సందర్భం
అంబేడ్కర్ ఒక సజీవ ప్రభాతం. సాంస్కృతిక రాజకీయ దార్శనికుడు. ప్రపంచ పరిణామానికి ఆయువు పోసిన జ్ఞాని. ఆకాశపుటంచులు దాటిన కీర్తి పతాక. కేవలం ఒక నాయకుడిగానే కాదు, ప్రపంచ పరిణామాన్ని ప్రవహింపజేసిన జ్ఞాన సింధువుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అంబేడ్కర్ మరో బుద్ధుడు. నవయాన బోధిసత్వుడు. ప్రపంచ వైతాళికుడు. ప్రపంచ గమనానికి నిర్దేశకుడు.
ఆయన సంఖ్య మూలాన్ని తెలుసుకున్న జ్ఞాని. సమాజంలో సంఖ్యలన్నీ నిస్తేజమై, నిర్వీర్యమై, అబద్ధాలతో నిండిన వేళ... సత్యపూర్ణమైన సంఖ్య కోసం వెతికి పట్టుకొని, ఆ గణాంకాలను పేర్చి రాజ్యాంగ హక్కుల్ని రూపొందించారు. నిజానికి భారత రాజ్యాంగం ఒక గణిత శాస్త్రం. 1931లో ఉన్న జనాభా లెక్కలే కాకుండా, 2025 నాటికి జనాభా నిష్పత్తి ఎలా ఉండబోతుందో అప్పుడే అంచనా వేయగలిగిన అద్భుత ప్రణాళికాకర్త ఆయన. మనుషులను ప్రభావితం చేసే శక్తులు, వారిని నిర్జీవం చేసే శక్తుల మధ్య జరిగే యుద్ధాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన గణితజ్ఞుడు.
భారత స్త్రీ వ్యక్తిత్వ శిల్పాన్ని అపురూపంగా చెక్కి, ప్రతిభను వెలికి తీసి, హిందూ కోడ్ బిల్లు ద్వారా వారికి హక్కులు పొందుపర్చిన మహోన్నతుడు. నేటి ఐటీ రంగంలో ఒక వ్యక్తి వంద మంది చేసే పనిని ఎలా చేయగలడో, ఆనాడు అంబేడ్కర్ ఒక పక్క రాజ్యాంగ రచన, మరోపక్క రాజకీయ నిర్మాణం, ఇంకోవైపు బౌద్ధ సంస్కృతి వికాసం ద్వారా నిరూపించి చూపారు. మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పాళీ, పారశీకం, గుజరాతీ, జర్మన్, ఫ్రెంచ్ వంటి భాషలపై పట్టు సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
నేడు ఆయన వేసిన బాటలో నడుస్తూనే దళితులు, అణగారిన వర్గాల వారు ఐటీ రంగంలో, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఎదుగుతున్నారు. సామాజిక అడ్డంకులను ఎదుర్కొంటూ, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంబేడ్కర్ అక్షరం ఒక ‘అణు విచ్ఛేదన కేంద్రం’. ఎన్నో చీకటి గుహల్లాంటి జీవితాల్లో ఆయన ఆలోచనలు వెలుగులు నింపుతున్నాయి. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇంగ్లాండ్ నుండి జర్మనీ వరకు... ఆయన విగ్రహం లేని ఖండం లేదు. నేటి కాలంలో సమాచారం అంటే ఒక భ్రమగా, టెక్నాలజీ ఒక అల్లికగా మారుతోంది. ఈ మాయాజాలం నుండి సత్యాన్ని వెలికితీసి, అంకెకు, అక్షరానికి సత్యనిష్ఠను అద్ది... మనల్ని బతికించిన మహోన్నతుడు అంబేడ్కర్. భారత దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వ భావనలను పరిచయం చేసిన మరో రూసో. హెగెల్ శిష్యుడిగా ఆజన్మాంతం కుల, మత నియంతృత్వాలను ఎదిరించిన యోధుడు.
చదవండి: వాళ్ల తలల్ని 'తలారీ'కి అప్పజెప్పవద్దు!
‘జై భీమ్’ అనేది కేవలం నినాదం కాదు. శక్తితో నడవడం, స్వచ్ఛమైన జీవితంతో సాగడం, సంపదను సృష్టించడం. అయితే అంబేడ్కర్ ఆలోచనలకు భిన్నంగా ఈనాడు రిజర్వేషన్లను దళితులకు పూర్తిగా చెందకుండా చేయడమే గాక వారి ప్రతిభపైనా, ఉనికిపైనా నిరంతర దాడులు చూస్తున్నాము. డీలిమిటేషన్ పేరుతో దక్షిణ భారతంలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు తగ్గించి రాజకీయాల్లో వీరిని నామమాత్రం చెయ్యాలనే భావనలు కూడా అంబేడ్కర్ ఆలోచనలకు వ్యతిరేకం. అంబేడ్కర్ ఒక్కొక్క సందర్భంలో ప్రతివాదిగా, విప్లవ కారుడిగా, పోరాట వీరుడిగా, మహర్ బిడ్డగా, రాజనీతిజ్ఞుడిగా మనకు స్ఫూర్తినిస్తున్నాడు. ఆయన జీవితమే మనకు అధ్యయన కేంద్రం. ఈనాడు బహుజన రాజ్యాధికారాన్ని కుల నిర్మూలనా సిద్ధాంత దీక్షతో సాధించాలి. ఇదే అంబేడ్కర్ జయంతికి ఇచ్చే ఘనమైన నివాళి.
డాక్టర్ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు
(నేడు అంబేడ్కర్ జయంతి)


