అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం!

Odisha Writer Pratibha Ray Named For C Narayana Reddy National Award - Sakshi

‘‘ఆమె పతివ్రత, పవిత్రమైనది. ఆమె చెడిపోయింది... ఇలా చెప్పే శాస్త్రాలు పవిత్రులైన, అపవిత్రులైన పురుషుల గురించి ఎందుకు మాట్లాడవు? పురుషుల మనసులు బంగారంతో తయారయ్యాయా? పాపం వారిని తాకదా? శాస్త్రాలు స్త్రీల పాపాల్నే చిత్రించాయా?’’ అని మహాభారతంలో ద్రౌపది ప్రశ్నించినట్లు రచించిన ప్రతిభా రాయ్‌ తన ప్రశ్న ద్వారా ఆధునిక సమాజంలో కూడా స్త్రీ, పురుషులు అవలంబించాల్సిన విలువలపై కొనసాగుతున్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించారు.

ఒడియాలో ఆధునిక సాహిత్యానికి రూపురేఖలు దిద్దిన ప్రతిభా రాయ్‌ రచనల్లో ‘యాజ్ఞసేని’ పురుషాధిక్య సమాజం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన గొప్ప నవల. ఈ నవలలో ద్రౌపది శ్రీకృష్ణుడికి రాసిన లేఖల్లో తన బాధలు, వేదనలు, పడిన హింస, త్యాగాలు, విశ్వాసాలు, ఆకాంక్షలు, నిస్పృహలను పంచుకుంటుంది. 

1944 జనవరి 15న జగత్‌ సింగ్‌ పూర్‌ జిల్లాలోని అలబేలా కుగ్రామంలో జన్మించిన ప్రతిభా రాయ్‌ ఉన్నత విద్యాధికురాలు. ఒడిషాలోని బోండో జాతిపై పోస్ట్‌ డాక్టొరల్‌ పరిశోధన చేశారు. ఒక స్కూలు టీచర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఒడిషాలోని వివిధ ప్రభుత్వ కళా శాలల్లో 30 ఏళ్ల పాటు బోధన చేశారు. తన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ, మూర్తి దేవి పురస్కారాలతో పాటు అనేక  పురస్కారాలు పొందారు. సాహిత్యంలో అత్యుత్తమమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న ఘనత అమెది.

ఆధునికానంతర ఒడియా సాహిత్యంలో కథా కథన శిల్పంలో చేయితిరిగిన రచయిత్రి ఆమె. సమానత్వం, ప్రేమ, శాంతి, సమైక్యత అడుగడుగునా ఆమె రచనల్లో గోచరిస్తాయి. కుల, మత, లింగ వివక్షలు ఎక్కడా  కన పడవు. సామాజిక న్యాయం కోసం పోరాడుతూ సమ కాలీన సామాజిక సమస్యలపై ఆమె చేసిన రచనలు అనేక సామాజిక సంస్కరణలకు దారితీశాయి. 

బర్సా బసంత బైశాఖ, పరిచయ, పుణ్యతోయ, అసబరి, నీలా తృష్ణ, శిలాపద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి, మహా మోహ, మగ్నమతి, మహారాణి పుత్ర వంటి నవలలతో ఆమె జన హృదయాల చేరువలోకి వెళ్లారు. అంతేగాక ఆమె దాదాపు 260 కథల్ని రచించారు. అవి 20 సంకలనాలుగా వెలువడ్డాయి. మధ్యతరగతి జీవితాలు, దాని సమస్యలు, వ్యక్తుల మనస్తత్వాలు, సామాజిక, రాజకీయ వ్యవస్థల స్థితిగతులు ఆమె కథల్లో ప్రతిబింబిస్తాయి. ప్రజల నమ్మకాలు, ఆచారాలు, వారి యాసలు, భాషలు, ప్రేమలు, పరిణయాలు, గ్రామీణ జీవన సౌందర్యం ఆమె రచనల్లో మనకు గోచరిస్తాయి. వీటన్నిటి మధ్యా ప్రతిభా రాయ్‌ తాత్విక దృక్పథం, బలమైన స్త్రీవాద చిత్తశుద్ధి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సానుభూతితో అర్థం చేసుకోవడం కనిపిస్తుంది.

‘బర్సా బసంత బైశాఖ’ ఆమె తొలి నవల. శృంగా రాన్ని, ప్రేమను మార్కెట్‌లో వాణిజ్య వస్తువులుగా చూసే సమాజం పట్ల నిరసన వ్యక్తం చేసిన కళాత్మక రచన ఇది. రెండో నవల ‘పరిచయ’లో గ్రామీణ, పట్టణ జీవన శైలుల మధ్య సంఘర్షణను చిత్రించారు. యాజ్ఞసేని, శిలా పద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి నవలల్లో మానవ జాతి పరిణామం; స్త్రీలు, వారి సామాజిక అంశాలను స్పృశిం చారు. పురుష పాత్రల కంటే మహిళా పాత్రలు ఈ నవల్లో ఆధిపత్య పాత్రలుగా వ్యవహరిస్తాయి. ‘ఉత్తర మార్గ’ ఒక జాతీయవాద చారిత్రక నవల. ఆదిభూమి, మహామోహ, మగ్నమతి, మహారాణి పుత్ర అన్న నాలుగు నవలలను ఒడియా సాహిత్యంలో మహా నవలలుగా పరిగణిస్తారు. వచనంలో కావ్యాలు రాయడంలో ఆమెను మించిన వారు లేరని రాయ్‌ ఈ నవలల ద్వారా నిరూపించుకున్నారు. చారిత్రక వాస్తవాలను ఈ నవలలు మనముందుంచుతాయి. ‘ఆది భూమి’ కొద్దిగా భిన్నమైన నవల. ఆదిమ జాతి గిరిజనులైన బోండా జీవన శైలిని, కర్మకాండను ఈ నవలలో చిత్రించారు.

‘మహామోహ’ భారతీయ సాహిత్యంలోనే ఒక చెప్పు కోదగ్గ తాత్విక, కళాత్మక నవల. ఆధునికానంతర స్త్రీవాద ధోరణికి ఈ నవల అద్దంపడుతుంది. ఒక స్త్రీమూర్తి పూర్తి రూపాన్ని ఈ నవల బహిర్గతం చేస్తుంది. ‘మహారాణి పుత్ర’ ఒక ఆసక్తికరమైన చారిత్రక నవల. చరిత్రలోని ఘటనలను ఆమె నాటకీయంగా, మానవ సంఘర్షణలో భాగంగా చిత్రించారు. కియోంజార్‌ వలసవాద చరిత్రలో ప్రజా విప్లవం ఈ నవలలో మనకు ఆవిష్కృతమవుతుంది.

1979లో ఒడిషాలో బీభత్సం సృష్టించిన తుఫానుపై ఆమె ‘మగ్నమతి’ రాశారు. ఒక ప్రకృతి వైపరీత్యం బీభత్సం మాత్రమే కాదు, భూమాత ఆవేదన, సర్వ మానవ సౌభ్రాతృత్వం ఈ నవల ద్వారా చిత్రించారు. స్వతంత్ర భారతంలో జరిగిన పరిణామాలు, ప్రపంచీ కరణ ఫలితాలు కళాత్మకంగా ప్రదర్శించారు. సామాజిక, రాజకీయ అంశాలపై రచించిన ‘ఉత్తర మార్గ’ కూడా ఒక జాతీయవాద నవలే.

సి. నారాయణ రెడ్డి ఆధునిక తెలుగు కవిత్వాన్ని కొన్ని దశాబ్దాల పాటు నిర్దేశించారు. సినారె, ప్రతిభా రాయ్‌ ఇద్దరూ అధ్యాపక రంగం నుంచి వచ్చిన వారే. ఇద్దరి సాహిత్య ప్రక్రియలు వేరైనా, తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తెచ్చేందుకు ప్రయత్నించిన వారే. సినారెకు పద్మశ్రీ పురస్కారం 1972లోనూ, పద్మభూషణ్‌ 1992లోను లభించగా, ప్రతిభా రాయ్‌కి పద్మశ్రీ 2007 లోనూ, పద్మభూషణ్‌ 2022లోనూ లభించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అటువంటి రచయిత్రికి మహా రచయితా, కవీ, విద్యాధికుడూ, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతా అయిన డాక్టర్‌ సి. నారాయణరెడ్డి (సినారె) జన్మదినం నాడు... ఆయన పేర నెలకొల్పిన జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయడం తెలుగు జాతికి గర్వకారణం.


- ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ 
ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు 
(జూలై 29న ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్‌కు సినారె జాతీయ పురస్కార ప్రదానం)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top