ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్ అవార్డుల్లో కొత్త రూల్‌! | Why AI actors not eligible for Golden Globes and Oscar full details | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధకు అవార్డుల్లేవు!

May 12 2026 2:15 PM | Updated on May 12 2026 2:24 PM

Why AI actors not eligible for Golden Globes and Oscar full details

ఇన్‌ బాక్స్‌

ప్రతిష్ఠాత్మకమైన సినిమా అవార్డుల్లో ‘ఆస్కార్‌’, ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ ముందు వరుసలో ఉంటాయి. 1929 నుండి ఆస్కార్‌ అకాడమీ సినిమాలోని వివిధ విభాగాల్లో కనబరచిన ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు ఇస్తోంది. అదే బాటలో హాలీవుడ్‌ ఫారిన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ 1944 నుండి గోల్డెన్‌ గ్లోబ్‌ పేరిట అవార్డులు అందిస్తోంది. ఆస్కార్‌ తర్వాత గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కార ప్రదానోత్సవం అమెరికాలో జరుగుతుంది. ఈ పురస్కారాలు సినిమా నిర్మాణ విలువలకు అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెడతాయి.

అవార్డుల ఎంపికలో మానవ సృజనాత్మకతనే ప్రమాణంగా తీసుకొనే ఈ సంస్థలను ఈ మధ్య  సినిమాలో పెరుగుతున్న కృత్రిమ మేధ ఇరకాటంలో పడేసింది. 2025లో ‘యాజ్‌ డీప్‌ యాజ్‌ ద గ్రేవ్‌’ అనే సినిమాలో నటిస్తున్న వాల్‌ కిల్మేర్‌ అనే నటుడు ఆకస్మాత్తుగా చనిపోయాడు. వాల్‌ కుటుంబం అనుమతితో ఆయన రూపాన్ని, గొంతును కృత్రిమ మేధ సాయంతో సృష్టించి ఆ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు అవార్డు ఎంట్రీకి అవకాశం కల్పించాలా వద్దా అనే చర్చ వచ్చింది.

సాంకేతిక సృష్టి నటుడికి ప్రత్యామ్నాయం కాదని ఆ సినిమాకు పోటీలో అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఆ సంస్థలు అవార్డుల కోసం వచ్చే సినిమాల్లో టెక్నాలజీ వాడుక విషయంలో కొన్ని విధి విధానాలను రూపొందించాయి. 2027 నుండి సినిమాల ఎంట్రీ సమయంలో వీటి పరీక్ష ఉంటుంది. సినిమా నిర్మాణం మానవ సృజనాత్మకతకు గీటురాయి. సహజమైన పువ్వుకు, ప్లాస్టిక్‌ పూవుకు ఉన్న తేడా తెలిసిందే. సాంకేతికత అనివార్యమైన విభాగాలు మినహా మిగతా వాటిలో మానవ సృజనకే ఈ సంస్థలు పెద్ద పీట వేసేందుకు నిర్ణయించాయి. ప్రత్యేకంగా నటన, రచనల్లో మానవ ప్రమేయం లేకుంటే ఆ యా విభాగాల్లో చిత్రం పోటీ పడే అర్హత లేకుండా చేశాయి.

చ‌ద‌వండి: ఓబీసీ క్రిమిలేయ‌ర్ కిరికిరి తేలింది!

ఈ సందర్భంగా 2023 మేలో జరిగిన హాలీవుడ్‌  సినిమా రచయితల ఐదు నెలల సమ్మె గమనార్హం. సినిమా స్క్రిప్ట్‌ విషయంలో నిర్మాతలు చాట్‌ జీపీటీని వాడుకోవడంపై ఈ సమ్మె జరిగింది. చాట్‌ జీపీటీ పనిని కూడా తమ గిల్డ్‌లోని ఓ రచయితకు అప్పగించాలనే ఒప్పందంపై ఆ సమ్మె ముగిసింది. యంత్ర నిర్మిత కళను వ్యతిరేకిస్తున్న ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ల బాటలో మిగతా సంస్థలు నడిస్తే కళ బతుకుతుంది. కళాకారులకు గౌరవం దక్కుతుంది.

– బద్రి నర్సన్‌, కథా రచయిత

Advertisement
 
Advertisement
Advertisement