'సంక్షోభాలు' నేర్పుతున్న గుణపాఠాలు | Sakshi Guest Column On Fertilizer Crises to farmers | Sakshi
Sakshi News home page

'సంక్షోభాలు' నేర్పుతున్న గుణపాఠాలు

May 22 2026 12:42 AM | Updated on May 22 2026 12:43 AM

Sakshi Guest Column On Fertilizer Crises to farmers

విశ్లేషణ

వర్షాల అనిశ్చితి, ఎరువుల దిగుమతి ఆధారితం, భూమి క్షీణత, అధిక నీటి పంటలపై మోజు – ఈ నాలుగు కలిసి భారత వ్యవసాయాన్ని సున్నితమైన స్థితిలోకి నెట్టాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ సమస్య తీవ్రంగా వున్నది. 2026లో ఎల్‌నీనో ముప్పు, పశ్చి మాసియా ఉద్రిక్తతల వల్ల పెరుగుతున్న ఎరువుల ఖర్చులు రైతాంగానికి తాత్కా లిక ఇబ్బందే కాక, వ్యవసాయం చేసే పద్ధతులలో పూర్తి మార్పు అత్యవసరమని సూచిస్తున్నాయి.

చిన్న మార్పులే పెను సవాళ్లు
వాతావరణ మార్పులు ఒక్కసారిగా కనపడవు. కొంచెం ఎక్కువ ఎండలు, ఆలస్యంగా వచ్చే వర్షాలు, పంట మధ్యలో పొడి విరామాలు – మొదట ఇవి చిన్న మార్పుల్లా కనిపిస్తాయి కానీ కొన్ని సంక్షోభాలు సమాజాన్ని తన జీవన విధానాన్ని, ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఆహార ఉత్పత్తి విధానాన్ని తిరిగి ఆలోచించేలా చేస్తాయి. కోవిడ్‌ మహమ్మారి తర్వాత ఆరోగ్యం, పోషకాహారం, స్థానిక ఆహార వ్యవస్థలు, ప్రకృతి ఆధారిత జీవన విధానాలపై కొత్త చర్చ ప్రారంభమైనట్లే, ఇప్పుడు వ్యవసాయ రంగం కూడా అలాంటి మరో మలుపు దగ్గర నిలిచింది.

భారత వాతావరణ విభాగం ఈ ఏడాది దక్షిణ–పడమటి రుతుపవన వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే తక్కువగా, 92 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ వాతావరణ అంచనాలు కూడా జూన్‌ నుంచి ఆగస్టు మధ్య ఎల్‌నీనో పరిస్థితులు బలపడే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో, గ్యాస్, అమ్మోనియా, సల్ఫర్, డీఏపీ, యూరియా వంటి ఎరువుల సరఫరాపై అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒత్తిడి పెంచు తున్నాయి. ఎల్‌నీనో భారత రుతుపవనాలను బలహీన పరుస్తుంది. వర్షాలు వచ్చినా వాటి పంపిణీ అసమానంగా ఉంటుంది. ఖరీఫ్‌ కాలంలో విత్తన దశలో ఆలస్యం, పుష్ప దశలో తేమ కొరత, చివరికి దిగుబడి తగ్గుదల – ఇవి రైతు ముందుకు వచ్చే ప్రధాన ప్రమా దాలు. రాయలసీమ, తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా వంటి వర్షాధార ప్రాంతాలు మరింత సున్నితంగా ఉంటాయి.

ప్రమాదమా? మార్పునకు అవకాశమా?
ఎరువుల విషయంలోనూ పరిస్థితి అంతే ఆందోళనకరంగా ఉంది. భారతదేశం యూరియా, డీఏపీ, మిశ్రమ ఎరువులు, అలాగే వాటి తయారీకి అవసరమైన సహజ వాయువు, అమ్మోనియా, సల్ఫర్‌ వంటి ఇన్‌ పుట్లలో గణనీయంగా దిగుమతులపై ఆధారపడు తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చిన్న మార్పే భారత రైతుకు పెద్ద భారం కావడం మన వ్యవసాయ విధానం స్వయం సమృద్ధి నుంచి ఎంత బాహ్య ఆధారంగా మారిందో చూపిస్తోంది. తెలంగాణలో ఎరువులు సగటున హెక్టారుకు 280–297 కిలోలు వాడితే, ఆంధ్ర ప్రదేశ్‌లో 230–240 కిలోలు వాడుతున్నారు. 

జాతీయ సగటు హెక్టారుకు 130 కిలోలు మాత్రమే. దీనికి ప్రధాన కారణాలు: వరి తర్వాత వరే వేయటం, పప్పుధాన్యాల విస్తీర్ణం తగ్గిపోవటం, భూమిలో సేంద్రియ పదార్థం కూడా తగ్గిపోవటం. కనీసం 1.0 నుంచి 1.5 ఉండాల్సిన స్థితి నుంచి ఇది 0.3 శాతం కంటే తక్కువకు పడిపోయింది. దీని వలన తేమను పట్టి ఉంచే గుణం, సమతుల్యమైన పోషకాలు అందించలేని పరిస్థితులలో మన భూములు వున్నాయి. దీనికి తోడు, ఎక్కువ సార్లు దున్ని, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వాడటం వలన, సంవత్సరం అంతా భూమి కప్పి ఉంచే పరిస్థితి లేకపోవటం వలన, మట్టి కొట్టుకు పోవటం, 5–6 అంగు ళాల కింద నెల గట్టి పడిపోవటం జరిగి నీరు కానీ, వేర్లు కానీ లోపలి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మనం ఎల్‌ నీనో ప్రభావాన్నీ, రసాయనిక ఎరువులు అందక పోవటాన్నీ చూడాలి. 

ఈ సంక్షోభాన్ని కేవలం ప్రమాదంగా మాత్రమే చూడనక్కర లేదు. ఇది మార్పునకు అవకాశం కూడా. దశాబ్దాలుగా ప్రభుత్వ కొనుగోలు విధానాలు, బోనస్‌లు, సబ్సిడీలు, సాగునీటి ప్రాధాన్యం– అన్నీ కలిసి వరి వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాయి. తెలంగాణలో గత 15 ఏళ్లలో వారి విస్తీర్ణం 250% పైగా పెరిగింది. అనిశ్చిత వర్షపాతం, ఖరీదైన ఎరువుల కాలంలో అదే పంట నమూనాను యథాతథంగా కొనసాగించడం ఆర్థికంగా, పర్యావరణపరంగా ప్రమాదకరం.

సుస్థిర మార్గమే శరణ్యం
వరి విస్తీర్ణాన్ని ఒక్కసారిగా కాదుగానీ క్రమంగా తగ్గిస్తూ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వైపు సాగును మళ్లించాలి. జొన్న, సజ్జ, రాగి, కొర్రల వంటి చిరుధాన్యాలు తక్కువ నీటితో పెరుగు తాయి, పొడి పరిస్థితుల్లో కూడా నిలబడగలవు. కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పుధాన్యాలు నేలలో సహజంగా నత్రజని నిల్వ చేయడంలో సహాయపడతాయి. దీంతో రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. రైతు ఖర్చు తగ్గి, కుటుంబాల పోషకాహార భద్రత  మెరుగుపడుతుంది. ఈ మార్పు రైతు ఒంటరిగా చేయలేడు. విధానాలు మారాలి. వరికి లభించే కొనుగోలు హామీలు, ప్రోత్సా హక ధరలు, బోనస్‌లు, ఇన్‌ పుట్‌ సబ్సిడీలు – వాటిలో కొంత భాగాన్ని పొడి భూమి పంటల వైపు మళ్లించాలి. రైతు మార్పు చేయ డానికి మార్కెట్‌ హామీ, నిల్వ సదుపాయం, ప్రాసెసింగ్‌ వ్యవస్థ, విలువ ఆధారిత విక్రయం, స్థానిక కొనుగోలు మద్దతు అన్నీ కలిసి రావాలి. పంటల వైవిధ్యం గురించి మాట్లాడటం సరిపోదు; దానికి తగిన ప్రోత్సాహక వ్యవస్థను ప్రభుత్వం నిర్మించాలి.

నేల ఆరోగ్య పునర్నిర్మాణం అత్యవసరం. ఏళ్లుగా అధిక రసాయన ఎరువుల వాడకం, పంట అవశేషాల దహనం, సేంద్రియ పదార్థాల నిర్లక్ష్యం వల్ల నేలలో సేంద్రీయ కర్బనం తగ్గిపోయింది. సేంద్రీయ పదార్థం తగ్గిన నేల నీటిని నిల్వ ఉంచుకోలేకపోతుంది. కొద్దిరోజుల పొడి వాతావరణానికే పంట ఒత్తిడికి గురవుతుంది. ఎరువు వేసినా పూర్తిగా ఉపయోగ పడదు. నేల బలహీనమైతే వాతా వరణ షాక్‌కు వ్యవసాయం మరింత సులభంగా దెబ్బతింటుంది. అందుకే నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచడం వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా భావించాలి. మల్చింగ్‌ వల్ల వేసవిలో నేలనుండి నీటి ఆవిరి పోవడం తగ్గుతుంది. 

కవర్‌ క్రాప్స్‌ నేలను ఎండకు నేరుగా గురి కాకుండా కాపాడతాయి. సన్‌ హెంప్, ధైన్చా వంటి పచ్చి రొట్ట పంటలు నేలను సహజంగా సారవంతం చేస్తాయి. ఇవి పాత పద్ధతులు మాత్రమే కావు; భవి ష్యత్తు వ్యవసాయానికి అవసరమైన తెలివైన వ్యూహాలు. తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదంతో, ఆరోగ్యకరమైన నేలతో, స్థిరమైన నీటి వినియోగంతో, పోషకాహార భద్రతతో సాగు చేసే విధానాల వైపు మళ్లాల్సిన సమయం వచ్చింది. ఎల్‌నీనో, ఎరువుల సంక్షో భాలు వ్యవసాయాన్ని స్థిరమైన మార్గంలోకి నడిపించే అవకాశం కావచ్చు. మార్పు వస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఆ మార్పుకు మనం సిద్ధమవుతామా లేదా అనేదే అసలు ప్రశ్న.

డా‘‘ జి.వి.రామాంజనేయులు
వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,
‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement