అసమ్మతి గళాలపై అసహనం

Sayantan Ghosh Article on Mevani Arrest Exposes Dissent of Rulers - Sakshi

విశ్లేషణ

ప్రధానిపై ట్విట్టర్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీకి కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే, పోలీసులు ఆయనపై మరొక కేసు బనాయించి అరెస్టు చేశారు! ఆ కేసులోనూ మేవానీకి బెయిల్‌ ఇచ్చిన కోర్టు.. పోలీసులకూ, ప్రభుత్వానికీ వ్యతిరేకంగా చేసిన పదునైన వ్యాఖ్యలు ఆ రెండు వర్గాలూ ఆత్మపరిశీలన చేసుకోదగినవి. గతంలో రాజ్య దౌర్జన్యాలకు రాజకీయ శత్రుత్వమే ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఇప్పుడది సైద్ధాంతికంగా మారింది. అసమ్మతి గళాలపై ఇంత అసహనం ఏమిటి? అసమ్మతే కదా ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చేది! రాజకీయ వర్గం, పాలన, న్యాయవ్యవస్థ.. ప్రతి ఒక్కరూ అసమ్మతి హక్కును సమర్థించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఇదొక్కటే మార్గం.

గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీని ఏప్రిల్‌ 20న అస్సాం పోలీ సులు అరెస్టు చేశారు. మేవానీ గుజరాత్‌లోని పాలన్పుర్‌లో ఉండగా అస్సాంలోని కొక్రజర్‌ జిల్లా నుంచి వచ్చిన పోలీసులు... ప్రధానిపై ట్విట్టర్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా అక్కడికక్కడ రాత్రి 11.30కి నిర్బం ధించి, మర్నాడు తెల్లవారుజాము వరకు ప్రశ్నిస్తూనే ఉన్నారు. తర్వాత గుజరాత్‌ నుంచి అస్సాంలోని అజ్ఞాత ప్రదేశానికి ఆయనను తరలిం చుకెళ్లారు. మేవానీ ట్విట్టర్‌లో నరేంద్ర మోదీని ‘గాడ్సే భక్తుడు’ అన్నాడని కొక్రజర్‌ జిల్లా భవానీపుర్‌కు చెందిన అనూప్‌ కుమార్‌ డే అనే బీజేపీ సానుభూతిపరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మేవానీపై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసి, అస్సాం తీసుకెళ్లారు. 

మేవానీ సామాజిక న్యాయ కార్యకర్త, గుజరాత్‌లోని వడగామ్‌ నియోజకవర్గ శాసన సభ్యుడు. కాంగ్రెస్‌ మద్దతుగల ఈ యువ దళిత ఎమ్మెల్యే... పై కేసులో బెయిల్‌ పొందిన వెంటనే తిరిగి ఏప్రిల్‌ 25న అదే పోలీసులు నిస్సిగ్గుగా ఆయనను అరెస్టు చేశారు. విధి నిర్వ హణలో ఉన్న మహిళా పోలీసు అధికారిపై ‘దాడి’ చేసి, ఆమెను ‘దుర్భాష’లాడాడని అయనపై ఆరోపణ. ఆ కేసులోనూ మేవానీకి బెయిల్‌ లభించింది.  బార్పేట జిల్లా, సెషన్స్‌ కోర్టు బెయిల్‌ ఆదేశాలు జారీ చేస్తూ... పోలీసులకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ వ్యతిరేకంగా కొన్ని పదునైన పరిశీలనలను వ్యక్తం చేసింది. అయితే గౌహతి హైకోర్టు ఆ పరిశీలనలపై సోమవారం స్టే విధించింది.

మహిళా పోలీసు అధికారిపై దాడి చేసి, దుర్భాషలాడినట్లుగా జిగ్నేష్‌పై పోలీసులు రాసిన ఎఫ్‌.ఐ.ఆర్‌. వండివార్చినట్లుగా ఉందని బార్పేట కోర్టు పేర్కొంది. రాష్ట్రంలో ఇటీవల మితి మీరుతున్న పోలీసు చర్యలపై తమకు తాముగా పిటిషన్‌ను స్వీకరించాలని ఈ కింది కోర్టే గౌహతి హైకోర్టును అభ్యర్థించించినట్లు ఆ మధ్య మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ చక్ర వర్తి... మేవానీకి బెయిల్‌ ఉత్తర్వులను జారీ చేస్తూ... ‘మనం కష్టపడి సాధించిన ప్రజాస్వామ్యం పోలీసు రాజ్యంగా మారడమన్నది ఊహకు అందని విషయం’ అని వ్యాఖ్యానించారని కూడా మీడియా కథనాలు వెల్లడించాయి. మేజిస్ట్రేట్‌ ఎదుట నమోదు కోసం ఆ మహిళా పోలీస్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి ఈ కేసు నిజమేనని అంగీకరించవలసి వస్తే కనుక అప్పుడు మనం మన నేర శిక్షాస్మృతిని తప్పక తిరిగి రాయవలసి ఉంటుంది. సెషన్స్‌ కోర్టు పరిశీలనలపై గౌహతి హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇస్తూ... ‘ఆ పరిశీలనలు దిగువ కోర్టు అధికార పరిధికి మించినవి’ అని వ్యాఖ్యానించడాన్ని కూడా ఇక్కడ గమనించాలి.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చివరి దశలలో అవినీతితో విసిగిపోయిన దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారు. 2014లో నరేంద్ర మోదీ చరిత్రాత్మక మెజారిటీతో ప్రధానిగా ఎన్నికైనప్పుడు, ఈ ప్రభుత్వం నిజమైన అభివృద్ధికి కృషి చేస్తుందని పౌరులు ఆశించారు. అయితే, సరిగ్గా వ్యతిరేకంగా జరిగింది. బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) పెద్ద ఎత్తున అసమ్మతి గళాలను అణచివేయడం ప్రారం భించాయి. ఇంతకుముందు రాజ్య దౌర్జన్యాలకు రాజకీయ శత్రుత్వమే ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఆరెస్సెస్‌–బీజేపీ పాలనలో ప్రతి పక్షాల అణచివేత సైద్ధాంతికంగా మారింది. ప్రధానిని విమర్శిస్తూ ట్వీట్‌ చేసినందుకు ఐటీ చట్టం కింద... ఆ వెంటనే మరో కేసులో దాడి, దుర్భాషల ఆరోపణలతో జిగ్నేష్‌ అస్సాం పోలీసుల నిర్బంధానికి గురైన విధంగానే... దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, ఆ పార్టీల కార్యకర్తలు, పాత్రికేయులు కూడా అదే ప్రమాదానికి గురవుతున్నారు. బీజేపీ పాలనలో రాజ్యాధికార దుర్వినియోగం, చట్టవిరుద్ధ కార్యకలా పాల నిరోధక చట్టం (ఉపా) లేదా రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాల వాడకం గణనీయంగా పెరిగిందని అనేక అధ్యయనాలు, ప్రభుత్వ వివరాలు కూడా చూపిస్తున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో డేటా ప్రకారం 2019లో రాజద్రోహం కేసుల్లో 165 శాతం, ‘ఉపా’ కేసుల్లో 33 శాతం పెరుగుదల నమోదైంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గత నెలలో ఎటువంటి ముందస్తు సమా చారం లేకుండానే ప్రముఖ పాత్రికేయురాలు రాణా ఆయుబ్‌ విదేశాలకు వెళ్లడానికి ఉన్న అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆమ్నెస్టీ ఇంటర్నే షనల్‌ ఇండియా మాజీ డైరెక్టర్‌ అయిన ఆకార్‌ పటేల్‌ సరిగ్గా విమానం ఎక్కే ముందు ఇదే విధంగా సీబీఐ వేధింపులకు గురయ్యారు. పటేల్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఆదేశిం చినప్పటికీ, ఆ ఆదేశాలపై హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేయడం జరిగిందని పేర్కొంటూ సీబీఐ అక్కడికక్కడ ఆయన ప్రయాణాన్ని ఆపు చేయిం చింది. ఈ రెండు కేసుల్లో ఆయుబ్, పటేల్‌ల హక్కులను న్యాయ వ్యవస్థ సమర్థించడంతో ఈడీ, సీబీఐల ఉత్తర్వులు రద్దు అయిన ప్పటికీ, అసమ్మతిని వ్యక్తం చేసేవారిని రాజ్యం సహించదనే వాస్తవం మాత్రం స్పష్టమయింది?

గతంలో భీమా కోరెగావ్‌ కేసులో పోలీసులు, కేంద్ర విచారణ సంస్థల అధికారులు అనేకమంది ఉద్యమకారులనూ, న్యాయ వాదులనూ అరెస్టు చేశారు. మావోయిస్టు సంబంధాలు ఉన్నాయనీ, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనీ వారిపై ఆరోపణలు! జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రస్తుతం ఈ కేసును విచారి స్తోంది. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఎన్‌ఐఏ తనకు అనుకూలంగా అవాస్తవాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని బాంబే హైకోర్టులో ఆరోపణలు నమోదై ఉండటం! 

మానవ హక్కుల న్యాయవాది, భీమా కోరేగావ్‌ కేసులో నింది తుడు అయిన రోనా విల్సన్‌కి సంబంధించి బాంబే హైకోర్టు ముందుకు అప్పట్లో ఒక ముఖ్యమైన పరిశీలన వచ్చింది. పరిశోధనాత్మక పాత్రికేయుడు జోసీ జోసెఫ్‌ ‘ది సైలెంట్‌ కూ’ అనే తన పుస్తకంలో– ‘అర్సెనల్‌ కన్సల్టింగ్‌’ అనే అమెరికన్‌ ఫోరెన్సిక్‌ బృందం బొంబాయి హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో.. ‘రోనా విల్సన్‌ కంప్యూ టర్‌లోకి ఎవరో తమ విస్తృతమైన వనరులతో (సమయం సహా) 2016 జూన్‌ 13న చొరబడినట్లు తాము కనుగొన్నామనీ, అప్పట్నుంచి దాదాపు రెండు సంవత్సరాల పాటు వారు తారుమార్ల కోసం ఆ కంప్యూటర్‌ని నియంత్రించారనీ పేర్కొంది’ అని రాయడాన్ని విల్సన్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి  తెచ్చారు.

అసహనం, అసమ్మతిపై కక్ష కట్టడం అనేవి నేడు బీజేపీకి మాత్రమే పరిమితం కాలేదు. ఉద్ధవ్‌ ఠాక్రే, మమతా బెనర్జీ, కె. చంద్రశేఖర్‌ రావు వంటి బీజేపీయేతర ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల్లో అదే పని చేస్తున్నారు. ఈ రాజకీయ అసహనానికి ముగింపు పలకాలంటే రాజకీయ వ్యవస్థకే కాదు, న్యాయ వ్యవస్థకు కూడా కొన్ని దిద్దుళ్లు అవసరం. రాజ్య దౌర్జన్యాలకు సంబంధించిన చాలా కేసులలో అనేక విచారణ కోర్టులు, హైకోర్టులు, సుప్రీం కోర్టు.. ప్రజా ప్రయోజనాలకు రక్షణగా నిలబడ్డా యనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఇంకా అనేక మంది రాజకీయ కార్యకర్తలు బెయిల్‌ అభ్యర్థించినా తిరస్కరణకు గురై జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. తాజాగా, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం రాజద్రోహానికి సంబం ధించిన క్రూరమైన వలసరాజ్యాల చట్టంపై ఒక వైఖరిని తీసుకోవ డానికి ఆసక్తిని వ్యక్తం చేయడం ఎంతో సంతోషించదగిన విషయం. రాజకీయ వైషమ్యాలకు అంతమే లేకుండా పోతోంది. ఇది ప్రమాద కరం. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి వన్నె తెస్తుంది. రాజకీయ వర్గం, పాలన, న్యాయవ్యవస్థ ప్రతి ఒక్కరూ అసమ్మతి హక్కును సమర్థించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఇదొక్కటే మార్గం.

వ్యాసకర్త: శాయంతన్‌ ఘోష్‌
స్వతంత్ర పాత్రికేయుడు
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top