మరోసారి అటకెక్కిన ఓబీసీ కులగణన

Kodepaka Kumara Swamy Guest Column On OBC Census - Sakshi

సందర్భం

బ్రిటిష్‌ పాలనలో జనాభా లెక్కల్లో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, ఆంగ్లో ఇండి యన్స్, ముస్లి మేతరుల (హిందు వులు) లెక్కలు తీసేవారు. 1872 నుండి జనాభా లెక్కలలో ఆయా కులాల గణాంకాలను 1931,1932 వరకు లెక్కించింది. శూద్ర కులాల సామాజిక, ఆర్థిక, విద్య, సాంస్కృతిక అంశాలు తెలిస్తే తప్ప దేశ అభివృద్ధి సాధ్యం కాదని గుర్తిం చింది. దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిన అనంతరం 1951 నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తు న్నారు. ఇందులో స్త్రీలు, పురుషులు, పిల్లలు, మతంతో పాటుగా షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ) లెక్కలను తీస్తున్నారు. కానీ దేశ జనాభాలో యాభై శాతం పైగా జీవిస్తున్న వెనుకబడిన తరగతుల (బీసీ/ఓబీసీ) లెక్కలు తీయడం లేదు. 

మొదటి జాతీయ బీసీ కమిషన్‌ మొదలుకొని, అన్ని రాష్ట్రా లలో నేటి వరకు నియమించిన బీసీ కమిషన్లు అన్నీ ఓబీసీ కులగణన చేయాలని సూచించాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక సందర్భాలలో వెనుకబడిన తరగతుల లెక్కలను తేల్చా లని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి. 2012లో మద్రాస్‌ హైకోర్టు ధర్మాసనం ‘సెన్సస్‌ కమిషనర్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ ఆర్‌.కృష్ణమూర్తి’ మధ్య కేసు తీర్పులో కేంద్ర ప్రభుత్వాన్ని జనాభా లెక్కలతో పాటుగా ఓబీసీ కులగణన చేయాలని సూచించింది.

2010లో జరిగిన పార్లమెంట్‌ సమావేశాలలో ఓబీసీ కుల గణన చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీతో సహా ముక్తకంఠంతో నినదించాయి. అందుకు స్పందిం చిన కేంద్ర ప్రభుత్వం 2011లో చేయబోయే జనాభా లెక్కలలో సాధ్యం కాదనీ; అప్పటికే జనాభా లెక్కలకు సంబంధించిన సామగ్రిని దేశవ్యాప్తంగా పంపించడం జరిగిందనీ; తరువాత తీయబోయే జనాభా లెక్కలలో ఓబీసీ గణన చేస్తామనీ లోకసభ, రాజ్యసభ సాక్షిగా ప్రకటించింది. 2014లో అధికారం లోకి వచ్చిన బీజేపీ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల జనగణన 2021లో చేపడుతామని ప్రకటించింది. 

కేంద్ర ప్రభుత్వ రిజిస్ట్రార్‌ జనరల్‌ వారు 2021 జనగణనకు సంబంధించిన షెడ్యూలు విడుదల చేస్తూ మొదట శాంపిల్‌ సర్వేకు ప్రతి రాష్ట్రంలో మూడు మండలాలను ఎంపిక చేసి మొబైల్‌ మరియు డేటా షీట్‌ ద్వారా సర్వేను 12 ఆగస్టు నుండి 30 సెప్టెంబర్‌ 2019 వరకు నిర్వహించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల వివరాలు సేకరించారు గానీ ఓబీసీల వివరాలను సేకరిం చలేదు. శాంపిల్‌ సర్వేలో చేయలేదంటే ఈసారి కూడా ఓబీసీ కులగణన చేయడం లేదని తేటతెల్లమైంది.

తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్లుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2014 స్థానిక సంస్థలైన పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు పరిచారు. కానీ 2019లో పంచాయతీ ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వం 50% పరిమితికి సంబంధించి కోర్టు తీర్పులను సాకుగా చూపి 34 నుండి 23 శాతానికి బీసీ రిజర్వేషన్లను కుదించారు. ఫలితంగా సుమారు 1000 సర్పంచి సీట్లను బీసీలు కోల్పోవలసి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం 2014లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అధికారికంగా బీసీ జనాభాను కోర్టులకు సమర్పించి 34% రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తీసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019లో జీవో 176 ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34%, ఎస్సీలకు 19.08%, ఎస్టీలకు 6.77% మొత్తం వర్టికల్‌ రిజర్వేషన్‌ 60% శాతంగా కల్పించింది. ఈ రిజర్వేషన్లపై హైకోర్టు ధర్మాసనం బిర్రు ప్రతాపరెడ్డి వర్సెస్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ మధ్య కేసు తీర్పులో బీసీల జనాభా లెక్కలు లేవు కనుక వర్టికల్‌ రిజర్వేషన్‌ 50% దాటడానికి వీలులేదని తీర్పిచ్చింది. తప్పని పరిస్థితులలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను జీవో 559 ద్వారా 34% నుండి 24%కి తగ్గించింది. ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 జనాభా లెక్కలలో ఓబీసీ గణన చేపట్టి సమసమాజానికి బాటలు వేయాలని 70 కోట్ల మంది బీసీలు ఆశిస్తున్నారు. లెక్కలు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చేయని కారణంగా వీరికి అమలుపరుస్తున్న రిజర్వేషన్లపై అనేక న్యాయపరమైన చిక్కులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులలో ఎదుర్కోవాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీలకు విద్య, ఉద్యోగ తదితర రంగాలలో వారి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయాలంటే ఓబీసీ కులగణన తప్పనిసరి. ఇది అన్ని సమస్యలకు సర్వరోగ నివారిణిగా  ఉపయోగపడుతుంది.

కోడెపాక కుమార స్వామి
వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘ మొబైల్‌ : 94909 59625

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top