ఆయన... కాలం చెల్లని కవి

Rachapalem Chandrasekhar Reddy Guest Column On Gurram Jashuva - Sakshi

సందర్భం

తెలుగు సమాజంలో జాషువా ప్రాసంగికత కాలం నడుస్తున్న కొలదీ పెరుగుతోంది. ఆయన మరణించి యాభై ఏళ్ళు గడచినా ఆయన కవిత్వం మన సమాజంతో సజీవ సంబంధం కలిగి ఉంది. 1895 సెప్టెంబర్‌ 28న అంటే 126 ఏళ్ళ క్రితం పుట్టిన జాషువా 1971లో మరణించారు. ఆయన 76 ఏళ్ళు జీవించారు. ఈ జీవిత కాలంలో 1917 నుండి 1966 దాకా విభిన్న రచనలు చేశారు. కొన్ని పౌరాణిక రచనలు మినహాయిస్తే, ఆయన రచించిన సాంఘిక కావ్యాలు ఈనాటికీ తెలుగు సమాజంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి.
గుర్రం జాషువా ఏయే సామాజిక రుగ్మతల్ని తన కవిత్వంలో విమర్శకు పెట్టారో, అవి ఇప్పుడు కూడా యథాతథంగాగానీ, రూపం మార్చుకొనిగానీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకు ఒక అందమైన భారతదేశ సామాజిక స్వప్నం ఉంది. ఆ కల ఇంకా సాకారం కాలేదు. ఆ అందమైన భారతీయ సమాజం ఆవిర్భవించేదాకా ఆయన కవిత్వానికి సామాజిక ప్రాసంగికత ఉంటుంది. వలసపాలన ముగిసిన వెంటనే ‘అచ్చముగ భారతీయుడనైతి నేడు’ అని ఎగిరి గంతేసిన కవి జాషువా. సాంఘికంగా వివక్షలు, ఆర్థికంగా అసమానత, రాజకీయంగా అవినీతి, సాంస్కృతికంగా మౌఢ్యం లేని కొత్త భారతదేశం జాషువా స్వప్నం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఆయన సమాజంలో రావలసిన మార్పులను గుర్తుచేస్తూ వచ్చారు.

తన స్వప్నం సాకారం కావడానికి ఏయే సామాంజి కాంశాలు అడ్డుపడుతున్నాయో వాటినన్నిటినీ విమర్శిం చారు జాషువా. 1932 నాటి ‘పిరదౌసి’ కావ్యం నుండే ఆయన శ్రమదోపిడీని విమర్శించారు. 1934 నాటి ‘అనాథ’ కావ్యం నుండే స్త్రీ శక్తిని కీర్తించారు. ఆధిపత్యం, అసమానత, అవినీతి, మౌఢ్యం ఈ నాల్గింటిని ప్రజలకు శత్రువులుగా భావించిన జాషువా, అవి లేని భారతదేశం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు.

అయితే, స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడచిపోతున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ఆయన ఈనాటికీ మనకు కావలసిన కవి. సాంఘిక నిరంకుశత్వానికి భౌతిక రూపమైన కులవ్యవస్థను, దాని వికృతచేష్ట అయిన అస్పృశ్యతను జాషువా తీవ్రంగా విమర్శించారు. అస్పృశ్యతా నిర్మూలనకు అనేక సందర్భాలలో పిలుపునిచ్చారు. ‘అనాథ’, ‘గబ్బిలం’ వంటి అనేక కావ్యాలలో తన దళిత వేదనను ఆగ్రహం గానూ, ఆర్ద్రతతోనూ వినిపించారు. ‘కుల భేద పిశాచి’ అని కులవ్యవస్థను నిర్వచించారు. దళితకులంలో పుట్టినకవిగా తన అనుభవాలను కవితలుగా మలిచారు.

‘కసరిబుసకొట్టు నాతని గాలిసోకనాల్గుపడగల హైందవ నాగరాజు’ అన్న వాక్యం జాషువా కులనిరసనలలో అగ్రగామి. ‘చెండింపుమస్పృశ్యతన్‌’ అని ఒక చోట, ‘కారుణ్యంబున నంటరాని తనమును ఖండింపవా?’ అని మరోచోట ఇలా అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశారు. సాంఘిక వివక్ష, కులనిరంకుశత్వం లేని వ్యవస్థను కోరుకొన్న జాషువ ఈనాటికీ సామాజిక అవసరమే. కాలం ఎంతమారుతున్నా, దళితులు చదువుకొని, చైతన్యవంతులవుతున్నా వాళ్ల పట్ల వివక్ష మాత్రం తగ్గవలసినంతగా తగ్గలేదు. అందుకే ఆయన కాలంచెల్లిన కవి కాదు. అభ్యుదయ సాహిత్యం మొదలవుతున్నప్పుడే జాషువా ఇతర మార్క్సిస్టు కవులలాగే మన సమాజంలోని వర్గ వైరుధ్యాలను గుర్తించారు. సంపద అందరిదీ కావాలని, శ్రమదోపిడీ నశించాలని కోరుకున్నారు. దళితులు శ్రమదోపిడీకి గురికావడాన్ని నిరసించారు.

వాని రెక్కలకష్టంబు లేనినాడు / సస్యరమ పండి పులకింప సంశయించు / వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు / భోజనము బెట్టు, వానికి భుక్తి లేదు (గబ్బిలం) అంటూ దళిత శ్రామికుల శ్రమ పరాయీకరింపబడటాన్ని జాషువా అధిక్షేపించారు. ‘ఒక ప్రాణి కొక ప్రాణి యోగిరంబ’య్యే వ్యవస్థను నిరసించి, మానవీయ భారతదేశం ఆవిర్భవించాలని జాషువా ఆకాంక్షించారు. ఇప్పుడు దేశంలో ఎంతో మార్పు వచ్చినా అధిక సంఖ్యాకుల శ్రమ మాత్రం దోపిడీకి గురౌతూనే ఉంది. శ్రమ దోపిడి నశించేదాకా జాషువా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు.
ఆయన గాంధీజీ అడుగుజాడలలో నడిచిన రాజకీయ కవి. ‘గబ్బిలం’, ‘బాపూజీ’ వంటి కావ్యాలలో జాషువా తన రాజకీయ దృక్పథాన్ని చాటి చెప్పారు. అయితే స్వాతంత్య్రానంతర రాజకీయాలలో ఆడంబరాలు పెరిగిపోవడం, ఆర్థిక అవినీతి పెచ్చరిల్లడం, ఎన్నికలలో ధనప్రాబల్యం ప్రవేశిం చడం వంటి అనేక దుష్పరిణామాల మీద జాషువా కవితాగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం రాగానే దేశం పూర్తిగా మారిపోతుందని కవి ఆశించారు. ఒక ఏడాది గడచినా మార్పు కనిపించలేదు. మొదటి సార్వత్రిక ఎన్నికలలోనే ధనం పాత్రను గుర్తించి ఆనాడే ప్రజలను హెచ్చరించారు జాషువ. ఇప్పుడు ఈ ధనప్రధాన ఎన్నికల రంగం బాగా బలిసిపోయింది.

మతం పేరు మీద మౌఢ్యం రాజ్యమేలడాన్ని ఆయన వ్యతిరేకించారు. మతం కన్నా మనిషి ప్రధానమని భావిం చారు. నరుని కష్టపెట్టి నారాయణుని కొలిచే వింత సంస్కృతిని ప్రశ్నించారు. పెండ్లిండ్లకు, విగ్రహాలకు విపరీతంగా ధనం ఖర్చుపెడుతూ ప్రజలు ఆకలితో మాడుతుంటే పట్టిం చుకోని అమానుషత్వాన్ని నిలదీశారు. అంటువ్యాధులు వచ్చినపుడు ప్రతిమలను పూజించడం ‘ముతక తెలివి’ అన్నారు. కందుకూరి, గురజాడల నుండి అనేకమంది తెలుగు ప్రజా రచయితలు సమాజ పునర్నిర్మాణానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో గుర్రం జాషువా ఒక్కరు. మరణించి 50 ఏళ్ళు ముగిసినా ఆయన కవిత్వం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఈ సందర్భంలో ఆయన కవిత్వాన్ని సమకాలీన దృక్పథంతో అధ్యయనం చేసి, పునర్మూల్యాంకనం చేయడం ఇప్పుడు చేయవలసిన పని. ఇదే ఆ మహాకవికి అసలైన నివాళి. ‘కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి/పంజరాన కట్టువడను నేను /లోకనిఖిలమెట్ల నిర్ణయించిన నాకు/తరుగులేదు విశ్వనరుడ నేను’  (నేడు గుర్రం జాషువా 126వ జయంతి)


రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top