ఉత్తరాంధ్ర కాదు... కళింగాంధ్ర! | Sakshi Guest Column On Uttarandhra, Kalingandhra | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర కాదు... కళింగాంధ్ర!

Jun 22 2025 12:35 AM | Updated on Jun 22 2025 12:35 AM

Sakshi Guest Column On Uttarandhra, Kalingandhra

అభిప్రాయం

కళింగం ఆకుపచ్చని దుర్గమారణ్యాలు, కొండలూ, కోనలూ, నదులూ కలిగి నీలి చీరంచులా పొడవైన తూర్పు సముద్రంతో గోదావరీ– మహానదుల మధ్యన ఒప్పారిన దేశం. సముద్రం మీద వివిధ దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి, శత్రు దుర్భేద్యమైన ప్రదేశం. కళింగం ఆంధ్ర కంటే ప్రాచీనమైన దేశం. దీనిని వశపరచుకోవడానికి అశోకుడి ముందరా, ఆ తరువాతా ఎందరో రాజులూ, చక్రవర్తులూ ఉత్తరాది నుండి దాడులు చేశారు. 

ఇంకొక పక్క దక్షిణాది నుండి శాతవాహనులు, మాఠరులు తదితర వంశాల రాజులు దండయాత్రలు చేసి ఆక్రమించడం వలన ఈ నేల ఉత్తర భాగం ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ గాను; దక్షిణ భాగం కళింగాంధ్రగాను విడివడిపోయింది. కళింగాంధ్రనే ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో పైపైన ఆంధ్ర సంస్కృతి కనిపిస్తున్నా, సమాజ పొరల్ని విప్పి చూస్తే కళింగ సంస్కృతి అంతర్లీనంగా ద్యోతకమౌతుంది. 

అశోకుడికి ముందర ఈ ప్రాంతం అంతా ఆదివాసీలు, దళితులతోనే నిండి ఉండేది. అప్పట్లో అవైదికాలయిన జైన, బౌద్ధమతాలు ఇక్కడ వేళ్ళూనుకొని ఉండేవని ప్రాచీన దేవాలయాలు, సాలిహుండం, బొజ్జన్నకొండ వంటి చారిత్రక ప్రదేశాలు తెలియజేస్తుంటాయి. అందుకే ఈ కళింగంలో అడుగుపెట్టి తిరిగి వెళ్ళిన తరువాత వైదికులు అగ్నిష్టోమం, పునస్తోమం అనే ప్రాయశ్చిత్త కర్మలు చేయించుకునేవారు. 

కళింగాంధ్రకే ప్రత్యేకమైన దేవీశక్తులు: అసిరమ్మ, మొయ్యమ్మ, నీలమ్మ, కంచెమ్మ. వీరు గ్రామ సరిహద్దులో ఉంటూ గ్రామాన్ని కాపాడే దేవతలు. ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు వంతున వందలాది పేర్లతో అన్ని గ్రామాలలోనూ పూజలందుకుంటున్నారు. వీరు బహుజన దేవతలు. బహుజనులే పూజార్లు. ఏ వైదిక దేవతల ఉత్సవాలకూ రానంతమంది ఈ అమ్మవారి యాత్రలకు వస్తారు.  

పసుపు కుంకుమ, వేప కొమ్మలతో అలంకరించిన ఘటాన్ని అమ్మవారిగా వీథుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవాలకు విజయనగరం ప్రాంతంలో ‘సిరిమాను’ ఊరేగింపు తప్పనిసరి. జంతుబలులు సాధారణం. కొన్ని గ్రామాలలో అమ్మవార్ల పండుగల్లో దున్నను బలిచ్చే ఆచారం కూడా ఉంది.

అలాంటివే గావు పండుగలు, గ్రామపండుగలు. సాధారణంగా గ్రామంలోని గొల్లలంతా కలిసి చేస్తుంటారు. ఈ పండుగలో వంశపెద్ద మేకగొంతు కొరికి దేవుడికి సమర్పిస్తాడు. వంశానికి ఒక మేకను ఇలా బలి ఇస్తారు. గొంతు కొరికేటప్పుడు ఆ గావుమేక పెట్టే హృదయవిదారకమైన కేకను ‘గావుకేక’ అంటారు.  

ఆంధ్రబ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, పట్టుసాలీలు తప్ప కళింగంలోని ఇతర సామాజిక వర్గాలన్నీ మాంసాహారాన్ని తింటాయి. తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం దీపావళి, నాగులచవితి, భోగి, ఉగాది పర్వదినాల్లో కూడా ఇక్కడివారు మత్స్యమాంసాదులు తింటారు. 

కళింగంలో ఒకే గోడను ఆన్చి ఇటు ఒకటి, అటు ఒకటిగా రెండిళ్ళు కట్టుకుంటారు. ఒకదానిని అనుసరించి మరొకటి వరసగా చాలా ఇళ్ళు కట్టుకుంటారు. ఇలా వాసపూసుకుంటూ నిర్మించుకున్నదానినే ‘వాస’ అంటారు. పూరిళ్ళతోనే ఇలాంటి వాసలు నిర్మించుకొనేవారు. 

అలాంటి రెండు వాసలు ఎదురెదురుగా ఉన్నదానిని ‘వీథి’ అంటారు. వాస పదప్రయోగం కళింగాంధ్రలోనే ఉంది. వరుసగా, వాసలుగా కట్టుకున్న ఇళ్ళు కళింగానికి అద్దం పడుతుంటాయి. కళింగేతర ప్రాంతాలలో పేద అయినా విడిగా ఇల్లు, దానికి చుట్టూ దడి నిర్మించుకుంటాడు. 

వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చిన్ననాడే స్నేహాన్ని ప్రారంభిస్తారు. ఆడపిల్లలు ఆడపిల్లలతోను, మగపిల్లలు మగ పిల్లలతోను ఈ స్నేహం ఉంటుంది. సంప్రదాయంగా పెద్దలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ‘నేస్తరికం’ అంటారు. 

ఒకసారి నేస్తరికం కడితే వారి మధ్య అది జీవితాంతం కొనసాగవలసిందే!  శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఇవి అధికం. నేస్తరికాలు ఒరిస్సాలోనూ ఉన్నట్టు చాగంటి తులసి రాసిన ‘యాత్ర’ నవలలో చదవవచ్చు. నేస్తరికాలకు విడాకులుండవు. మాది విజయనగరం జిల్లా రాజాం ప్రాంతం. 

మా వంశంలో జరుగుతున్న కార్యక్రమాలకు ప్రక్కగ్రామానికి చెందిన వేరే సామాజిక వర్గానికి చెందిన ఒక వంశంవారు బియ్యం, కొత్త బట్టలు వగైరా కావిడలో పెట్టి పంపించేవారు. వారి ఇళ్ళలో జరిగిన సంబరాలకు కావిడ పెట్టి పంపించేవాళ్ళం. దీనిని ‘కావిడ పెట్టడం’ అని పిలిచేవారు. ఈ సంప్రదాయం ఇరువంశాలకు చెందింది కాగా... అర్ధశతాబ్ది కిందటివరకూ కొనసాగింది. సామాజిక మార్పుల ప్రభావంతో మా మధ్య ఇది కనుమరుగైంది.

ఇక్కడి ఆడవారి చీరకట్టు కూడా ప్రత్యేకమైనది. కుడిపైట, వెనక కుచ్చు గుండారతో ప్రత్యేకంగా కనపడేవారు. ముఖానికి దట్టంగా పసుపు రాసుకొని, రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు పెట్టుకొనేవారు. జాకెట్టు లేని ఆహార్యం వీరిది. కాళ్ళకు వెండి అందెలు, కడియాలు, బంగారు కొనచెవులు, ముక్కుకు కమ్మి ఇలా వీరి ఆభరణాలు కూడా ఆంధ్ర ఆడవారితో స్పష్టంగా విభేదించేవి. 

ఆడా, మగా చుట్ట కాల్చేవారు. చుట్ట కాలుతున్న వైపు నోట్లో పెట్టుకొని పీల్చే ‘అడ్డపొగ’ కళింగానికే ప్రత్యేకం. ఇలాంటి ఆహార్యం, అలవాట్లు గల చివరితరం స్త్రీలు కళింగాంధ్రలో అరుదుగాను, ఒరిస్సాలో విరివిగాను నేడు కనిపిస్తారు. ఆధునిక ప్రసార సాధనాల ప్రభావం వలన ఇక్కడి మహిళలు ఆంధ్రా ఆహార్యానికి అలవాటుపడ్డారు. 

పునాదిలో ఆంధ్రతో ఇలాంటి అనేక వైరుద్ధ్యాలున్న ఈ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా అనడం అన్యాయం. కళింగాంధ్ర అనడమే సబబు. 

గార రంగనాథం 
వ్యాసకర్త కవి, రచయిత  ‘  98857 58123

Advertisement
 
Advertisement
Advertisement