జైభీమ్‌: నాటి పోరాటం గుర్తొచ్చింది!

Jai Bhim Movie: CPI Narayana Remember 37 Years Back Tirupati Incident - Sakshi

అభిప్రాయం

‘జైభీమ్‌’ సినిమా చూశాను... నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్‌లు లేవు. యువ లాయర్ల బాధ్యతను, సందేశాత్మక సంకేతాలను ‘జై భీమ్‌’ సినిమా సమాజానికి పంపింది. సినిమాలో సినతల్లి పెట్టిన కేసును ఉపసంహరించు కోవాలన్న పోలీసు బాస్‌... నీ భర్త ఎటు రాడు... కనీసం పరిహారం తీసుకొని కోర్టు కేసు వెనక్కు తీసుకో అన్న సందర్భంలో సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు చెంపపెట్టులా ఉంటుంది. 

నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు 37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చింది. నగరంలో కోతిని ఆడించుకొంటూ పొట్టపోసుకునే లక్ష్మి అనే మహిళ ఇల్లులేక ప్లాట్‌ఫారంపై పడుకునే అభాగ్యురాలు. ఒక రోజు రాత్రి బీట్‌ కానిస్టేబుల్స్‌ తమ లాఠీలతో దబాయించుకుంటూ వస్తున్నారు. బిక్షగాళ్ళంతా భయపడి పరుగెత్తారు. లక్ష్మి పరుగెత్తుతుండగా పోలీసులు కాలితో తన్నడంతో ఆమె తల పక్కనే ఉన్న రాయికి బలంగా తాకి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ మృతదేహం పక్కన ఆమెకు జీవితం అయిన కోతి మాత్రమే ఉండిపోయింది.

విషయం తెలియగానే మేమంతా ఘటనా స్థలానికి చేరుకున్నాం. తెల్లవారు జామున మృతదేహాన్ని తోపుడుబండిపై పడుకోబెట్టి నిరసన ప్రదర్శన ప్రారంభించాం. నిరసన 25 మందితోనే  మొదలైనా, క్రమంగా వందలమంది జతకలిశారు. లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మరునాడు బంద్‌కు పిలుపునిచ్చాము. మేము బంద్‌ పిలుపు ఇచ్చిన రోజునే నాటి సీఎం ఎన్టీఆర్‌ తిరుమల పర్యటన ఉంది. ముందురోజు నడి రాత్రి కొందరు పోలీ సులు వచ్చి నన్ను తిరుపతి ఎస్పీ క్యాంప్‌ కార్యాలయానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆనాటి కలెక్టర్‌ సుబ్బారావు, ఎస్పీ ఆల్ఫ్రెడ్‌ నాతో మాట్లాడుతూ రేపటిబంద్‌ పిలుపును ఉపసంహరించుకోండి నగరంలో సీఎం పర్యటన ఉందన్నారు. నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. (చదవండి: వారి నిర్బంధంలో న్యాయముందా?)

ఆ సమయంలో అధికారులు ఇద్దరూ నాతో.... చనిపోయిన లక్ష్మిది ఈ ప్రాంతం కాదు, ఆమె కోసం మీరు పోరాటం చేస్తే మీకూ, మీపార్టీకి వచ్చే లాభం ఏమిటి, మీపై కేసులు పడటం తప్ప అని వ్యాఖ్యానించారు. ‘మా ఉద్యమం వలన సామాన్యులు కూడా చైతన్యంతో, ధైర్యంగా నివసించగలరు. అధికారులు బాధ్యతగా ప్రవర్తించేందుకు ఈ ఉద్యమం అవసరం’ అనేశాను. మరునాడు బంద్‌ జరిగింది. మాపై కేసులు కూడా పడ్డాయి. చిత్తూరు సబ్‌ జైలులో వారంపాటు నిర్బంధించారు.. కానీ మా ఉద్యమ సందేశం ఆనాడు నగరంలో హాకర్స్, రిక్షా తదితర అసంఘటిత కార్మిక సంఘాలు బలపడటానికి ఊతం ఇచ్చింది. ‘జై భీమ్‌’ సినిమా చూస్తుంటే 37 ఏళ్ల క్రితం పోలీసుల అకృత్యాలకు బలైన లక్ష్మి, నాటి పోరాటం సినిమా రీళ్లలాగా నాకళ్ల ముందు కదులుతున్నాయి. (చదవండి: ఓట్ల డబ్బు పంపిణీలో సమానత్వం)


- డాక్టర్‌ కె. నారాయణ
వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యదర్శి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top