అయోధ్యతో కుదరాలి సయోధ్య | Reconciliation with Ayodhya - Sakshi
Sakshi News home page

అయోధ్యతో కుదరాలి సయోధ్య

Published Sat, Jan 20 2024 3:43 AM

Prana Pratishta program will be held in Ayodhya On January 22 - Sakshi

జనవరి 22న అయోధ్యలో రావ్‌ులల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. ఏ విధంగా చూసినా ఇదొక చరిత్రాత్మక ఘట్టమే. ఇది హిందువుల ఐదు వందల ఏళ్ల ధార్మిక, రాజకీయ, న్యాయ పోరాటాల ఫలితం. ఈ వాస్తవాన్ని నిరాకరించడం విజ్ఞత కాదు. కొన్ని పీఠాల ఆచార్యులు, రాజకీయ పార్టీలు, ముహూర్తం గురించి, బీజేపీ ప్రమేయం గురించి లేవనెత్తుతున్న వివాదాలు ఇప్పుడు ప్రతిష్ఠను ఆపలేవు.

అసలు కొత్త వివాదాలు లేవదీయడమేఅసంగతం. శ్రీరామచంద్రుడిని హిందువులు మర్యాద పురుషోత్తమునిగా కొలుస్తారు. ఆ విశ్వాసాన్ని మిగిలిన మతస్థులు గౌరవించడం మర్యాద. ఆత్మ గౌరవానికి సంబంధించిన భావన ఇందులో బలమైనది, ప్రధానమైనది. భారతదేశ వైవిధ్యం పరిఢవిల్లాలంటే అన్ని మతాల మధ్య సయోధ్య నెలకొనాలి.

రామాలయ నిర్మాణం అంటే ఇటుకలు, సిమెంట్, ఒక నిర్మాణం అనుకోవద్దని లాల్‌కృష్ణ అడ్వానీ రథయాత్ర సమయం నుంచి సంఘ పరివార్‌ చెబుతూనే ఉన్నది. విదేశీ పాలనలతో మిగిలిపోయిన మానసిక బానిసత్వ జాడలు తొలగించుకోవాలన్న తాత్త్వికత కలిగిన రాజకీయ పక్షం, దాని నాయకత్వంలోని ప్రభుత్వం హయాంలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. బాబ్రీ కమిటీ తరఫున కోర్టులో పోరాడిన అన్సారీ సహా, పలువురు ముస్లింలు అయోధ్య ఆలయ నిర్మాణ స్ఫూర్తిని సరిగానే గ్రహించారు. పలువురు సిక్కులు కూడా. మనమంతా ఈ దేశ వారసులం, ఈ భూమిపుత్రులం అన్న ఏకసూత్రాన్ని ప్రాణప్రతిష్ఠ వారిలో ప్రతిష్ఠించింది.

ఆలయ నిర్మాణం పూర్తయింది కాబట్టి గతాన్ని మరచి అంతా సమైక్యంగా ఉండాలంటూ కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిస్వామి వంటి వారు పిలుపునివ్వడం శుభసూచకమే. అలాగే ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కె.కె.మహమ్మద్‌ కొద్దిరోజుల క్రితమే కాశీ, మధుర కూడా హిందువులకు అప్పగించడం సరైన చర్య అవుతుందని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడమూ అసంగతం కాబోదు. డాక్టర్‌ సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు ఇస్తున్న గణాంకాల ప్రకారం విదేశీయుల దండయాత్రలతో, మతోన్మాదంతో, పాలనలో ముప్పయ్‌ నుంచి నలభయ్‌ వేల హిందూ దేవాలయాలు నేలమట్ట మైనాయి. హిందూ సమాజం వాటి గురించి పట్టుపట్టడం లేదు.

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ డా.మోహన్‌ భాగవత్‌ కూడా ప్రతి మసీదులోనూ శివలింగాలను వెతికే పని చేయవద్దని నిర్మాణాత్మక మైన సూచన చేశారు. అయినా చరిత్రకారులుగా, ఉదారవాదులుగా చలామణి అవుతున్న కొందరి వైఖరి హిందువులే తగ్గి ఉండాలన్న ట్టుగా ఉంది. భారతదేశ వైవిధ్యం పరిఢవిల్లాలంటే అన్ని మతాల వారి మధ్య సయోధ్య నెలకొనాలి. సెక్యులరిజం అంటే మెజారిటీ మతస్థుల మనోభావాలకు మన్నన లేకపోవడం, మైనారిటీల బుజ్జగింపు కాదన్న దృష్టి అవసరం. ఒక ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న భారత్‌ మత ఉద్రిక్తత లతో తన ప్రగతివేగాన్ని తనే తగ్గించుకోవడం ఆగిపోవాలి. దానికి రామమందిర ప్రాణ ప్రతిష్ఠతో శ్రీకారం చుట్టాలి. 

బాబ్రీ మసీదు రగడలో ముస్లింల వైపు నుంచి మతోన్మాద దృక్కో ణాన్ని చూడక్కరలేదు. మొదటి నుంచి బుజ్జగింపు రాజకీయాలనే నమ్ముకున్న పార్టీలు, కుహనా సెక్యులరిస్టు చరిత్రకారుల వల్ల ఇది రావణకాష్ఠం అయింది. ఈ మాట సంఘపరివార్‌ అన్నది కాదు. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్‌ కె.కె. మహమ్మద్‌ అన్నదే. అయోధ్యగురించి పదే పదే మాట్లాడి సమస్యను జటిలం చేసిన కొందరు చరిత్ర కారులను సాక్షాత్తు సుప్రీంకోర్టు 2019 నాటి తన తీర్పులో అభిశంసించిన సంగతిని మరచిపోవవద్దు. నిజానికి మసీదులను తరలించడం, ముస్లిమేతరులు కూల్చడం, స్వయంగా ముస్లిములే తొలగించడంవంటి ఘట్టాలు బాబ్రీ కూలిన 1992 డిసెంబర్‌ 6కు ముందు ఉన్నాయి, తరువాత కూడా జరిగాయి. కొన్ని ఉదాహరణలు చూడాలి. 

మొదటిగా చెప్పుకోవలసినది సౌదీ అరేబియాలో ప్రవక్త మహ మ్మద్‌ జీవితంతో సంబంధం ఉన్న మసీదులు, ప్రాంతాలను కూడా వారు అవసరం మేరకు తొలగించారు. ప్రవక్త మసీదు అందులో ఒకటి. ఇది ప్రవక్త కట్టించిన పెద్ద మసీదులలో రెండవదని ముస్లిం సమాజం నమ్ముతుంది. ఈ పనిని అక్కడి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా చేసింది. కానీ బాబ్రీ అయోధ్య విషయంలో ఇంత అవాంఛ నీయ వాతావరణం ఎందుకు ఏర్పడింది? దాని వెనుక ఉన్న శక్తులు ఏమిటనేది పరిశీలిస్తే అర్థమవుతుంది. అయోధ్య రగడకు కేంద్రబిందువు జహీరుద్దీన్‌ మహమ్మద్‌ బాబర్‌కు మరణానంతరం జరిగిన గౌరవం ఏమిటో తెలియాలంటే, ఆయన సమాధికి పట్టిన గతి ఏమిటో తెలియాలి.

1530లో చనిపోవడానికి ముందే తన అంత్య క్రియలు అఫ్గానిస్తాన్‌లో జరగాలని వారసులను కోరాడు బాబర్‌. కానీ వారు ఆగ్రాలోనే నిర్వహించారు. బాబర్‌ కొడుకు హుమాయున్‌ను తరి మేసి అధికారంలోకి వచ్చిన షేర్‌షా సూర్‌ 1539 ప్రాంతంలో బాబర్‌ కోరికను నెరవేరుస్తున్న తీరులో ఆ అవశేషాలను కాబూల్‌ నగర శివార్లకు చేర్చాడు. అక్కడే సమాధి ఏర్పడింది. దానిని షాజహాన్, జహంగీర్‌ తరువాత పెద్ద గార్డెన్‌గా అభివృద్ధి చేశారు. అఫ్గాన్‌ రాజు నాదిర్‌షా ఈ గార్డెన్‌ను (11 హెక్టార్లు) ఒక విహార యాత్రా స్థలంగా మార్చాడు. సమాధి రూపు మార్చాడు. అక్కడంతా ఐరోపా శైలిలో భవనాలు కట్టి, హోటళ్లు, వినోదకేంద్రాలు ఏర్పాటు చేశాడు. 

పోలెండ్‌ చరిత్రంతా రష్యా జార్‌ చక్రవర్తులతో, ‘ఎర్ర జార్‌’లతో పోరాటమే. 1920లో రాచరిక జార్‌ల ఆధిపత్యం పోయిన తరవాత రాజధాని వార్సాలోని అలెగ్జాండర్‌ నెవ్‌స్కీ కెథడ్రల్‌ను పోలెండ్‌ ప్రభుత్వమే కూల్చింది. 1894లో నిర్మాణం మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారు. 70 మీటర్ల ఎత్తయిన ఈ నిర్మాణం లియోన్‌ బెనొయిస్‌ అనే నాటి ప్రఖ్యాత వాస్తుశిల్పి ఆధ్వర్యంలో గొప్ప కళాత్మకంగా జరి గింది. అయినా నిర్మాణం పూర్తయిన పదేళ్లకే కూల్చారు. కారణం ఒక్కటే. పోలెండ్‌ ప్రజల జాతీయభావాలను అవమానించడానికి జార్‌ చక్రవర్తి ఈ చర్చ్‌ను నిర్మించాడని స్వతంత్ర పోలెండ్‌ భావించడమే. రెండు దేశాలవారు క్రైస్తవులే. తమ ప్రార్థనాలయాలే అయినాఅందులో జార్‌ చక్రవర్తి అణచివేత జాడలను చూశారు. 

ఇక చైనాలో వీగర్‌ ముస్లింలు, వారి అస్తిత్వం ప్రశ్నార్థకమైన సత్యాన్ని వీగర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్రాజెక్ట్‌ నివేదిక వివరాలు కాస్త పరిశీలించినా అర్థమవుతుంది. కేరియా ఈద్‌ కాహ్‌ మసీదు 1200 సంవత్సరం ప్రాంతంలో నిర్మించినది. ఈ మసీదు రూపాన్ని వికృతం చేసి, పగోడాలా తయారు చేశారు. 1540 నాటి కార్గిలిక్‌ మసీదును పూర్తిగా ధ్వంసం చేశారు. 2016లో 100 మసీదులను నేలమట్టం చేయడం లేదా, రూపురేఖలను మార్చడం జరిగింది. అంటే మసీదును సంకేతించే గుమ్మటాలు, మీనార్లు తొలగించారు. అయోధ్య మసీదు విషయంలో రగడ చేసిన వామపక్షాల వారు, వారి అనుంగు చరిత్ర కారులు వీగర్‌ ముస్లింల మీద కాస్తయినా సానుభూతి ప్రకటించరేమి? ఇంచుమించు కాన్‌సెంట్రేషన్‌ క్యాంపులలోనే బతుకుతున్న వీగర్‌ ముస్లింల గురించి పాకిస్తాన్, టర్కీ పెదవి విప్పవేమి? ఇవి కొన్ని ఉదాహరణలు. ఇక్కడ రెండు విషయాలు గమనార్హం.

ఈ విధ్వంసంలో ఎక్కడా హిందువులకు సంబంధం లేకపోవడం. బాబ్రీ విషయంలో మాత్రమే ఇంత రగడ జరగడం. అయోధ్య ఉద్యమం తీవ్రరూపం దాల్చి, అత్యధికంగా హిందువులు రామా లయం కోరుకున్నా కూడా మూడు దశాబ్దాలు వేచి చూడడం, వేచిఉండేటట్టు చేయడం ఎందుకు? నమాజ్‌ జరగని ఒక మసీదు కోసం ఇంత రగడను ఎందుకు కొనసాగించినట్టు? ఇంతకీ, అయోధ్యలో కడుతున్న కొత్త మసీదు పేరు బాబ్రీ మసీదు కాదు. మరి దేని కోసం జరిగింది ఈ అడ్డగింత? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుందాం. వాస్తవాలు గ్రహిద్దాం. అందులో మొదటిది, హిందువుల పరమత సహనం గురించి.

అయోధ్య ఉద్యమ సమయంలో, ఆ నగరంలో లేదా భారతదేశంలో కావాలని ఏ మసీదునైనా కూల్చిన దాఖలాలు ఉన్నాయా? ఆరోపణలు ఉన్నాయా? మెజారిటీ ప్రజల మనోభావా లను అవమానించే తీరులో మైనారిటీలు వ్యవహరించడం సయోధ్యకు ఉపయోగపడేది కాదు. మెజారిటీ ప్రజలలో మెజారిటీ మనస్తత్వం సరికాదని చెబుతున్నవారు మైనారిటీల కొన్ని చర్యలలోని అసంబ ద్ధతను కూడా ఎత్తి చూపే బాధ్యతను స్వీకరించాలి. 

- వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్‌ చైర్మన్‌
ఈ–మెయిల్‌: pvg@ekalavya.net

- పి. వేణుగోపాల్‌ రెడ్డి

Advertisement
Advertisement