కొత్త జాతీయ విద్యావిధానంతో సరికొత్త సమస్యలు

Ummareddy Venkateswarlu Guest Column On New Education Policy - Sakshi

సందర్భం

‘ఒకే దేశం ఒకే విద్య’ అనే ప్రాతిపదికన ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ‘కొత్త జాతీయ విద్యావిధానం 2020’ దేశవ్యాప్త చర్చకు దారితీయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం చట్టంగా రూపొందించనున్న ‘నూతన విద్యావిధానం’లో మేలు చేసే పలు సంస్కరణలకు చోటు కల్పించినప్పటికీ, వారసత్వంగా పీడిస్తున్న కీలక సమస్యలను పరిష్కరించే ప్రతిపాదనలు ఏవీ అందులో కనబడలేదు. రెండు దశల్లో 8వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలోనే విద్యార్థులకు విద్యను అందించాలని ప్రతిపాదించడం ఏ మేరకు ఆచరణాత్మకం అనే సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. విద్యనందించే బాధ్యత నుండి గత ప్రభుత్వాలు తప్పుకొన్న కారణంగా విద్య క్రమేపీ ప్రైవేటు రంగంలోకి జారిపోయింది. పోనీ, ఆ ప్రైవేటు రంగంలోనైనా సవ్యమైన విద్యనందిస్తున్నారా అంటే అందుకు స్పష్టమైన సమాధానం లభించదు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కొన్ని విద్యా సంస్థలు కేవలం మార్కులు సాధించడమే విద్యార్థుల జీవిత లక్ష్యమన్నట్లుగా చీకటి కొట్టాల్లాంటి గదుల్లో ఉంచి విద్యార్థులపై ఒత్తిడి పెంచే విధానం మొదలై దాదాపు 3 దశాబ్దాలు దాటింది. 

కొత్తదనం ఏదీ?
కొత్త విద్యావిధానంలో పాత సమస్యలను పరిష్కరించే విప్లవాత్మక మార్పులు ఉంటాయని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. ప్రస్తుతం ఉన్న 10+2+3 విధానాన్ని మార్పుచేసి 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టడం కొత్తదనంగా చూపుతున్నారు. ఈ మార్పు వల్ల ఇంటర్‌ కూడా పాఠశాల విద్య కిందికి వస్తుంది. పిల్లలకు 3 ఏళ్ల నుంచే కిండర్‌ గార్డెన్‌ (పూర్వ ప్రాథమిక విద్య) విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాలనుకోవడం ఆహ్వానించదగినదే. అయితే, ఈ విద్యను బోధించే బాధ్యతను అంగన్‌వాడీలలో పనిచేసే ఆయాలకు అప్పగించి.. వారికి డిజిటల్, డిస్టెన్స్, డీటీహెచ్‌ పద్ధతులలో 6 నెలలపాటు శిక్షణ అందించాలనుకోవడం ఎంతవరకు ఆచరణాత్మకం? అంగన్‌వాడీ ఆయాలకు తగిన బోధనా అర్హతలు ఉండాలి కదా.

ఇక, 6వ తరగతి నుంచే ఒకేషనల్‌ విద్యను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంలో ఎటువంటి సహేతుకత కన్పించదు. 9–10 సంవత్సరాల వయస్సు విద్యార్థులకు వృత్తి విద్యకు సంబంధించిన అంశాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస అంతగా ఉండదు. ఆసక్తిలేని అంశాలను వారిపై బలవంతంగా రుద్దితే అసలుకే మోసం వస్తుంది. 15 సంవత్సరాలు నిండిన తర్వాత పాలిటెక్నిక్, ఐటీఐ వంటి వృత్తి విద్య కోర్సులలో ప్రవేశిస్తున్న విద్యార్థుల సంఖ్య ఇప్పటికీ తక్కువ శాతంగానే ఉంది. పిన్న వయసులోనే వృత్తి విద్యను నేర్పినట్లయితే.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించాలన్న బలీయమైన కోరిక, పట్టుదల సడలిపోతుంది.

కొత్త విధానంలో మాతృభాషలో లేదా స్థానిక భాషలో 5వ తరగతి వరకు విద్యాబోధన జరగాలని, రెండవ అంచెలో 8వ తరగతి వరకు దానిని పొడిగించాలని ప్రతిపాదించడం  కచ్చితంగా పేద, మధ్య తరగతి వర్గాలవారి పిల్ల లకు నష్టం కలుగుతుంది. ఒకవైపు పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన అందించి.. వారికి ఉన్నత అవకాశాలు కల్పించాలన్న కోరిక 95% మంది బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రులలో బలంగా ఉన్న నేపథ్యంలో.. ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు కొత్త విద్యావిధానంపై కేంద్ర ప్రతిపాదన ప్రతిబంధకంగా మారుతుంది. ఇంగ్లిష్‌ విద్యను పేద పిల్ల లకు దూరం చేయడం సమంజసం కాదు. ఇంగ్లిష్‌ను లేకుండా చేయడం అంటే మనల్ని మనం వెనక్కు నెట్టుకోవడమేనని ‘ఎం.సి. చాగ్లా’ ఏనాడో స్పష్టం చేశారు. రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉండే విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషలలోనే విద్యను బోధించాలని 1967లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినపుడు విద్యాశాఖ సహాయమంత్రిగా ఉన్న ఎం.సి. చాగ్లా దానిని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

ఇంగ్లిష్‌ భాషపై వ్యతిరేకత దేనికి?
భాషను జాతీయతా లక్షణంగా పరిగణించరాదని ఎంతోమంది విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఒక భాష.. అది హిందీ కావొచ్చు.. మరొకటి కావొచ్చు. దానిద్వారానే ప్రజ లలో దేశభక్తి కలుగుతుందనుకోవడం హేతుబద్ధత కాదు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌లో బోధన చేయాలన్న అంశానికి 95% మందికిపైగా తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లో మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇంగ్లిష్‌ మాధ్యమంలో విద్యాబోధన జరపడం అన్నది మాతృభాషాభివృద్ధికి వ్యతిరేకం కాదు. కేంద్రం తెచ్చిన కొత్త విద్యావిధానంలో పాఠ్య ప్రణాళికల్లో మార్పు తెచ్చి ప్రాథమిక స్థాయి నుంచి పరిశోధన వరకు ప్రాచీన, సమకాలీన సంస్కృతులు, చరిత్రలకు సంబంధించిన అంశాలను చేరుస్తామనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కూడా వివాదాస్పదం కానుంది. జాతి మొత్తానికి సంబంధించి కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసి వాటిని పాఠ్యాంశాలుగా చేయడం వల్ల.. భవిష్యత్తులో ప్రాంతీ యంగా అనేక సమస్యలు ఉత్పన్నం కావడానికి ప్రస్తుతం కేంద్రం అనుసరించబోయే విధానం అనుచిత బీజాలు నాటినట్లవుతుంది కదా! ఇది దేశ సెక్యులర్, ప్రజాస్వామ్య వ్యవస్థలకు విఘాతం కలిగించవచ్చు, విభేదాలకు దారితీయవచ్చు.

భారత రాజ్యాంగంలోని 254 అధికరణ ప్రకారం ‘విద్య’ ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి విద్యపై సమాన హక్కులు, బాధ్యతలు దఖలు పడ్డాయి. రాష్ట్రాలలో చేసే చట్టాలకు అనుగుణంగా చట్టాలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. పాఠశాల విద్యకు సంబంధించి.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకొంటున్నాయి. అయితే, నూతన విద్యావిధానం చట్టంగా రూపొం దిన తర్వాత.. రాష్ట్రాలు తప్పనిసరిగా దానినే అనుసరించాల్సిన అనివార్యత ఏర్పడితే.. అది మరో దేశవ్యాప్త సమస్యగా మారవచ్చు. కేంద్రం ప్రకటించిన ఈ నూతన విద్యావిధానం ఇంకా ముసాయిదా రూపంలో ఉంది కనుక ఇందులో అనేక సమగ్ర మార్పులు, చేర్పులు చేయవచ్చు. అందుకు దీనిపై  పార్లమెంట్‌లో విస్తృతమైన చర్చ జరగాలి. రాష్ట్రాల అభిప్రాయాలు కేంద్రం స్వీకరిం చాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. విస్తృత అంగీకారంతోనే కొత్త విద్యావిధానం విజయవంతం కాగలదు తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సరికొత్త సమస్యలకు బాటలు పరిచినట్లవుతుంది. 

వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్‌ విప్,
ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌
డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top