సైనిక విమాన తయారీకి ఊపు | Sakshi Guest Column On Military aircraft manufacturing | Sakshi
Sakshi News home page

సైనిక విమాన తయారీకి ఊపు

Oct 30 2024 12:11 AM | Updated on Oct 30 2024 12:11 AM

Sakshi Guest Column On Military aircraft manufacturing

విశ్లేషణ

మూడేళ్ల క్రితం యూరప్‌ కంపెనీ ‘ఎయిర్‌బస్‌’తో 56 సి–295 రవాణా విమానాలను కొనడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 16 స్పెయిన్‌లో తయారవుతాయి, మిగతా 40 ఇండియాలో ‘టాటా’(టీఏఎస్‌ఎల్‌) తయారు చేస్తుంది. సైనిక రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్‌ 28న వడోదరలో టీఏఎస్‌ఎల్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ తొలి ప్రైవేట్‌ సైనిక విమాన తయారీ కేంద్రం ఉపాధికి కూడా తోడ్పడుతుంది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కింద తొలి సి–295 విమానం 2026లో అందుబాటులోకి రానుంది. మొత్తం 40 విమానాలను 2031కల్లా అందించడం ద్వారా టీఏఎస్‌ఎల్‌ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

భారత వైమానిక దళానికి చెందిన పాత అవ్రో విమానాల స్థానంలో 56 సి–295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్‌ లో రూ. 21,935 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. ‘ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లెలో దాని తుది అసెంబ్లింగ్‌ (విడిభాగాల కూర్పు) కేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉంది. మిగతా 40 విమానాలను భారత్, స్పెయిన్‌ కుదుర్చుకున్న పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌) తయారు చేస్తుంది. 

భారత్‌లో రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్‌ 30న గుజరాత్‌లోని వడోదరలో టీఏఎస్‌ఎల్‌ చివరి దశ విడిభాగాల కూర్పు సదుపాయానికి శంకు స్థాపన చేశారు. అప్పటి ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధురీకి 2023 సెప్టెంబర్‌ 13న స్పెయిన్‌లోని సెవిల్లెలో తొలి విమానాన్ని అందజేశారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఈ విమానం 2023 సెప్టెంబర్‌ 25న హిందాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరింది. ‘రైనోస్‌’ అని కూడా పిలిచే ఐఏఎఫ్‌ 11 స్క్వాడ్రన్‌ ఇప్పటికే ఆరు సి–295 విమానాలను నడుపుతోంది.

తొలి ప్రైవేట్‌ సైనిక విమాన తయారీ
సి–295 బహుళ ప్రాయోజక సైనిక రవాణా విమానంగా రుజువు చేసుకుంది. 9.5 టన్నుల పేలోడ్, 70 మంది ప్రయాణికులు లేదా 49 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) శక్తిని గణనీయంగా పెంచింది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైమానిక దళాలు ఉప యోగిస్తున్నాయి. ఇంకా పలు సామర్థ్యాలు ఎయిర్‌బస్‌ సి–295 సొంతం. సైనిక రవాణా, ఆకాశమార్గంలో రవాణా, పారాట్రూపింగ్, వైద్య సహాయం కోసం తరలింపు, సముద్రప్రాంత గస్తీ, జలాంత ర్గాములను ఎదుర్కొనే యుద్ధ పరికరాలు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు పహారా, వాటర్‌ బాంబర్, గాలి పరంగా ముందస్తు హెచ్చరి కలు వంటి విస్తృత శ్రేణి మిషన్ లలో ఇది సమర్థంగా పని చేస్తుంది.

స్పెయిన్‌ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్‌ 28న వడోదరలో టీఏఎస్‌ఎల్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్‌ సైనిక విమాన తయారీ కేంద్రం. మేక్‌ ఇన్‌ ఇండియా కింద  తయారు చేసే తొలి సి–295 విమానం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది. చివరి విమానం 2031 ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్‌ దేశంలో విమాన రంగ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 

ఇందులో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్‌ఎంఈలు విమానాల విడి భాగాలను అందిస్తాయి. ఇప్పటికే 33 ఎంఎస్‌ఎంఈలను ఎయిర్‌బస్‌ గుర్తించింది. హైదరాబాద్‌లోని టీఏఎస్‌ఎల్‌ ప్రధాన కేంద్రంలో  విమా నాల విడిభాగాల తయారీ ప్రారంభమైంది. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమి టెడ్‌ (బీఈఎల్‌), భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ అందించిన ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను ఇప్పటికే విమానంలో అనుసంధానం చేశారు. అయితే, ఒప్పంద చర్చల తుది దశలో ఎక్కువ కాలం జాప్యం కావడంతో వీటిని అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం ఉంది. 

పెరిగే ఉపాధి కల్పన
తాజా ప్రయత్నం వైమానిక రంగంలో ఉపాధి కల్పనను పెంచు తుందని రక్షణ శాఖ చెబుతోంది. దేశంలో ఏరోస్పేస్, రక్షణ రంగంలో 42.5 లక్షలకు పైగా పనిగంటలతో ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు, 3,000కు పైగా పరోక్ష ఉద్యోగాలకు, అదనంగా 3,000 మధ్యతరహా నైపుణ్య ఉపాధి అవకా శాలకు వీలు కలుగుతుంది. ఇతర ఒరిజినల్‌ ఎక్విప్మెంట్‌ తయారీ దారుల (ఓఈఎం) నుంచి ఎయిర్‌బస్‌ తెప్పించే ఏరో ఇంజిన్, ఏవి యానిక్స్‌ మినహా అధిక శాతం నిర్మాణ భాగాలు భారత్‌లోనే తయారవుతాయి. 

ఒక విమానంలో ఉపయోగించే 14,000 విడి భాగాలలో 13,000 భాగాలు దేశంలోని ముడిసరుకుతోనే తయారవుతాయి. అయితే టీఏఎస్‌ఎల్‌ సకాలంలో 40 విమానాలను తయారు చేయడమే అసలైన పరీక్ష. ఇప్పటివరకు చాలా కార్యకలాపాలు ఎయిర్‌బస్‌ ద్వారా జరుగుతున్నాయి. టీఏఎస్‌ఎల్‌ కేవలం వాటిని అమలు చేస్తోంది. భారత వైమానిక రంగ సుస్థిర వృద్ధి కోసం స్థానిక ఉత్పత్తి, డీజీ ఏక్యూఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ క్వాలిటీ ఎష్యూరెన్స్‌) ద్వారా నాణ్యత నియంత్రణ, ‘సెమిలాక్‌’ ద్వారా భవిష్యత్తు ధ్రువీకరణ, దేశీయ తనిఖీ పరీక్షలు, మూల్యాంకనంపై దృష్టి సారించాలి.

రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదగడానికి గత పదేళ్లలో భారత ప్రభుత్వం చేసిన కృషి దోహదపడింది. రూ. 43,726 కోట్ల నుంచి రూ. 1,27,265 కోట్లకు పెరిగిన రక్షణ ఉత్పత్తుల్లో 21 శాతం వాటా ప్రైవేటు రంగానిదే. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమ తులు గత ఏడాది రూ. 21,000 కోట్లకు పైగా పెరిగాయి. కొన్ని విధాన సంస్కరణలతో పాటు మూలధన పరికరాల కొనుగోలు కోసం డిఫెన్స్‌ అక్విజిషన్‌ ప్రొసీజర్స్‌ – 2020లో స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐడీడీఎం) కేటగిరీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ గణాంకాలను సాధించడానికి దోహదపడింది. 

కొత్తగా కేటాయించిన రక్షణ బడ్జెట్‌లో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల ద్వారా కొనుగోళ్లకు కేటాయించారు. జాయింట్‌ యాక్షన్‌ (శ్రీజన్‌) పోర్టల్‌ ద్వారా స్వయం సమృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, సానుకూల స్వదేశీకరణ జాబితాలు (పీఐఎల్‌), ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ (ఐడీఈఎక్స్‌) ఏర్పాటు, 2024 సెప్టెంబర్‌ నాటికి రూ. 50,083 కోట్ల పెట్టుబడి అంచనాతో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్ల ఏర్పాటు వంటి అనేక ఇతర చర్యలను ప్రభుత్వం తీసుకుంది. 

2013 మేలో రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేసిన తరువాత ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చు కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆరేళ్ళు పట్టింది. డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి, ఒప్పందం తదుపరి చర్చలకు ఇంకా చాలా చేయాల్సి ఉంది.

దేశంలో సి –295 సైనిక రవాణా విమానాల ఉమ్మడి తయారీలో ఎయిర్‌బస్‌ – టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌) భాగ స్వామ్యం ఇప్పటివరకు సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక రంగానికి ఆశ, ప్రేరణగా నిలుస్తోంది. అయితే సివిల్‌ సర్టిఫైడ్‌ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ఎయిర్‌ క్రాఫ్ట్‌ వెర్షన్లను టీఏఎస్‌ఎల్‌ విస్తరిస్తుందో లేదో చూడాలి. 

ఈ భాగస్వామ్యం పూర్తి ప్రయోజనాలను పొందడానికి దేశంలో ఉత్పత్తి, భవిష్యత్తు ఎగుమ తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భరత సాధన దిశగా భవిష్యత్‌ ప్రయాణం క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఎయిర్‌బస్, టీఏ ఎస్‌ఎల్‌ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా అడుగులు ముందుకు పడ్డాయి. 

టీఏఎస్‌ఎల్‌ నిర్ణీత సమయానికి 40 విమానాలను తయారు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ తరహా భాగస్వామ్యాల విషయంలో ప్రభుత్వ రంగం ఐఏఎఫ్‌ అంచనాలను అందుకోలేదన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠం. మరి ఈ ఒప్పందం సఫలమైతే దేశంలో ప్రైవేట్‌ రంగ భాగ స్వామ్యం మరింత  ప్రబలమవుతుంది. వాటి సహకారం లేకుండా 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ కల నెరవేరదు.

అనిల్‌ గోలాని
ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ (రిటైర్డ్‌) 
వ్యాసకర్త సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ పవర్‌ స్టడీస్‌
అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement