డౌట్‌ లేకుండా నీట్‌ ఉండదా? | NEET Paper Leak 2026: Former MP DVG Shankar Rao Raise a Flag | Sakshi
Sakshi News home page

NEET Paper Leak 2026: డౌట్‌ లేకుండా నీట్‌ ఉండదా?

May 14 2026 2:11 PM | Updated on May 14 2026 2:20 PM

NEET Paper Leak 2026: Former MP DVG Shankar Rao Raise a Flag

జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్‌తో సహా మరో పది కోర్సుల్లో చేరేందుకు ప్రవేశార్హతను నిర్ణయించే నీట్‌ యూజీ పరీక్ష, ఈ ఏడాది ప్రశ్నపత్రం లీక్‌ అయిన కారణంగా రద్దు కావడం గర్హనీయం. 23 లక్షల మంది విద్యార్థులు, రెండున్నర లక్షల సీట్ల కోసం పోటీ పడిన ఈ పరీక్ష ఉన్నఫళంగా రద్దు కావడం, మళ్లీ రాయాల్సి రావడం వారికీ, వారి కుటుంబాలకూ ఆర్థికంగా, భావోద్వేగపరంగా ఎంతో భారం.

దేశంలో వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను సొమ్ము చేసుకునేలా ఇబ్బడిముబ్బడిగా కోచింగ్‌ సెంటర్లు వెలిశాయి. వీటివల్ల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఇన్ని కష్టాల మధ్య రాసిన పరీక్ష కూడా రద్దు కావడం వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టం వర్ణనాతీతం.

ఈ పరీక్షను అన్ని రాష్ట్రాలకూ ఉమ్మడిగా నిర్వహించే విధానం 2013లో మొదలైంది. ఆ తర్వాత 2019లో దీని నిర్వహణ బాధ్యతల కోసం ప్రభుత్వం ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ)ని స్థాపించింది. కానీ, ఏ సంవత్సరం కూడా ఈ పరీక్షల నిర్వహణ వివాదరహితంగా జరగలేదు. 2024లో కూడా తొలుత పరిమిత సంఖ్యలో పరీక్షను పాక్షికంగా రద్దు చేసి, మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. అయితే, ఇలా పరీక్షను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఇదే మొదటిసారి.

ప్రపంచంలోనే ఒక దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే అతి పెద్ద పరీక్ష ‘నీట్‌’. అందుకు తగ్గట్టుగా లోపరహితమైన వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కానీ లేదా హైబ్రిడ్ విధానంలో కానీ నిర్వహిస్తే కొన్ని లొసుగులను అధిగమించవచ్చని నిపుణులు సలహాలిచ్చారు. అయినా ఆ దిశగా చర్యలు లేవు. లక్షలాది విద్యార్థుల భవి ష్యత్తును, వారి కుటుంబాల ఆర్థిక స్థితిని ఒక్క పెట్టున మార్చగలిగే కీలకమైన పరీక్షను సరిగ్గా నిర్వహించలేకపోవడం దేశానికి సిగ్గుచేటు, ఒక సామాజిక నేరం. ఇప్పుడు ఈ రద్దుపై దర్యాప్తు జరగనుంది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

చ‌ద‌వండి: నీట్‌ పేప‌ర్ లీక్‌.. సంచ‌ల‌న విష‌యాలు

వ్యవస్థలో దిద్దుబాట్లు జరిగి, లోపరహితమైన, మేలైన పరీక్షా విధానం అమలులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి. నీట్‌ పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపడం గొప్పతనం కాదు. ఒక్క లోపమూ లేకుండా, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా పరీక్షను పక్కాగా నిర్వహించడమే అసలైన గొప్పతనం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయాలి. నీట్‌ పరీక్షను ‘నీట్‌’గా నిర్వహించాలి, ‘డౌట్‌’గా కాదు.

– డాక్ట‌ర్‌ డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement