విదేశాలలో నివసిస్తున్న చాలామంది భారతీయులకు, నేడు మన దేశం నిలు వెత్తు పురోగతికి సగర్వ చిహ్నంగా కనిపి స్తుంటుంది. వారు ఇక్కడి తళతళలాడే విమానాశ్రయాలు, ఆధునిక రహదా రులు, వేగంగా దూసుకుపోతున్న ఐటీ కారిడార్‌లను చూస్తుంటారు కనుక అది సహజమే. కానీ, ఏదైనా ఒక వ్యవస్థను సరిగ్గా ‘లెక్కించి’ చూడనంత వరకు ఆ వ్యవస్థ బయటకు కనిపించే తీరుకు, వాస్తవం ఏమిటన్న దానికి పొంతన ఉండటం అరుదు అని, ఇండి యన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఒక శాస్త్రవేత్తగా నాకు అనిపిస్తుంటుంది.
ఆధారాలు, గణాంకాలు లేకుండా, కేవలం ఒక నమ్మకంతో దేశాన్ని చూసి మురిసిపోవడమే ఇక్కడ సమస్య. ఈ ప్రవాస భారతీయుల ఉల్లాసభరిత భావోద్వేగం అనేది ఒక చిన్న అంచనా లోపం వల్ల వస్తుంది. అదేమిటంటే... మనం ఈనాటి భారతదేశాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చడం లేదు. మన చిన్ననాటి భారతదేశంతో పోల్చుకుంటున్నాం. మన చిన్నప్పుడు ఉన్నప్పటి భారతదేశం వనరుల కొరతతో, తక్కువ అవకాశాలతో ఉండేది. ఒక దేశాన్ని ఆ దేశపు పాత రోజులతో మాత్రమే పోల్చి చూసినప్పుడు... ప్రపంచ దేశాల రేసులో ప్రస్తుతం అది ఏ స్థానంలో ఉందనే అసలు నిజాన్ని మనం గమనించలేకపోతాం.
ఏం చూస్తే అదే కనిపిస్తుంది!
భారతదేశ వాస్తవ పరిస్థితి ప్రవాస భారతీయులకు తెలిసే అవకాశం లేదు. వారు ఇక్కడకు వచ్చినప్పుడు తమకు నచ్చిన వాటి వైపు మాత్రమే చూడగల ఒక మనోస్థితికి (సెలెక్షన్ బయాస్) లోనవు తారు. సంపన్నులైన తమ బంధువుల ఇళ్లలో గడపడం, దేశ సగటు ఆదాయం కంటే ఐదు నుండి పది రెట్లు ఎక్కువగా సంపాదించే బెంగళూరు, హైదరాబాద్ లేదా గురుగ్రామ్ వంటి ఆధునిక ఐటీ హబ్‌లలో తిరగడం వల్లనే వారి అభిప్రాయాలు ఏర్పడతాయి. వారు ఇక్కడ కేవలం మొదటి 1–5 శాతంలో ఉండే అత్యంత సంపన్న వర్గాన్ని మాత్రమే చూసి, అదే మొత్తం భారతదేశం అనుకుంటారు.
ఇలా, వాస్తవాలకు దూరంగా ఉండటం అన్నది దేశభక్తి వల్ల మరింత ఎక్కువవుతుంది. విదేశాల్లో ఉండే చాలామంది భారతీ యులు, ప్రపంచ వేదికపై భారత ప్రధాని ఒక బలమైన నాయకు డిగా కనిపించినప్పుడు ఎంతో గర్వపడుతుంటారు. లోతుగా చూసిన ప్పుడు ఇలాంటి దౌత్య ప్రదర్శనలు భారతదేశ స్థితిగతులను ఏ మాత్రం ప్రతిబింబించేవి కావు.
లెక్కల్లోనే నిజాలు ఉంటాయి!
ప్రస్తుతం భారతదేశ తలసరి జీడీపీ దాదాపు 2,400 డాలర్లకు పెరిగినప్పటికీ, అదే సమయంలో మన తోటి దేశాలైన వియత్నాం 4,300 డాలర్లకు, ఇండోనేషియా 4,700 డాలర్లకు దూసుకెళ్లాయి. భారతదేశ వృద్ధి నిజమే అయినప్పటికీ, మిగతా మన లాంటి దేశాలతో పోల్చినప్పుడు అది అంత అసాధారణమైనదేమీ కాదు.
మానవ జీవన ప్రమాణాలైన సగటు ఆయుర్దాయం, శిశు మర ణాల రేటు వంటి ప్రాథమిక విషయాలలో భారతదేశం ఇంకా వెనుక బడే ఉంది. ఉదాహరణకు, భారతదేశంలో ప్రతి 1,000 జననాలకు శిశు మరణాల రేటు దాదాపు 26గా ఉంది. ఇది వియత్నాం (14) కంటే దాదాపు రెట్టింపు, చైనా కంటే (6) చాలా ఎక్కువ. బహుశా అన్నింటికంటే విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారతదేశం ఎప్పుడూ చివరి వరుసలోనే ఉండటం! ఇటీవల 127 దేశాలలో ఇండెక్స్‌లో మన దేశం 105వ స్థానంలో నిలిచింది. పోషకాహార లోపం అనేది ఒక తీరని ‘అప్పు’ లాంటిది. ఇది భవిష్యత్తులో దశాబ్దాల పాటు పిల్లల మానసిక వికాసం, దీర్ఘకాలిక ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఇంకా చెప్పాలంటే, యువత నిరుద్యోగిత అంచనాలు
మొండిగా అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా మహిళా కార్మిక భాగ స్వామ్యం కేవలం 20 శాతం వంటి స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు మనం దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పలేం. ఇది బంగ్లాదేశ్ (38 శాతం) లేదా వియత్నాం (70 శాతం) కంటే చాలా తక్కువ. ఒక దేశం తన జనాభాలో సగభాగాన్ని (మహిళలను) దేశ వృద్ధి చక్రం నుండి పక్కన పెట్టి, ఎప్పటికీ నిరంతర సంపదను లేదా పురోగతిని సాధించలేదు.
ఈ గణాంకాలను చూపించినప్పుడు, ప్రవాస భారతీయులు తరచూ ఒకే రకమైన వాదనతో స్పందిస్తుంటారు: ‘వ్యూహాత్మక పెట్టుబడుల ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయి’ అని. కానీ ‘ఆర్ అండ్ డి’, ‘సిస్టమ్ ఎనాలిసిస్’ల ప్రపంచంలో దీనిని ఊహఅంటారు కానీ, విశ్లేషణ అనరు. దేశ పురోగతిని ప్రస్తుత ఫలితాల ఆధారంగా అంచనా వేయాలి కానీ, భవిష్యత్తు ఆశల ఆధారంగా కాదు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ముఖ్యమైనవే, కానీ వాటికవిగా మెరుగైన ఆరోగ్యం, ఎక్కువ ఆదాయాలు లేదా బలమైన ప్రభుత్వ సంస్థల సమగ్రతగా మారిపోవు. దీనర్థం, వ్యవస్థలుమనం బాగుపడుతున్నాయని నమ్మినంత మాత్రాన బాగుపడవు. వాటిని మనం నిజాయితీగా కొలిచి చూసి, బాగుపరచుకున్నప్పుడు మాత్రమే అవి మెరుగుపడతాయి.
విద్య, ఉపాధి, వైద్యం ప్రధాన
భారతదేశ పురోగతికి అసలైన కొలమానం ఎక్స్‌ప్రెస్‌వేల సంఖ్య లేదా ప్రపంచ వేదికపై మన దేశ నాయకులకు ఉన్న గుర్తింపు కాదు. అసలైన కొలమానం ఒక సగటు భారతీయుడి జీవితం. పౌరులు అప్పుల పాలు కాకుండా నాణ్యమైన వైద్య సేవలను పొంద గలుగుతున్నారా? వారి పిల్లలు ఆధునిక ప్రపంచానికి సరిపోయేలా నాణ్యమైన విద్యను అందుకోగలుగుతున్నారా? ఆ పిల్లలకు ఆత్మ గౌరవాన్ని, భద్రతను ఇచ్చే స్థిరమైన ఉపాధి (ఉద్యోగం) దొరుకు తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం గనుక సందేహాస్పదంగా ఉంటే, ఆ దేశ పురోగతి ఇంకా అసంపూర్ణంగా ఉన్నట్లే లెక్క.
ఉద్వేగంతో వేడుకలు చేసుకునే దేశభక్తి కాదు, ఆలోచనాత్మక మైన ఆధారాలతో కూడిన దేశభక్తి మనకు అవసరం. దేశాన్ని ఎంత గానో ప్రేమిస్తూ, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించిన నిజాన్ని నిజాయితీగా చెప్పగలిగే దేశభక్తి మనకు కావాలి.భారతదేశం కేవలం తన ‘భావపూర్వక సగర్వత’ వల్ల శక్తిమంతంగా మారదు.
అది నిజాయితీతో కూడిన సమీక్ష, కచ్చితమైన లెక్కలు, సామాన్య పౌరుడిని పైకి తీసుకురావాలనే సంకల్పం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచం భారతదేశాన్ని కేవలం భావో ద్వేగ కథనాలను చూసి గౌరవించదు, కళ్లముందు కనిపించే ఫలితా లను చూసి గౌరవిస్తుంది. ప్రవాస భారతీయుల ఉత్సాహం అర్థం చేసుకోదగినదే అయినప్పటికీ, భారతదేశ భవిష్యత్తు కోసం క్షేత్ర స్థాయి వాస్తవికత కూడా ఆ ఉత్సాహానికి తగ్గట్టుగా మారాలి.

మేడా పరమేశ్వర రెడ్డి , వ్యాసకర్త ఇండో–అమెరికన్ రిటైర్డ్ సైంటిస్ట్, ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్


