు తీసి దాడిచేశారు. ఈ కేసులో ఒక రౌడీషీటరు, మరో ఇద్దరిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. బాలాజీరావుపేటలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్న యువకుడు, ఆ మహిళను హత్యచేసి శవాన్ని మాయం చేసే ప్రయత్నం బట్టబయలు కావటంతో పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత అతడిని ప్రత్యర్థులు హత్య చేశారు.

ప్రతీకారం, ప్రాణభయం నేపథ్యంలో జరుగుతున్న హత్యలతోపాటు వివాహేతర సంబంధాల నేపథ్యంలోనూ దారుణాలు జరుగుతున్నాయి. మూల్పూరుకు చెందిన నూతక్కి రవికిరణ్‌ గతేడాది మార్చిలో హత్యకు గురయ్యారు. ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేస్తున్న నర్సుతో సంబంధం నేపథ్యంలో అతడిని తెనాలి పిలిపించి, హత్య చేశారు. శవాన్ని మూటగట్టి సంగంజాగర్లమూడి వద్ద కొమ్మమూరు కాలువలో పడేశారని రవికిరణ్‌ వర్గీయులు ఆరోపించారు. ఎన్‌డీఆర్‌ఎస్‌ బృందం కాల్వలో గాలించినా, అతడి మృతదేహం లభించలేదు. కొద్దిరోజుల క్రితం నందులపేటలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు ట్రయాంగిల్‌ ప్రేమ వ్యవహారం కారణమని భావిస్తున్నారు. యువతితో పరిచయమున్న ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకునేందుకు వ్యూహరచన చేసినట్లు కూడా చెబుతున్నారు. ఈలోగానే ఆ యువతి బలవన్మరణానికి గురైంది. ఇలా ప్రశాంత పట్టణంలో కంటిలో నలుసులా రౌడీషీటర్ల ఆఘాయిత్యాలు అలజడిని రేపుతున్నాయి. పోలీసులు కఠినంగా వ్యవరించాల్సిన ఆవశ్యకతను ఎత్తిచూపుతున్నాయి.

తెనాలిలో రౌడీషీటర్ల ఘాతుకం

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top