ద్వైపాక్షిక వాణిజ్యాల ‘లోటు’పాట్లు | Sakshi Guest Column On Bilateral Trade | Sakshi
Sakshi News home page

ద్వైపాక్షిక వాణిజ్యాల ‘లోటు’పాట్లు

May 15 2025 1:53 AM | Updated on May 15 2025 4:08 AM

Sakshi Guest Column On Bilateral Trade

మూడేళ్ల చర్చల అనంతరం మే 6న ఇండియా, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో ఇండియాకు జరిగిన మేలెంతో, లోటెంతో సమీక్షించుకోవడం అవసరం.ఏదైనా రెండు దేశాల మధ్య జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’గా భావిస్తాం. 

రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి కార్యకలాపాలను ప్రోత్సహించడం లక్ష్యంగా వస్తు, సేవల వినిమ యానికి సంబంధించి ఈ ఒప్పందాలు జరుగుతాయి. దిగుమతి సుంకాలు, దిగుమతి కోటాలు, ఎగుమతులపై నియంత్రణ లాంటి వాణిజ్య అడ్డంకుల నిర్మూలనకు ఈ ఒప్పందాలు దోహదపడతాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం, 2024 సెప్టెంబర్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా 373 వాణిజ్య ఒప్పందాలపై (సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాలు కలుపుకొని) ఇండియా సంతకం చేసింది.

ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ
మార్కెట్‌ అందుబాటు పెంపు, ఎగుమతుల పెంపు ద్వారా అధిక వృద్ధి సాధన లక్ష్యంగా వివిధ దేశాలతో భారత్‌ ఈ ఒప్పందాలు కుదు ర్చుకుంది. కానీ ఆ లక్ష్య సాధనలో ప్రతికూల, మిశ్రమ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వ్యవసాయం, తయారీ, సేవా రంగాలను పరిశీ  లించినప్పుడు ఆ యా రంగాలకు సంబంధించి కొన్ని పరిశ్రమలు ప్రయోజనం పొందగా, మిగిలిన రంగాలు అనేక సవాళ్ళను ఎదు ర్కొంటున్నాయి. 

వాణిజ్య ఒప్పందాల కారణంగా వాణిజ్య పరిమాణంలో పెరుగుదల ఏర్పడినప్పటికీ, ఎగుమతులతో పోల్చినప్పుడు దిగుమతుల పరిమాణం పెరిగి భారత్‌కు సంబంధించి వాణిజ్య లోటు పెరిగింది. ‘ఏషియాన్‌’– ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత, ఆ యా దేశాలకు సంబంధించి భారత్‌ వాణిజ్య లోటు 2011లో 7.5 బిలియన్‌ డాలర్లు కాగా, 2023లో 44 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. దక్షిణ కొరియాతో ఒప్పందం జరిగే సమయంలో భారత్‌ వాణిజ్య లోటు 4 బిలియన్‌ డాలర్లు కాగా, ప్రస్తుతం 9 బిలి యన్‌ డాలర్లకు పెరిగింది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా భారత్‌ స్వదేశీ పరి శ్రమలు – ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలు, వ్యవసాయం, డైరీ రంగాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఒప్పంద దేశాల నుండి ‘చౌక దిగుమతుల’ కారణంగా భారత్‌లో స్థానిక రైతులు, ఉత్పత్తిదారులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. వాణిజ్య సరళీకరణ వలన ఐటీ, సేవలకు కొంతమేర ప్రయోజనం ఏర్పడి నప్పటికీ, సంప్రదాయ పరిశ్రమలు అధిక దిగుమతుల కారణంగా పోటీ ఎదుర్కొంటున్నాయి.

స్థానిక మార్కెట్‌లో విదేశీ కంపెనీల ప్రవేశం వలన చిన్న, స్థానిక వ్యాపారాలు పోటీని ఎదుర్కోలేక మూసివేతకు గురవుతాయి. అలాగే కొన్ని ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అధిక సామర్థ్యంతో కూడిన సప్లయ్‌దారుల నుండి వాణిజ్య ప్రవాహం భాగస్వామ్య దేశా లకు జరుగుతుంది. 2017 నుండి 2022 మధ్య కాలంలో ఒప్పంద భాగస్వామ్య దేశాలకు సంబంధించి భారత్‌ ఎగుమతులలో 31 శాతం పెరుగుదల ఏర్పడగా, దిగుమతులలో 82 శాతం పెరుగుదల ఏర్పడింది. దక్షిణ కొరియా, ఏషియాన్‌ దేశాలు టెక్స్‌టైల్స్, తోలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్‌ను తక్కువ ధరకు ఉత్పత్తి చేయడం వలన ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది.

దిగుమతేతర సుంకాల ఇబ్బందులు
వాణిజ్య ఒప్పందాలలో భాగంగా దిగుమతి సుంకాలకు సంబంధించి స్పష్టత ఉన్నప్పటికీ, దిగుమతేతర సుంకాలు వస్తు ప్రవాహానికి అవరోధంగా నిలుస్తున్నాయి. దిగుమతి కోటా, దిగుమతి లైసెన్సింగ్, రూల్స్‌ ఆఫ్‌ ఆరిజిన్‌(వస్తు తయారీ మూలానికి సంబంధించిన), శానిటరీ, ఫైటో శానిటరీ(చీడలు, వ్యాధులు లేవని చెప్పాల్సిన) చర్యలు, సాంకేతిక నియంత్రణలు, కస్టమ్స్‌ కార్యసరళిని దిగుమతే తర సుంకాలుగా భావింపవచ్చు.

దక్షిణ కొరియా మార్కెట్‌ అందుబాటు భారత ఉత్పత్తులకు క్లిష్టంగా మారడానికి శానిటరీ, ఫైటో శానిటరీ చర్యలు, సర్టిఫికేషన్‌ ఆవశ్యకత లాంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. దిగుమతి లైసెన్సింగ్, రూల్స్‌ ఆఫ్‌ ఆరిజిన్‌ క్లిష్టతరంగా ఉండటం, శానిటరీ, ఫైటో శానిటరీ చర్యల వల్ల థాయ్‌లాండ్‌కు భారత ఎగుమతుల వృద్ధి తగ్గింది. మలేషియా అవలంబిస్తున్న వాణిజ్యపరమైన సాంకేతిక అడ్డంకులు, శానిటరీ, ఫైటో శానిటరీ చర్యలు భారత్‌ ఎగుమతులపై ప్రభావం చూపిస్తున్నాయి. 

ఆస్ట్రేలియా దిగుమతేతర సుంకాల చర్యలలో భాగంగా ఆరోగ్యం, భద్రతా సర్టిఫికేషన్స్, బయో సెక్యూరిటీ ఆవశ్యకత, ఇతర ప్రమాణాలు భారత్‌ ఎగుమతులపై ప్రభావం చూపించాయి. అధిక దిగుమతి ప్రమాణాలను పాటిస్తున్న కారణంగా జపాన్‌కు సంబంధించి భారత్‌ ఎగుమతులలో ప్రతిష్టంభన ఏర్పడింది. దిగుమతేతర సుంకాలు భారత్‌ ఎగుమతిదారుల ఎగు మతుల అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. వాణిజ్య వ్యయాల పెరుగుదల, మార్కెట్‌ అందుబాటు పెరగకపోవడం వాణిజ్య సరళీ కరణ ప్రయోజనాలను భారత్‌ అందుకోలేకపోవడానికి కారణ మయ్యాయి.

ఉదాహరణకు 2019–23 కాలానికి జపాన్‌కు ఇండియా ఎగుమతుల విలువ 5,730 మిలియన్‌ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 19,900 మిలియన్‌ డాలర్లు. ఇదే కాలానికి యూఏఈకి మన ఎగుమతుల విలువ 30 వేల మిలియన్‌ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 50,510 మి.డాలర్లు. ఇక ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు 8,730 మి.డాలర్లు కాగా, దిగుమతులు 11,300 మి.డాలర్లు. 

శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్, చిలీ లాంటి చిన్న ఆర్థిక వ్యవస్థలు మినహా పెద్ద వాణిజ్య దేశాలతో భారత్‌ వాణిజ్య లోటు పెరిగింది. అయితే, 2000–24 మధ్య కాలంలో మారిషస్, సింగపూర్, జపాన్, యూఏఈ నుండి భారత్‌ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మాత్రం ఆకర్షించగలిగింది. భారత్‌ మొత్తం వాణిజ్యంలో భాగ స్వామ్య ఒప్పంద దేశాల వాటా సుమారు 20 శాతం.

అడ్డంకులు తొలగించుకునేలా...
ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలుగా– నార్త్‌ అమెరికన్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌–నాఫ్టా (అమెరికా, మెక్సికో, కెనడా), ట్రాన్స్‌ – పసిఫిక్‌ భాగస్వామ్యం (జపాన్, ఆస్ట్రే లియా, సింగపూర్‌), సమగ్ర ప్రాంతీయ భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సీఈపీ), చైనా – ఏషియాన్‌ ఒప్పందాలను పేర్కొనవచ్చు. భారత్‌కు సంబంధించి వాణిజ్య ఒప్పందాల ముందు కాలంతో పోల్చినప్పుడు ఒప్పందం అమలు కాలంలో భారత్‌ వాణిజ్య పరి మాణం, విలువలో పెరుగుదల ఏర్పడింది. అయితే, ముఖ్య భాగ స్వామ్య దేశాల నుండి దిగుమతులు పెరిగిన కారణంగా భారత్‌ వాణిజ్య లోటులో పెరుగుదల ఏర్పడింది. 

అందుకే వాణిజ్యపరంగా వ్యూహాత్మకమైన దేశాలతో ఒప్పందాల కోసం భారత్‌ ప్రయత్నించాలి. నియంత్రణలు, దిగుమతేతర సుంకాల అడ్డంకులను భాగస్వామ్య దేశాలు తొలగించే విధంగా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలి. అమెరికాతో సహా వాణిజ్య పరంగా ముందంజలో ఉన్న ఏ దేశాలతోనైనా దిగుమతి సుంకాలు, దిగుమతేతర సుంకాల చర్యలను తగ్గించినట్లయితే భారత్‌ మార్కెట్‌ విస్తృతి పెరుగుతుంది.

వ్యాసకర్తలు డా‘‘ తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్‌ అండ్‌ డీన్‌; రితికారావు వీరిశెట్టి, పీహెచ్‌డీ స్కాలర్,
ఇక్ఫాయ్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement