రావాల్సిన ‘చిరు’ విప్లవం

United Nations has declared 2023 as Year of Cereals - Sakshi

విశ్లేషణ

ఐక్యరాజ్యసమితి 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. కిలో బియ్యం పండించేందుకు 3–5 వేల లీటర్ల నీళ్లు అవసరం కాగా, చిరుధాన్యాలకు 200 లీటర్లు చాలు. వాటి పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ‘టీటీడీ’ ఆధ్వర్యంలో 11 ధార్మిక ప్రాంతాలకు వీటిని అందించేట్టుగా చేసుకున్న ఒప్పందం లాంటిది పంజాబ్‌ లాంటి రాష్ట్రాలు అనుసరించవచ్చు.

చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనంలో వారంలో ఒక పూటైనా చిరుధాన్యాలు అందిస్తే వీటి డిమాండ్‌ పెరిగి, రైతులను ఆ దిశగా మళ్లేట్టు చేస్తుంది.

ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. దీంతో ఈ అద్భుత సిరిధాన్యాలపై మరోసారి అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. 2023 ఏడాది ముగిసేలోపు ఈ చిరుధాన్యాలను తృణప్రాయంగా పక్కనబెట్టే మానసిక స్థితి నుంచి అందరూ బయటపడతారని నేనైతే నమ్మకంగా ఉన్నాను. ప్రతిగా... ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అదృశ్య ఆకలి ప్రమాదాన్ని భారత్‌ కూడా సమర్థంగా ఎదుర్కునే అవకాశం లభిస్తుంది. 

ఒకప్పుడు వీటిని తృణధాన్యాలని పిలిచేవారు. ఇవి ముతకగా  ఉండవచ్చునేమో కానీ, ఆరోగ్యానికి హాని చేసేవి కాదు. నిజానికి పోష కాలతో నిండి ఉంటాయి. వాతావరణాన్ని తట్టుకోగల తెలివైన పంటలు కూడా. మెట్ట, వర్షాధారిత ప్రాంతాల్లో ఎంచక్కా పండించు కోవచ్చు. చిరుధాన్యాల జాబితాలోకి సజ్జలు, జొన్న, రాగులతోపాటు ఇతర చిన్న సైజు గింజలుండే ఆరు ధాన్యాలు(కొర్ర, అండుకొర్ర, అరికె, ఊద, సామ, వరిగ) వస్తాయి. చాలాకాలంగా వీటిని ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. యూరోపియన్  లేదా అమెరికన్  ఆహార శైలుల్లోకి ఇవి ఇమడకపోవడం ఒక కారణం. 

సంప్రదాయ సాగు నుంచి మళ్లించాలి...
అయితే మిల్లెట్స్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా తదితర పౌర సమాజ వర్గాలు చిరుధాన్యాల ప్రయోజనాలపై చేసిన విస్తృత స్థాయి ప్రచారం పుణ్యమా అని ఇప్పుడు వీటికి మరోసారి ప్రాధాన్యం ఏర్పడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలోకి వీటిని చేర్చడం కారణంగా ఇప్పుడు వైవిధ్యభరిత ఆహార, పంటల వ్యవస్థలకు మార్గం సుగమమైంది. చిరుధాన్యాల లాభాల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ ఏడాదిలో వీటి గురించి మరింత వింటాం కూడా. ప్రజల్లో అవగాహన మరింత పెంచడం, దిగుబడుల పెంపు, ఆహార శుద్ధికి అవకాశాలు కల్పించడం, సేకరణ మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ ఏడాది చర్చోపచర్చలు జరగనున్నాయి.

అయితే చిరుధాన్యాల సాగును మరింతగా పెంచాలంటే, నీటి అవసరాలు ఎక్కువగా ఉండే వరి సాగు నుంచి రైతులను మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం చిరుధాన్యాల సాగు రైతులకు లాభదాయకంగా ఉండాలి. అయితే ఇది చెప్పినంత సులువైన పనేమీ కాదు. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతును ఇంకో దిశకు మళ్లించడం కోసం గతంలోనూ కొన్ని విఫలయత్నాలు జరిగిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 

ఒక కిలో బియ్యం పండించేందుకు ప్రాంతం, వాతావరణాలను బట్టి మూడు నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ చిరుధాన్యాల విషయంలో నీటి అవసరం కేవలం 200 లీటర్లు మాత్రమే. పైగా వీటి సాగులో రసాయన ఎరువులు, క్రిమి, కీటక నాశినుల వాడకమూ పెద్దగా ఉండదు. పోషకాలూ మెండుగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ‘కమిషన్  ఫర్‌ అగ్రికల్చర్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైజెస్‌’ (సీఏసీపీ) చిరుధాన్యాల ధరల నిర్ణయానికి కొత్త ఫార్ములాను రూపొందించాలి.

పర్యావరణానికి చిరు ధాన్యాలు అందించే తోడ్పాటును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడికి అందే ధరలో రైతుకు దక్కేది కొంతే కాబట్టి ధరలు నిర్ణయించే తీరు మారడం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. పండించే పంటకు కచ్చితంగా కొంచెం పెద్ద మొత్తంలోనే ధర లభిస్తుందని తెలిస్తే రైతుకూ, సమాజానికీ లాభం.

స్ఫూర్తిదాయకమైన ఏపీ మోడల్‌
చిరుధాన్యాలకు మద్దతుధరలు కొత్తగా నిర్ణయించడంతోపాటు వరి పంటకు పేరెన్నికగన్న పంజాబ్‌ లాంటి రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగును పెంచాలి. 1950లో అవిభాజ్య పంజాబ్‌లో సుమారు 11 లక్షల హెక్టార్లలో సజ్జలు సాగవుతూండేవి. ఇప్పుడు ఇది వెయ్యి హెక్టార్ల కనిష్ఠానికి పడిపోయింది. గోధుమ, వరి పంటలను మార్చి మార్చి వేయడమన్న విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పరిస్థితి ఇంతకు దిగజారింది.

పప్పులు, నూనెగింజలతోపాటు చిరుధాన్యాల సాగు మళ్లీ చేపట్టడం మేలైన ముందడుగు అవుతుంది. ఇలా పంటల వైవిధ్యానికి చిరుధాన్యాలు చేర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. పర్యావరణ విధ్వంసానికి కారణమైన హరిత విప్లవ దుష్ప రిణామాలను చక్కదిద్దగలగడం ఒకటైతే... చిరుధాన్యాలకు డిమాండ్‌ పెంచడం రెండోది. 

చిరుధాన్యాల సాగు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను పంజాబ్‌ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని 11 ధార్మిక ప్రాంతాల్లో సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ (సీఎస్‌ఏ), రైతు సాధికార సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్‌ కలిసికట్టుగా ఒక ఒప్పందం చేసుకున్నాయి.

ఇందులో భాగంగా 12 రకాల పంటలను 15,000 టన్నుల మేరా సహజసేద్య విధానంలో అందించాలి. ఇందులో భాగంగా కనీస మద్దతు ధర కంటే పది శాతం ఎక్కువ ధర రైతుకు లభించనుంది. ఒకవేళ మార్కెట్‌లో ఆయా పంటకు ఎక్కువ ధర ఉంటే... అదనంగా ఇంకో పదిహేను శాతం చెల్లిస్తారు. కర్ణాటకలోనూ గతంలో రాగుల సాగును ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధర కంటే 40 శాతం ఎక్కువ చెల్లించారు.

పంజాబ్‌లోని వేల గురుద్వారాలను దృష్టిలో ఉంచుకుంటే చిరుధాన్యాలకు, అదికూడా సేంద్రీయ ఉత్పత్తలకు మంచి డిమాండే ఉంటుంది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ వంటి సంస్థల సాయంతో సేంద్రీయ లంగర్‌ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల్లో చిరుధాన్యాలను చేర్చవచ్చు. ఆ మాటకొస్తే చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలవుతాయి.

చిరుధాన్యాల సక్రమ నిల్వ, సరఫరాల బాధ్యతను మార్క్‌ఫెడ్‌ వంటి సంస్థలకు పంజాబ్‌ అప్పగించవచ్చు. ఖేతీ విరాసత్‌ మిషన్  వంటి లాభాపేక్ష లేని సంస్థలకు సేంద్రీయ వ్యవసాయ సముదాయాల ఏర్పాటు పనులు అప్పగించవచ్చు. నాణ్యతను నిర్ధారించేందుకు అవసరమైన చర్యలూ సులువుగా చేపట్టవచ్చు. 

పాఠశాలల డిమాండ్‌ కూడా చేరితే...
పంజాబ్‌లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుతున్నారు. వీరికందించే మధ్యాహ్న భోజన పథకంలో ప్రారంభంలో వారానికి ఒకసారి చిరుధాన్యాలను కూడా చేరిస్తే విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతుంది. తద్వారా స్థానికంగానే వీటి సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ నిర్ణయించినట్లే చిరుధాన్యాలను పంజాబ్‌లోనూ స్థానిక రైతుల నుంచి మాత్రమే సేకరిస్తామని చెప్పవచ్చు.

కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో సుమారు 110 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీరికి వారంలో ఒకసారి చిరుధాన్యాలను వడ్డిస్తున్నారు. అయితే ఈ డిమాండ్‌ను తట్టుకోవడం కష్టమవుతోంది. పంజాబ్‌ మొత్తమ్మీద చిరు ధాన్యాలను వడ్డిస్తే పరిస్థితి ఎలా ఉండనుందో ఇట్టే అర్థం చేసు కోవచ్చు. పాఠశాలలు, గురద్వారాలతో ఏర్పడే డిమాండ్‌ను తట్టు కునేందుకు పంజాబ్‌ ప్రభుత్వం, రైతులు ఏదో ఒక మాయ కచ్చితంగా చేయగలరు. 

జాతీయ స్థాయిలో చూస్తే సుమారు 12.7 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వీరందరికీ చిరుధాన్యాలు ఏదో ఒక స్థాయిలో అందించడం రైతులను చిరుధాన్యాల సాగుకు మళ్లించేందుకు మేలిమి మార్గం కాగలదు. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనాలయాల సాయంతో చిరుధాన్యాల సాగు, వినియోగాన్ని పెంచడం సుసాధ్య మవుతుంది. పంజాబ్‌ ఈ దిశగా అడుగులేసి దేశంలో చిరుధాన్యాల విప్లవాన్ని సృష్టించాలని ఆశిద్దాం!

దేవీందర్‌ శర్మ
వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top