
హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అందమైన సాఫ్ట్‌వేర్ కార్యాలయాలకి ఎనిమిది కిలోమీ టర్ల ఆవల... అల్పాదాయ వర్గాలు నివసించే ఓ ప్రాంతం. అక్కడ ఓ ఇరుకింట్లో నివసించే 21 ఏళ్ల మానస తెల్లారక ముందే నిద్ర లేచి పనికి బయలుదేరుతుంది. ఓ కార్పొరేట్ కార్యాలయ హౌస్ కీపింగ్ విభాగంలో నెల మొత్తం పని చేస్తే ఆమెకు లభించే వేతనం రూ. 8,500. తల్లి ఐదు ఇళ్లల్లో పనులుచేస్తుంది.
తండ్రి తెలంగాణలోని ఓ పల్లెలో సన్నకారు రైతు ఒకప్పుడు. ఇప్పుడు భవన నిర్మాణ కూలీ. ఆ పని కూడా అన్ని రోజుల్లోనూ దొరకని పరిస్థితి. మానస వాళ్ల ఇంటికి కొన్ని వీధుల ఆవల, నగర పెరుగుదలను ప్రతిఫలించే హోర్డింగులు మెరిసిపోతుంటాయి. సేవా రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వెలిగించిన సాఫ్ట్ వేర్ సిటీగా హైదరాబాద్ కొనియాడబడుతుంటుంది. కానీ మానస వాళ్ల ఇంట్లో ఈ ఆర్థిక వృద్ధి తాలూకూ వెలుగు రేఖలెక్కడా కనిపించవు.
స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరంగా భారత్ మరో మైలు రాయిని చేరుకోవడం, జపాన్‌ను అధిగమించనుండటం గురించి పత్రికలు పలు కథనాలు ప్రచురిస్తున్నాయి. భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం నిస్సందేహంగా గుర్తించదగిన విజయమే. కానీ, విమర్శనాత్మక దృష్టికోణంలో పరిశీలించినట్టయితే ఇది ప్రశంసించదగిన విజయమని చెప్పలేం. జీడీపీ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని కొలుస్తాయే తప్ప సామాజిక న్యాయం, సమ్మిళితత్వం, మానవాభివృద్ధిని కొలవలేవు. అవి ఆర్థిక వ్యవస్థ చేసే ఉత్పత్తుల గురించి చెబుతాయే తప్ప, వాటి ద్వారా ఎవరు లబ్ధిపొందుతున్నారనే కీలక విషయాన్ని పట్టించుకోవు.
రెండు భారత గాథలు
పరిమాణంలో ఆర్థిక వ్యవస్థ పెద్దదైనప్పటికీ, 125 దేశాలతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచికలో భారత్ స్థానం దిగువనే, 111వ స్థానంలో ఉంది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే ప్రకారం, ఐదేళ్ల లోపు పిల్లల్లో దాదాపు 35 శాతం మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 19 కోట్లకు పైగా భారతీయుల్లో పోషకాహార లోపముంది. ఆర్థిక వృద్ధి కూడా చాలామటుకు పట్టణ, సేవారంగ ఆధారితమైంది. 45 శాతం మంది భారతీయులకు వ్యవసాయం ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, జీడీపీలో వ్యవసాయ రంగ వాటా కేవలం 15 శాతమే.
ఓవైపు జీడీపీలో పెరుగుదల నమోదవుతుండగా, మరోవైపు ఉద్యోగ రాహిత్యం తాండవిస్తోంది. ఉన్న ఉద్యోగాలకు సైతం భద్రత లేని పరిస్థితి. లేబర్ ఫోర్స్ డేటా ప్రకారం... అసంఘటిత, అభద్రమైన ఉద్యోగాల వైపు మళ్లించబడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దేశంలో 80–90 శాతం మంది అసంఘటిత కార్మికులే/ఉద్యోగులే.ఆదాయ, సంపదల పరంగా ఇప్పుడు ఏర్పడిన అసమానతలు స్వాతంత్య్రానికి ముందరి వలస కాలపు స్థాయితో పోటీ పడు తున్నాయి.
వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ప్రకారం... గత పాతికేళ్లలో ఆదాయ అసమానతలు పెరుగుతూ వచ్చాయి. 40 శాతం దేశసంపద ఒక్క శాతం దేశ కుబేరుల గుప్పిట్లో ఉంది. దిగువ భాగపు50 శాతం ప్రజల వద్ద ఉన్న సంపద కేవలం 3 శాతమే. ఓవైపు స్టాక్ మార్కెట్లు, శత కోటీశ్వరులు పెరుగుతుంటే, మరోవైపు లక్షలాదిమంది పేదరికం వైపు నెట్టివేయబడుతున్నారు. గ్రామీణ పేదలు, అసంఘటిత కార్మికులు, కింది కులాల వాళ్లు ఆర్థిక అస్థిరత తాలూకూ భారం మోస్తున్నారు. వృద్ధి రేటు పెరుగుదలపై వెలువడు తున్న విజయగాథల్లో... ఈ అసమానతల పార్శ్వం అరుదుగానే వినిపిస్తోంది.
ఇక విద్యారంగ పరిస్థితికొస్తే... సర్కారీ బడుల్లో చేరికలు పెరిగినప్పటికీ 5వ తరగతిలోపు విద్యార్థుల్లో సగానికి పైగా పిల్లలు 2వ తరగతి పుస్తకం కూడా సరిగా చదవలేకపోతున్నారు. విద్యఅందుబాటులోకి రావడం ఎంత ముఖ్యమో, నాణ్యత కూడా అంతే ముఖ్యమనే విషయం ఇక్కడ గ్రహించాల్సి వుంది. ఉపాధ్యాయులకు అరకొర జీతాలు చెల్లిస్తుండటం, బట్టీ పట్టించే బోధనా పద్ధతులు అవలంబిస్తుండటం వంటి అంశాలు నాణ్యతా రాహిత్యానికి కారణ మవుతున్నాయి. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకునే విషయంలో చోటు చేసుకున్న వ్యత్యాసాలు... కోవిడ్ అనంతర కాలంలో అభ్యసన సంబంధిత అంతరాల్ని మరింత పెంచాయి.
కీలక సూచికల పట్ల పట్టింపు ఏదీ?
ఇష్టపూర్వకమైన సూచికల ఆవల అంతగా పట్టించుకోని, లోతైన వ్యవస్థాగత ప్రమాదాలు పొంచి వున్నాయి. వాతావరణ సంక్షోభం, ప్రాంతీయ అసమానతలు వంటి కొన్ని కీలక సూచికలను ఏ మాత్రమూ లక్ష్యపెట్టలేదు. ఉదాహరణకు– భూగర్భ జల సంక్షోభ తీవ్రత ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి. కానీ ఈసంక్షోభం వల్ల తలెత్తగల పర్యావరణ క్షీణతను జీడీపీ వృద్ధి గణకులు పరిగణనలోకి తీసుకోలేదు.మానవాభివృద్ధి పరంగా కేరళ, తమిళనాడు పై ర్యాంకుల్లో వున్నాయి.
బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఆరోగ్యం, అక్షరాస్యత అంశాల్లో దశాబ్దాలుగా వెనకబడి పోయాయి. సుమారు 145 కోట్ల జనాభా ఉన్న దేశంలో... తలసరి ఆదాయం 2,880 డాలర్లు మాత్రమే. అసమానతల తీవ్రతను పట్టి చూపే ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా ఇవ్వొచ్చు. పోషకాహారం, విద్య, వస్తు సేవల లభ్యత, వాతావరణ స్థితిస్థాపకత తరహా సూచికల్ని మెరుగు పరచుకునే దిశగా సాగాల్సిన లోతైన సంభాషణకు... జీడీపీ గణాంకాల పట్ల ఉన్న వ్యామోహం అడ్డుపడుతోంది.
మనకు కావలసింది వృద్ధిఫలాలు మెరుగైన రీతిలో పునఃపంపిణీ కావడం. ప్రజారోగ్యంపై పెట్టుబడులు, ప్రా«థమిక విద్య, పోషకా హార కార్యక్రమాలు, ఉపాధికి హామీలు వంటి వాటి ద్వారా భారత దేశ దీర్ఘకాల భవిష్యత్తుకు దోహదం చేయడం. మరో విధంగా చెప్పాలంటే... విజయాన్ని పునర్నిర్వచించడం.మానస కుటుంబం తన మౌలిక అవసరాల విషయంలోఎలాంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోనప్పుడు... ఆమె గౌరవ ప్రదమైన ఉద్యోగం, న్యాయమైన అవకాశాలు పొందగలిగి నప్పుడు... అది, అదే అసలైన వృద్ధి కథనం. అప్పటివరకు జీడీపీ గురించిన కథనాల్లో ఉండేవి పాక్షిక సత్యాలే.
-వ్యాసకర్త ఆర్థిక శాస్త్ర బోధకురాలు,ఎస్‌ఆర్‌ఎమ్ యూనివర్సిటీ, ఏపీ
-డా‘‘ బొడ్డు సృజన