మనమెందుకు ఇలా ఉన్నాం!

Sakshi Guest Column On Britain Politics

కామెంట్‌

బ్రిటన్‌ మారిపోయింది! నిగ్గర్స్, బ్లాక్స్, బ్రౌన్‌ స్కిన్డ్‌ పీపుల్‌... ఇలాంటి జాత్యహంకార దూషణలేవీ పనిగట్టుకుని ఇప్పుడు అక్కడ లేవు. అక్కడి తెల్లవాళ్లు... తమలా ‘తెల్లగా’ లేని వాళ్లను సైతం తమ తలపై ఇష్టంగా మోస్తున్నారు. ఓట్లేసి మరీ కిరీటధారులను చేస్తున్నారు. దేశ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు.

అక్కడి నాన్‌– వైట్స్‌లో ఒకరు ఇప్పుడు ‘ప్రధాని’! మరొకరు ‘ఫస్ట్‌ మినిస్టర్‌’! ఇంకొకరు మేయర్‌! సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఒకప్పుడు లోకాన్ని ఏలిన ఈ అగ్రరాజ్యం... ‘‘మమ్మేలు గణనాథా... మాలోని చెడులను మాయింపగా...’’ అన్నట్లుగా శ్వేత జాతేతరుల పాలనకు మొగ్గు చూపుతోంది. వలసలన్న వివక్ష చూపక విశ్వమానవ భావనకు తలవొగ్గుతోంది. మరి మనం ఎందుకు భిన్నంగా ఉంటున్నాం? 

తోటి పౌరులను – వారి పూర్వీకులు శతాబ్దాల క్రితమే ఇక్కడ జన్మించి ఉన్నవారైనప్పటికీ, సాటి భారతీయుల్లా హిందువులలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నప్పటికీ – వారిని ఎందుకు వేరుగా చూస్తున్నాం? బ్రిటిషర్‌లను జాత్యంహంకారులు అని కదా మనం తరచూ అంటుంటాం. ఇప్పుడు చెప్పండి, మనకు ఏ విశేషణం సరైనది? మనల్ని మనం ఏమని పిలుచుకోవాలి?

ఒకవేళ అది గానీ నిజంగా జరిగి ఉండకపోతే, అది జరుగుతుందని నమ్మడానికే కష్టంగా ఉండేది. అదొకవేళ కల్పితం అయివున్నా ఆ కల్పన కూడా అతీంద్రియ భావనలా అనిపించేది. అయినప్పటికీ అది జరిగింది! నన్ను నిరుత్తరుడిగా మిగిల్చింది. నేడు బ్రిటన్‌లో అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉండే మూడు అత్యున్నత స్థానాలలో భారత్‌ లేదా పాకిస్తాన్‌ సంతతి వారు ఉన్నారు మరి! ఐదేళ్ల క్రితమైతే ఇలా జరగడం అన్నది ఊహకు సైతం అసాధ్యమైన సంగతే. గత వేసవిలో రిషీ సునాక్‌ కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వం కోసం పోటీ పడి లిజ్‌ ట్రస్‌ చేతిలో ఓడిపోయి నప్పుడైతే... ఇక తమ జీవితకాలంలో ఎప్పటికైనా గోధుమ రంగు చర్మం కలిగివున్న ఒక వ్యక్తిని బ్రిటన్‌కు ప్రధాన మంత్రిగా చూస్తామని ఎవరూ అనుకుని ఉండరు.

అందరూ ఎన్నికైనవాళ్లే!
కానీ అక్టోబర్‌లో భారతీయ సంతతికి చెందిన హిందూ మతస్థుడు రిషీ సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయ్యారు. గతవారం స్కాట్లాండ్‌ ఫస్ట్‌ మినిస్టర్‌ (ప్రధాని)గా పాకిస్తానీ ముస్లిం హమ్జా యూసఫ్‌ బాధ్యతలు చేపట్టారు. పాకిస్తానీ మూలాలున్న మరొక ముస్లిం సాదిఖ్‌ ఖాన్‌ 2016 నుంచీ లండన్‌ మేయరుగా కొన సాగుతున్నారు. ఆయన ఇప్పుడు తన రెండవ టర్మ్‌లో కొనసాగు తున్నారు. ఈ ముగ్గురూ ఎన్నికైన వారే తప్ప నియామకంతో వచ్చి దర్జాగా పీఠంపై కూర్చున్నవారు కాదు. వీళ్లను ఎన్నుకున్న ఓటర్లలో అత్యధికులు శ్వేత జాతీయులే. 2021 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్‌ జనాభాలో భారతీయ సంతతికి చెందిన వారు కేవలం 2.86 శాతం. పాకిస్తానీ మూలాలు ఉన్న ప్రజలైతే ఇంకా తక్కువగా 1.8 శాతం మాత్రమే.

ఇది నాకు 1976 డిసెంబరు నాటి కేంబ్రిడ్జి యూనియన్‌ చర్చను గుర్తుకు తెస్తోంది. పదవి నుంచి నిష్క్రమిస్తున్న ఆంగ్లో–పోలిష్‌ సంతతి యూనియన్‌ ప్రెసిడెంటు పీటర్‌ ఫుడకోవ్‌స్కీ నుంచి కొత్త అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భం అది. అధ్యక్ష పదవి చర్చకు సంబంధించిన తీర్మానంలో ఆ వెళ్లిపోతున్న పీటర్‌ మాట్లాడుతూ... ‘‘ఈ యూనియన్‌ శ్వేత జాతీయులు కాని వారి చేతుల్లోకి  వెళుతోంది’’ అని తమాషాకు అన్నారు. ఆయన తమాషా యాభై ఏళ్ల తర్వాత నిజమైంది. 

మన ప్రవర్తన విరుద్ధం
బ్రిటన్‌ చిరకాలం వర్ధిల్లాలి. ఎంత అద్భుత మైన దేశం! మరొకటి కూడా జోడించి చెబుతాను. మిగతా ప్రపంచ దేశాలకు బ్రిటన్‌ ఒక దీపస్తంభం. ముఖ్యంగా మనకు! వలస వచ్చిన హిందువులు, ముస్లింలలో రెండవ తరం, మూడవ తరం వారిని కూడా బ్రిటన్‌ తన ప్రభు త్వంలో కీలక స్థానాలకు చేర్చి కూర్చోబెట్టింది. గొప్ప సంగతేమంటే దీనికి స్థానికులెవరూ అభ్యంతరం చెప్పడం లేదు. అరచి గీపెట్టడం లేదు. ప్రజా నిరసనలు లేవు. 

మన దగ్గర చూడండి. అందుకు పూర్తిగా విరుద్ధం. మనం మన తోటి ముస్లిం పౌరులను – వారి పూర్వీకులు శతాబ్దాల క్రితమే ఇక్కడ జన్మించి ఉన్నవారైనప్పటికీ, సాటి భారతీయుల్లా హిందువులలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నప్పటికీ – ‘పాకిస్తాన్‌ వెళ్లిపోండి...’ అని వారికి ఎప్పుడూ చెబుతూ ఉంటాం. మన రాజకీయ నాయకులు వారిని బహిరంగంగా దూషిస్తుంటారు. వారి ఇళ్లను పోలీసులు చట్ట బద్ధం కాని పద్ధతుల్లో కూలగొడుతుంటారు. శ్రీరామనవమి సంద ర్భంగా మనం వారి దుకాణాలను బలవంతంగా మూత వేయిస్తాం. వారిపై ‘లవ్‌ జిహాద్‌’ నిందను వేస్తాం. కొన్నిసార్లు వారి గుర్తింపును కూడా తిరస్కరిస్తాం. వారిని హైందవ ముస్లింలుగా వ్యవహరిస్తాం. చెదపురుగులు అని కూడా అంటాం. 

బ్రిటిషర్‌లను జాత్యహంకారులు అని కదా మనం తరచూ అంటుంటాం... ఇప్పుడు చెప్పండి, మనకు ఏ విశేషణం సరైనది? మనల్ని మనం ఏమని పిలుచుకోవాలి? సమాధానం చెప్పండి అని నేను మిమ్మల్ని బలవంతం చేయడం లేదు. అలా అడిగితే అది మిమ్మల్ని రెచ్చగొట్టినట్లు అవుతుంది, లేదంటే జవాబు కోసం మొండిపట్టు పట్టినట్లుగా ఉంటుంది. కానీ ఈ ప్రశ్నను నేను కచ్చితంగా లేవ నెత్తుతాను. ఎందుకంటే, మనం మన తోటి పౌరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాని గురించి ఈ ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అని నా ఆశ.

అంతేకాదు, వారిపై మన ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ఆలోచన కూడా రావాలి. కానీ మనలో చాలా మందికి ఈ ప్రభావం అన్నది అసలు ఆలోచించే విషయమే కాదు. కించపరచడం చాలా తేలిక. ఆ పనిని మనం అనా లోచితంగా చేసేస్తుంటాం. అది మనకు ఏ విధంగానూ అసౌకర్యాన్ని కలిగించదు. కానీ ఆ గాయాన్ని భరించడం, గాయంతో జీవించడం అవ తలి వాళ్లకు దుర్భరం అవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే... ఇది తప్ప వేరే ఇల్లు లేదని, ఈ ఇంటి నుంచి తప్పించుకునే వీలు కూడా లేదని నీకు తెలుస్తూ ఉండటం! 

బ్రిటన్‌ మారిపోయింది
నేను చదువుకున్న బ్రిటన్‌ కూడా నిస్సందేహంగా ఇందుకు భిన్నమైనదేం కాదు. గోధుమ రంగు చర్మం ఉన్న వారికి అక్కడ నాన్‌–వైట్స్‌ అని, నల్ల జాతీయులు అని, నిగ్గర్స్‌ అని పిలిచేవారు. తెల్లవాళ్లలో కూడా స్థాయిని బట్టి, యాసను బట్టి హెచ్చుతగ్గుల విభజనకు గురయినవాళ్లూ ఉన్నారు. నిన్నెలా చూస్తారన్నది నువ్వెలా మాట్లాడుతున్నావన్న దాన్ని బట్టే అక్కడ ఉంటుంది. కానీ ఈ యాభై ఏళ్లలో బ్రిటన్‌ మారిపోయింది. పాత దేశం కను మరుగైపోయింది. బాహ్యంగా పూర్వపు అవశేషాలు ఉంటే ఉండొచ్చు. కానీ గుండె లోతుల్లో అయితే బ్రిటన్‌ పునర్నిర్మాణం జరిగిపోయింది. 

ఇదే సవాలును మనం ఇప్పుడు భారత్‌లో ఎదుర్కొంటున్నాం. మన లోపలి అసురులను దాటుకుని మనం పైకి రాగలమా? ఆ అసురులను మనం జయించగలమా? చాలా గణనీయమైన విస్తృతిలో బ్రిటన్‌ దీనిని సాధించింది. మరి మనం సాధించగలమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే నాటికి నేను ఉండకపోవచ్చు. మార్పునకు ఒకటో, రెండో జీవితకాలాలు పట్టొచ్చు. ఇప్పటికైతే నేను మనుషుల మధ్య వినిపిస్తున్న ప్రేమరాహిత్య మౌన రాగాన్ని మాత్రమే వినగలుగుతున్నాను.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top