రాష్ట్రాలకు నిధులు పారాలి!

Yamini Aiyar Article On Budget 2021: Spend And Empower States - Sakshi

బడ్జెట్‌ 2021–22.. ఫోకస్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ను అంచనా వేయాలంటే ఒకే ఒక్క కొలమానం ఉంది. ఆర్థిక వ్యవస్థలో విస్తృతమవుతున్న సంస్థాగత అసమానత్వాన్ని తొలగించడానికి అది ప్రతిపాదించే వ్యూహాత్మక పథకమే కీలకం. లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌ ఆర్థిక పునరుత్తేజం వైపు సాగే దశను బడ్జెట్‌ సూటిగా దృశ్యమానం చేస్తుంది. అన్ని సూచికలూ తెలుపుతున్నట్లుగా, నియత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు కరోనా వైరస్‌ దాడికి మునుపటి స్థాయిలకు చేరుకుంటున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటించిన ముందస్తు అంచనా ప్రకారం ఆర్థిక వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంటోంది. కొన్ని నెలలకు ముందు పరిస్థితితో పోలిస్తే ఆశావహమైన భవిష్యత్తును ఇది సూచిస్తోంది. 

అయితే, ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేస్తున్న చలనసూత్రాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అదే సమయంలో స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన బడా కంపెనీలు సంవత్సరం వారీగా చూస్తే 50 శాతం లాభాలను చవిచూశాయి. ఖర్చులను తగ్గించుకోవడం, అధికాదాయం పొందుతున్న కుటుంబాలనుంచి వినియోగ సరుకులకు డిమాండ్‌ పెరగడమే కంపెనీల లాభాలకు కారణం. అదే సమయంలో భారతీయ కార్మికులలో మెజారిటీ ఇంకా కోవిడ్‌–19 కలిగించిన షాక్‌ నుంచి కోలుకోవలసి ఉంది.

ఆర్థికవేత్త ప్రాంజుల్‌ భండారి సూచించినట్లుగా ఆర్థిక వ్యూహాలపై లాక్‌డౌన్‌ విధించిన పరిమితులకు స్పందించే సామర్థ్యం ఉన్న చిన్న తరహా కంపెనీలు పెట్టగల వ్యయానికి పరిమితి ఉండటంతో భారీ కంపెనీలలో మదుపుపెట్టేలా ఆర్థిక గతి మార్పు చెందింది. భండారీ ఎత్తి చూపినట్లుగా ఖర్చుతగ్గింపులో భాగంగా చిన్న తరహా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పంపించివేశాయి. మరోవైపున బడాకంపెనీలు అధిక లాభాలు సాధించేలా లేబర్‌ మార్కెట్‌ కోలుకుంటున్న పర్యవసానాలు స్పష్టంగా కనిపిస్తూ, ఆందోళన కలిగిస్తున్నాయి.

భారత ఆర్థిక డేటా పర్యవేక్షణ సంస్థ (సీఎమ్‌ఐఈ) ప్రకారం, 2019–20తో పోలిస్తే 2020 డిసెంబర్‌ నాటికి దేశంలో ఉద్యోగాలు కోటి 47 లక్షల మేరకు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అమిత్‌ బసోల్, అజిమ్‌ ప్రేమ్‌జీ వర్సిటీకి చెందిన సహ రచయితలు సీఎమ్‌ఐఈ డేటాను విశ్లేషించిన దాని ప్రకారం 2020 ఆగస్టులో 40 శాతం మంది వేతనజీవులు, 42 శాతం మంది దినవేతన కార్మికులు స్వయం ఉపాధివైపుకు మరలిపోయారు. 2020 డిసెంబర్‌ నాటికి కూడా ఈ క్రమం కొనసాగుతూనే ఉంది. చాలామంది భారతీయులు నిరుద్యోగం తెచ్చిపెట్టే పెను భారాన్ని భరించలేరు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్లే అనియత రంగం నుంచి చాలామంది స్వయం ఉపాధివైపు మారిపోతున్నారు.

రెండు, ఉపాధిరంగం కోలుకోవడం అనేది లింగపరమైన వ్యత్యాసాలను ముందుకు తీసుకొచ్చింది. కోవిడ్‌–19 నేపథ్యంలో మహిళల ఉద్యోగాలపై భారీగా వేటుపడింది. గత సంవత్సరం ఏప్రిల్‌ నాటికి ఉద్యోగాలు కోల్పోయినవారిలో 73 శాతం మంది పురుషులు 2020 డిసెంబర్‌ నాటికి ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకున్నారు. అయితే ఇదేకాలంలో 23 శాతం మంది మహిళలు మాత్రమే తిరిగి ఉపాధి అవకాశాలు పొందగలిగారు. మూడు, సీఎమ్‌ఐఈతో సహా పలు సర్వేలు సూచిస్తున్నట్లుగా వేతనాలు లాక్‌డౌన్‌ ముందు స్థాయిలకు పడిపోయాయి. పైగా, బసోల్, అతడి సహ రచయితల అంచనా ప్రకారం కరోనా మహమ్మారి విజృంభించిన తొలి ఆరునెలల కాలంలో భారత్‌లో దిగువస్థాయిలో ఉన్న 10 శాతం కుటుంబాలు తమ ఆదాయంలో 30 శాతం కోల్పోగా, ఉన్నతస్థానంలో ఉన్న కుటుంబాలకు ఈ స్థితి ఎదురు కాలేదని తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ తీసుకొచ్చిన ఆర్థిక విధ్వంసం సృష్టించిన అసమానతలను ప్రధానంగా నిరుపేదలే భరించాల్సి వచ్చింది. తన ఆదాయాన్ని వదులుకోవడానికి, లాక్‌డౌన్‌ బాధితులకు సహాయం చేయడానికి కేంద్రప్రభుత్వం ముందుకు రాకపోవడం, ద్రవ్యవిధాన కొలమానాలపైనే అది ఆధారపడటంతో సంస్థాగత అసమానతలు బాగా పెరిగాయి. కాంట్రాక్టుల రూపంలోని ప్రభుత్వ వ్యయం 2020 నవంబర్‌లో మాత్రమే పుంజుకుందని గ్రహించాలి. నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న సందర్భంలో, లేబర్‌ మార్కెట్‌లో అనిశ్చితి పెరగటం, సూక్ష్మ చిన్న స్థాయి, మధ్యతరహా పరిశ్రమల రంగం ఘోరంగా కుదించుకుపోవడం, ఉద్యోగాల కల్పనకు బదులుగా లాభాలను సృష్టించడానికి ప్రోత్సాహకాలు అందించడం అలవాటు చేసుకున్న బడా కంపెనీల ఆర్థిక కార్యాచరణతో కలగలిసిపోయిన ఆర్థికవ్యవస్థతో ఆమె తలపడాల్సి ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి అనేది కార్మికులను అక్కున చేర్చుకోవడం కాకుండా వారి ఉపాధిని తొలగించడం ప్రాతిపదికన సాగుతుందని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ తిరోగమన ధోరణిని మార్చడం అనేది అటు నైతిక విధిగానూ, సలక్షణమైన ఆర్థిక వివేచన గానూ ఉంటుంది. ఏదేమైనా ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం కొనుగోలు శక్తిని పెంచకుండా ఉంటున్నప్పుడు డిమాండ్‌ కుప్పగూలిపోతుం దన్నది గ్రహించాలి.

కాబట్టి బడ్జెట్‌ను ముందుకు తీసుకుపోయే ఏకైక దిశ ఎలా ఉండాలి అంటే, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా.. లాక్‌ డౌన్‌లో దెబ్బతినిపోయిన వారికి ఉద్యోగాల కల్పన, సామాజిక భద్రతను అందివ్వడానికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి. ఆ క్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని గణనీయంగా విస్తృతపరుస్తూ బడ్జెట్‌ రూపకల్పన జరగాలి. డిమాండును ముందుకు తీసుకుపోయేలా ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చాలి. పట్టణాల్లో సామాజిక భద్రతను విస్తరించడానికి నిధులు కేటాయిం చాలి. దీన్ని నగదురూపంలో, ఉపాధి రూపంలో లేక ఇన్సూరెన్స్‌ రూపంలో ఎలా అమలు చేయాలి అనేది రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయించుకునేలా వీలుకల్పించాలి. ఇవి అత్యవసరంగా చేయవలసిన వ్యయాలు. దీనికి తోడుగా, 2021 ఆర్థిక సంవత్సరంలో కీలకమైన సంక్షేమ పథకాలు (పోషకాహారం, విద్య, గృహవసతి)పై కత్తెర వేశారు. తాజా బడ్జెట్‌ ఇప్పుడు వీటికి అమిత ప్రాధాన్యత కల్పించాలి. ప్రస్తుత ఉపాధి సంక్షోభానికి దారితీసిన అనేక వ్యవస్థాగతమైన వైఫల్యాలను చర్చిం చడానికి బడ్జెట్‌పై చర్చలో తావుండదు కానీ దీర్ఘకాలిక విధానాలను పొందుపర్చే దార్శనికతను బడ్జెట్‌ వ్యక్తం చేస్తే అది స్వాగతించవలసిన ముందడుగుగా చెప్పవచ్చు.

ప్రైవేట్‌ పెట్టుబడుల పునరుద్ధరణకు, ఉపాధి కల్పనకు రెండింటికీ కీలకమైన సాధనంగా వ్యవస్థాగతమైన వ్యయాన్ని పెంచాల్సిన అవసరముందని పలువురు చెబుతున్నారు కానీ మౌలిక వసతుల కల్పనను కేంద్రమే కల్పించాలా లేక రాష్ట్రాలకూ పాత్ర ఉండాలా అనేది కోవిడ్‌–19పై పోరాటంలో నిర్ణాయక అంశంగా ఉంటుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ మార్గాలు పూడిపోయాయి. పైగా రాష్ట్రాలకు కేంద్రం ద్రవ్యరూపంలో సహాయం చేయడానికి బదులుగా మార్కెట్‌ నుంచి రుణాలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొనడం పురోగతికి ప్రతిబంధకమే అవుతుంది. దీంతో, తాజాగా క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక ఎత్తి చూపినట్లుగా, రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన వ్యయాలపై కోత విధిస్తున్నాయి లేదా బడ్జెట్‌ అనంతర రుణాలవైపు సాగిపోతున్నాయి.

రాష్ట్రాలకు ఆర్థిక సాధికారత కల్పించి మౌలిక వసతుల కల్పనను ముందుకు తీసుకుపోవడానికి కేంద్రం రాష్ట్రాలకు అవసరమైన ద్రవ్య సహాయం అందించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలపై పన్నుల భారాన్ని తగ్గించడం, కోవిడ్‌–19 గ్రాంట్స్‌ని అదనంగా కల్పించడం వంటి కీలక అంశాల్లో 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ కాలం పొడవునా కేంద్రం పూర్తిగా విఫలమైంది. దీంతో 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ రాష్ట్రాలపై పన్ను భారాన్ని తగ్గించనుందని విస్తృతంగా అంచనా వేస్తున్నారు. చివరగా, కోవిడ్‌–19 నేపథ్యంలో సమర్పిస్తున్న తాజా బడ్జెట్‌ భారత్‌లో చిన్నాభిన్నమైన ఆరోగ్య వ్యవస్థను నిలబెట్టడానికి తగిన విధానాలను తప్పకుండా ప్రతిపాదించాలి. పెంచిన కేటాయింపులు నిజంగా స్వాగతించదగినవి, అవసరమైనవి కూడా. కానీ ఆరోగ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా కేంద్రం తప్పక గుర్తుంచుకోవాలి. బడ్జెట్‌ అనేది విధాన పత్రం కాబట్టి ఆర్థిక వ్యయాలకు మద్దతు తెలుపుతూ ఒక విస్తృత దిశలో బడ్జెట్‌ను రూపొందించాలి. అదేసమయంలో రాష్ట్రాలు తమదైన మార్గంలో పయనించేలా అవకాశం కల్పించాలి.

యామిని అయ్యర్
ప్రెసిడెంట్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్
‌‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top