Ukraine Russia War: కానరాని యుద్ధ విరమణ

Dr S Sudhakar Babu Article On Russia Ukraine War - Sakshi

సందర్భం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రపంచానికి ఆశ్చర్యమేం కాదు. ఆశ్చర్యం ఏంటంటే.. ఉక్రె యిన్‌ ప్రతిఘటన రష్యాకు దీటుగా ఉండటం. ఉక్రెయిన్‌ తిరుగుదాడులతో రష్యన్‌ దళాలకు అపరిమితమైన నష్టం వాటిల్లుతుండటం! ఈ ఘర్షణల కదలికలను గమనిస్తుంటే వ్యూహా త్మకమైన అనేక భౌగోళిక, సామాజిక, ఆర్థిక సమస్యలు కేవలం ఆ రెండు దేశాలపైనే కాక యావత్‌ ప్రపంచం మీదా విస్తృత ప్రభావాన్ని చూపబోతున్నట్లే ఉంది. ట్రంప్‌ మాదిరిగా ఏకపక్షంగా కాకుండా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మిత్రపక్షాలన్నిటినీ కలుపుకొని రష్యాపై విధించిన ఆంక్షలకు ఆయా దేశాలు గట్టి మద్దతునే ఇస్తు న్నాయి.

యు.ఎస్‌. ఇంత చేస్తుందనీ, ఆంక్షల ప్రభావం ఇంతగా ఉంటుందనీ రష్యా ఊహించక పోయుండొచ్చు. సైనిక శక్తిలో ఆధిక్యం కలిగి ఉన్నప్పటికీ రష్యా లక్ష్యాలు నెరవేరకపోవడం అన్నది క్షేత్రస్థాయి సమస్యలకు ఒక సంకేతం అయింది. ఘర్షణలు ఇలా కొనసాగుతూ పోతే కనుక, సైనిక నష్టంతో పాటుగా.. రష్యా ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అఫ్గానిస్థాన్‌పై దాడి చేసిన చేదు ఫలితాన్నే రష్యా ఇక్కడా చవి చూడవచ్చు. అదే జరిగితే కనుక రష్యాకు ఇది మరొక విపత్తు అవుతుంది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం నుంచి కోలుకోవడానికి ఆ దేశానికి ఏళ్లు పట్టవచ్చు. 

మరొక ప్రధాన సమస్య.. ఉక్రెయిన్‌ నుంచి పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళుతున్న ఉక్రెయిన్‌ పౌరుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఇంత భారీగా శరణార్థి సంక్షోభం ఏర్పడటం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ 31 లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు దేశాన్ని వదిలి వెళ్లారని అంచనా. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. దీనర్థం ఏంటంటే ఉక్రెయిన్‌ సమస్య పొరుగు దేశాలకు సమస్యగా మారడం మొదలైందనీ; శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఆ దేశాలు సామాజికంగా, ఆర్థికంగా ఒత్తిళ్లకు గురి కాబోతున్నాయనీ; ఇప్పట్లో కనుక ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన జరకపోతే శరణార్థులుగా తమ భూభాగంలోకి వచ్చిన వారిని దీర్ఘకాలం తమ సంరక్షణలో ఉంచుకోక తప్పని స్థితిలో ఆ దేశాలు తమవైన సామాజిక, ఆర్థిక సంక్షోభాలలో పడిపోతాయనీ.

పైకి తెలియని మరొక అంశం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధం వల్ల పెరిగే ఆర్థిక భారం. 117 మిలియన్‌ డాలర్ల విలువైన బాండ్ల బకాయీలను రష్యా ఎలా తీరుస్తుందని మొన్నటి వరకు అన్ని దేశాలూ వేచి చూశాయి. గడువు తీరినా రష్యా తీర్చలేకపోయింది. మరో 150 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని రష్యా కంపె నీలు, ప్రభుత్వం బకాయీ పడ్డాయి. అందులో కంపెనీల అప్పు 105 బిలియన్‌ డాలర్లు. యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే రష్యా కరెన్సీ విలువ దాదాపు 35 శాతం పడిపోయింది. ఫలితంగా దేశంలో వడ్డీ రేట్లు, ధరలు పెరిగిపోయాయి. సాధారణ పరిస్థితుల్లోనైతే రష్యాకు ఈ అప్పులు తలకు మించిన మొత్తాలేమీ కాదు.

అయితే అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా తమ విదేశీ నిల్వల్లో సగభాగం.. దాదాపుగా 300 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల మొత్తాన్ని కదిల్చేందుకు లేకుండా పోయిందని రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. రష్యా బకాయీలు ఈ స్థాయిలో పేరుకు పోవడం అన్నది ఇది మూడోసారి. 1917లో ఒకసారి, 1998లో ఇంకోసారి ఇలా జరిగింది. రష్యా ప్రభుత్వం మాత్రమే ఈ ఆర్థిక దిగ్బంధంలో చిక్కుకుపోలేదు. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టిన ప్రపంచ సంస్థలు కూడా ఇరుకున పడ్డాయి. వాటికీ, రష్యా కంపెనీలూ ప్రభుత్వానికీ మధ్య ఆర్థికపరమైన మార్కెట్‌ లావాదేవీలు మరి కొన్నేళ్ల వరకైనా సజావుగా జరిగే అవకాశాల్లేవు.

దీనికి తోడు సరఫరాలో అంతరాయం వల్ల వస్తూత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే దగ్గరగా గమనించ వలసిన రెండు ప్రధాన దేశాలు.. రష్యా, చైనా. సంక్షోభ ప్రభావం అమెరికా, ఐరోపా దేశాలపై ఎంతగా పడినప్పటికీ వాటి ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలోని మిగతా దేశాల కన్నా కూడా దృఢంగా ఆ పర్యవసానాలను తట్టుకుని నిలబడగలవు. రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్‌ పుతిన్‌కు మాత్రం ఇది అతడి జీవితంలోనే ఒక పెను సవాలు. ఉక్రెయిన్‌పై దాడి వైఫల్యం రష్యాలో అతడి స్థానాన్ని బలహీన పరుస్తుంది.

నిరంకుశ పాలకులు శక్తిహీనం అయ్యారని తెలియగానే దీర్ఘకాలంగా అణచివేతలో ఉన్న ప్రత్యర్థి పక్షాలు ఒక్కసారిగా జూలు విదులుస్తాయి. ఇక మనం గమనించాల్సిన రెండో దేశం చైనా. తైవాన్‌ను కలిపేసుకునేందుకు ఆ దేశం కాచుకుని కూర్చుంది. అలా చేయకుండా చైనాను హద్దుల్లో ఉంచేందుకే రష్యాకు బుద్ధి చెప్పాలని పశ్చిమ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నట్లనుకోవచ్చు. చైనా కూడా ప్రస్తుత ఘర్షణలకు పూర్తి మద్దతుగా ఏమీ లేదు. కోవిడ్‌ తాజా కలకలం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని సతమతం చేస్తోంది. ధరలు పెరిగాయి. ఇంకా పెరిగితే కనుక దేశంలో అసంతృప్తి తలెత్తవచ్చు. ప్రస్తుత సంక్షోభంలోని విషాదం ఏంటంటే చివరికొచ్చేసరికి ఎవరూ విజేతలుగా మిగిలే సూచనలు లేకపోవడం, ఎవరూ కూడా వెనకడుగు వేసినట్లుగా కనిపించడానికి సిద్ధంగా లేకపోవడం. 


డా. ఎస్‌. సుధాకర్‌ బాబు 
వ్యాసకర్త హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top