మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి! | Sakshi
Sakshi News home page

మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!

Published Wed, May 1 2024 12:35 AM

Sakshi Guest Column On May Day

వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచ వ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో... మే డే వచ్చింది. సకల దేశాల జాతుల మతాల, కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మే డే. 19వ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో ఇంగ్లండ్‌ కేంద్రంగా యూరప్‌ అమెరికా లలో సంభవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా కార్మిక వర్గం పుట్టుకతోనే సంఘటిత సమరశీల పోరాటాలకు నాంది పలికింది.

ఆవిరి యంత్రం, జౌళి యంత్రాలు, రైళ్లు, టెలిగ్రాఫ్, మర మగ్గం తదితర అనేక యంత్ర సాధనాలను కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం జరిగింది. దీని వలన అంతకు ముందు ఉన్న భూస్వామ్య ఉత్పత్తి వ్యవస్థ నిర్మూలించబడి పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ అమలులోకి వచ్చింది. కార్మిక వర్గంపై పెట్టు బడిదారీ వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితుల మధ్య 18 – 16 గంటల పని నుండి 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం రక్తతర్పణ చేసిన దినమే మే డేగా ప్రసిద్ధి చెందింది. 

1923 మే 1వ తేదీన లేబర్‌ కిసాన్‌ పార్టీ నాయకుడు (ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ) సింగార వేలు ఎర్రజెండాను ఎగరవేయడంతో ఆనాటి నుండి భారతదేశంలో కార్మిక వర్గం మే డేను జరపడం కొనసాగుతూ వస్తున్నది. రష్యాలో మేడే ఉత్సవాల్లో అక్కడి కమ్యూనిస్ట్‌ నాయకులు 8 పని గంటల డిమాండ్‌తో పాటు చిన్న చిన్న ఆర్థిక డిమాండ్‌లను చేర్చడాన్ని లెనిన్‌ నిరసించినాడు. మే డే రాజకీయ స్వభావాన్ని తక్కువ చేసే ఆర్థిక డిమాండ్‌లు  చేర్చ డాన్ని లెనిన్‌ వ్యతిరేకించారు. మే డే సందర్భంగా కార్మిక వర్గం రాజకీయ లక్ష్య సాధన కోసం ప్రతిన పూనాలని ఆయన చెప్పారు.

ఆ తర్వాత కాలంలో మే డే అంతర్జాతీయ కార్మిక వర్గానికి కేంద్ర బిందువు అయింది. ఎన్నో రాజకీయ డిమాండ్లు వివిధ సందర్భాల్లో చేర్చబడ్డాయి. అంతర్జాతీయ కార్మిక వర్గ సంఘీ భావం, అందరికీ ఓటు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, వలసవాద అణచివేత వ్యతిరేకత, రాజకీయార్థిక సంఘాలు ఏర్పర చుకునే హక్కు, రాజకీయ ఖైదీల విడుదల వంటివి అందులో కొన్ని.

మే డే రాజకీయ చరిత్ర ప్రాముఖ్యాన్ని రూపుమాపేందుకు అమెరికా బూర్జువా సంస్కరణ వాద, అవకాశవాద సంఘ నాయ కులు మే డే నాడు ప్రదర్శనలు కాకుండా సెలవు రోజు అయిన ఆది వారం  జరపాలని 1890 లోనే నిర్ణయించారు. ఇటువంటి కుట్ర తోనే అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ అవకాశవాద నాయకులు మే డేకు ప్రతిగా సెప్టెంబర్‌ ఒకటిని లేబర్‌ డేగా నిర్ణయించారు. అమెరికన్‌  ప్రభుత్వ కుట్ర పూరితంగా మే మొదటి తేదీని బాలల ఆరోగ్య దినంగా ప్రకటించింది.

భారతదేశంలో మతోన్మాద అనుబంధ కార్మిక సంఘం అయిన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌  మే డేని గుర్తించకుండా ‘విశ్వ కర్మ దినం’ జరుపుతు న్నారు. మే డేకు ఉన్న వర్గ స్వభా వాన్ని మొద్దుబార్చడానికి మే డే రాజకీయ స్వభావాన్ని దెబ్బతీయ డానికి ప్రభుత్వాలు, వివిధ సంస్కరణ వాద అవకాశవాద ట్రేడ్‌ యూనియన్‌లు మే డేను రికార్డింగ్‌ డ్యాన్సులతో పండుగలుగా జరుపుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మే నెల మొదటి రోజున ప్రపంచ కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీలు అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు.

శ్రామిక ప్రజల దోపిడీకి, అణచివేతకు, మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్ట్‌ సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలనే మే డే చారిత్రక పిలుపును శ్రామిక వర్గం ఎత్తి పట్టాలి.

కార్మిక వర్గ అంతర్జాతీయత వర్ధిల్లాలి!
ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి!! 

– జంపన్న ‘ మార్క్సిస్ట్‌–లెనినిస్ట్‌ నాయకుడు
(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే) 

Advertisement
 
Advertisement