ఏఐకి విరుగుడు సహజ మేధ | Human Natural intelligence is the antidote to Artificial intelligence | Sakshi
Sakshi News home page

ఏఐకి విరుగుడు సహజ మేధ

May 30 2025 1:34 AM | Updated on May 30 2025 1:34 AM

Human Natural intelligence is the antidote to Artificial intelligence

విశ్లేషణ

మీ వంటింట్లోని పళ్లేలు, గిన్నెలు వాడి వాడి మొహం మొత్తాయా? లేదు కదా! అవి మీకు వారసత్వంగా వచ్చాయి. వాటి మీద ఇప్పటికీ మీ పూర్వీకుల పేర్లు ఉండొచ్చు. ఆ పేర్లు చూసినప్పుడల్లా వారిని స్మరించుకుంటాం. ఆ పాత్రల్లో మన ఆహారపు అల వాట్లు ప్రతిఫలిస్తుంటాయి. ఆ పళ్లేలలో కొన్ని తరాల వారు భోజనాలు చేశారు.

ఇత్తడి గ్లాసులు, రాగి పాత్రలు, గరి టెలు, మసిబారిన కళాయిలు, పెనాలు, పింగాణీ పాత్రలు, పలురకాల చాకులు, కొబ్బరి కోరే పరికరాలు, కాఫీ గింజల మరలు, మజ్జిగ చిలికే కవ్వాలు... వీటిని మీరు ఆప్యాయంగా చూడండి.

అంతేకానీ పాత ఇనుప సామాను కింద తీసేయకండి. ఇవన్నీ ఇప్పుడు అంతరించిపోతున్న జీవజాలం కోవలోకి చేరుతున్నాయి. ఆధునికమైన విద్యుత్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు వచ్చాయి. తరతరాల స్మృతులను మన ముందు నిలిపే మన సాంప్రదాయిక వంటిల్లు మీద ఇవి దాడి చేస్తున్నాయి. 

పాతవైనా పారేసుకోలేనివి!
అలాగే, జీర్ణావస్థకు చేరిన పాత కాటన్‌ చీరలు, పట్టు చీరలు, ధోతీలు, కుర్తాలు, పైజామాలు, చిల్లులు పడిన స్వెట్టర్లు,మఫ్లర్లు, గ్లవ్స్‌... వీటిని కూడా పారేయకండి. అన్నీ కాకపోయినా కొన్నింటినైనా దాచుకోండి. అవి పాతబడ్డాయే కానీ చచ్చిపోలేదు. వాటిని మళ్లీ బాగు చేసుకోవచ్చు. దర్జీ ఎక్కడైనా దొరుకుతాడేమో వెతకండి. 

వాచీలు, టైమ్‌ పీస్‌లు, గోడ గడియారాలను కాలం కాటేసింది. వీటిని మెయిన్‌టెయిన్‌ చేయడం కష్టం. ఎందుకంటే రిపేరు వస్తే స్పేర్‌ పార్టులు దొరకవు. కంటికి దుర్భిణి పెట్టుకుని పెద్ద పళ్ల చక్రాల్లోపల ఉండే చిన్న చిన్నపళ్ల చక్రాలకు మరమ్మతులు చేసే ఈ రిపేరువాలాలు కాలానికి చలనం తెప్పిస్తారు. గడియారాల పాలిట వీరు కంటి ఆపరేషన్లు చేసే వైద్యుల్లాంటి వారు. వీరి నైపుణ్యం గొప్పగా ఉంటుంది. పాత వాచీలు రిపేర్‌ చేసే ఇలాంటి వారూ ఇప్పుడు కనుమరుగవుతున్నారు.

పాతకాలపు గడియారాలకు బదులుగా డిజిటల్‌ ‘హారర్స్‌’ వచ్చాయి. ఇవి 8 అనే ఒక్క డిజిటల్‌ అంకెను రకరకాలుగా మార్చి టైమ్‌ను మన మొహాన కొడతాయి. గంటలకు నిమిషాలకు, నిమిషాలకు సెకన్లకు మధ్య ఒక కోలన్‌ పెట్టి కాలాన్ని ప్రదర్శిస్తాయి. క్షణం క్షణం మారే ఈ అంకెలు ‘మన టైం దగ్గరపడుతోంద’ని చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఇక పుస్తకాలు. పాతబడిన కొద్దీ వాటికి విలువ ఎక్కువ.కారణం – అవి గొప్ప రచయితలవి కావడం మాత్రమే కాదు, వాటిలోని అక్షరాలు చదివిన కళ్లు, వాటి పేజీలు తిప్పిన వేళ్లు ఇప్పుడు లేవు. అసంఖ్యాకులైన వాటి పాఠకులు తమ గుండెల్లో ఆనందా నుభూతిని పదిలపరుచుకుని మరో ప్రపంచానికి వెళ్లిపోయారు. 

ఈ పుస్తకాలు రద్దీవాలాల చేతికి వెళ్తే రీసైకిల్‌ అవుతాయి. శాశ్వతంగా అదృశ్యమవుతాయి. అదృష్టం బావుంటే, కొన్ని సెకండ్‌ హ్యాండ్‌ బుక్‌ షాపులకు చేరతాయి. అక్కడ మాత్రం మీ లాంటి పుస్తక ప్రేమికులు వాటి విలువ గుర్తిస్తారు. అరుదైన పుస్తకాలతో వారు తమ బుక్‌ షెల్ఫ్‌లను నింపేస్తారు.

సంగీతానిదీ ఇదే పరిస్థితి. స్లో మూవింగ్‌ రికార్డులు పోయి ఎల్పీలు వచ్చాయి. వాటి స్థానంలో క్యాసెట్లు, క్యాసెట్లు పోయి సీడీలు ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు ఇవేవీ అక్కర్లేదు. ల్యాప్‌ టాప్, మొబైల్, లేదంటే బ్లూటూత్‌ సాధనాలు ఉంటే చాలు. అయితే మీరు పాత పాటల షాపులకు వెళ్లి చూడండి. 

నిజమైన బీథోవెన్, బాక్, నిజమైన ఆమిర్‌ ఖాన్, రవిశంకర్, బేగమ్‌ అఖ్తర్, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి పాటలు, సంగీతం మీకక్కడ దొరుకుతాయి. అందుకే ఈ ఓల్డ్‌ మ్యూజిక్‌ స్టోర్స్‌ అమూల్యమైనవి. మార్కెట్లో బీథోవెన్‌ లాంటి లేదా అంతకంటే చక్కగా వినిపించే మ్యూజిక్‌ దొరకవచ్చు. కానీ అది ఒరిజినల్‌ కాదు. అలాగే, ఎంఎస్‌ సంగీతం లభిస్తుంది. కానీ అది నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాది కాదు కదా!

అసలైనది వదులుకోవద్దు!
ఈ రియల్, ఒరిజినల్, ట్రూ స్టఫ్‌కు ఇప్పుడు ఇంట్లో చోటెక్కడుందని మీరు అడగొచ్చు. ఒకప్పుడు మనం అనేక గదుల ఇళ్లలో ఉండేవాళ్లం. క్రమంగా చిన్న కుటుంబాలుగా మారుతూ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్స్‌కు పరిమితం అవుతున్నాం. నిత్యావసరాలకు అవస రమయ్యే  సాధారణ ఉపకరణాలు, ఫర్నిచర్‌కే జాగా లేనప్పుడు, లవ్లీగా ఉన్నాయని చెప్పి ఈ పాత వస్తువులను ఎక్కడ దాచుకోవాలి? ఈ ప్రశ్నలో ఔచిత్యం లేకపోలేదు.

ఇక్కడ మీకొక విషయం స్పష్టం చేస్తాను. ఏది ‘రియల్‌’ అనేది చెప్పడానికే ఇవన్నీ ప్రస్తావించి కొంత ఆలంకారికంగా చెప్పాను. దీనికి ఇంకొక పదం ఉంది. రియల్‌కు బదులు ఆర్గానిక్‌ అనవచ్చు. ఆర్గానిక్‌ అనగానే రసాయనాలు వాడకుండా పండించే పళ్లు, కూర గాయలు, తృణధాన్యాలు అనుకుంటారు. నేను వాడుతున్నది ఆ అర్థంలో కాదు. ఏఐ (కృత్రిమ మేధ) యుగంలో ఆర్గానిక్‌ అంటే ఏమిటనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఏదైతే ఒకరి అంత రాత్మకు వాస్తవం అనిపిస్తుందో అదే ఈ సందర్భంలో ఆర్గానిక్‌ అవుతుంది. 

ఈ ఏఐ కాలంలో... ఆర్గానిక్, వాస్తవ, యథార్థ అంశాలే మన ఎంపిక కావాలి. ఏఐతో ఔషధ, విద్యా రంగాల్లో అద్భుత ప్రయోజనాలు ఉన్న మాట నిజమే. అయినా ఏఐ కావాలా,  ఏఐ వద్దా అనేది మనం ఎంచుకోవలసి ఉంటుంది. అయితే, అతి తొందర్లోనే ఈ చర్చ కేవలం ఒక విద్యావిషయికమైందిగా మిగిలి పోతుంది. బదులుగా, ఈ ఏఐ కావాలా, ఆ ఏఐ కావాలా అనేదే తేల్చుకోవలసి ఉంటుంది.   
  
ఏఐని కొత్త దేవుడు అనుకోనవసరం లేదు; అలాగే అపరిమిత జ్ఞానం కోసం దయ్యానికి ఆత్మను అమ్ముకోవాలేమోనన్న భీతి కూడా అనవసరం. ఏఐని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మనకు ఏం కావాలో నిర్ణయించే అధికారం ఏఐకి అప్పగించకూడదు. ఏఐ విషయంలో మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. ఆర్గానిక్‌ వెర్సస్‌ ఆర్టిఫిషియల్‌ అనే చర్చ అంతా, మనం ఏఐకి బాస్‌ గానే కానీ బానిసగా ఉండకూడదన్న అంశం మీదే! ఏఐ మనకు ఏం అందిస్తుందనేదే తప్ప మనం ఏఐకి ఏం సమర్పించుకుంటామన్నది ప్రశ్న కారాదు.

యుద్ధంలో ఏఐ సునాయాసంగా మూకుమ్మడి విధ్వంసం సృష్టించగలదు. ఈ ప్రళయాన్ని ఎంచుకునే స్వేచ్ఛను మనం ఏఐకి ఇస్తామా? లేదా ఇలాంటి సామూహిక ఆత్మహత్యా సదృశ నిర్ణయం తీసుకోకుండా అడ్డుకునే ఛాయిస్‌ మన ఆర్గానిక్‌ మేధకే ఉంటుందా? ఇదే ప్రధానం.

ఆర్టిఫిషియల్‌గా ఉండటం మేధ. ఆర్గానిక్‌గా ఉండటం విజ్ఞత. మనం ఆహారం తినాలి గానీ ఆహారం లాంటిది కాదన్న, అసలైన పానీయాన్నే డ్రింక్‌ చేయాలి గానీ నురగను కాదన్న వివేచన కలిగి ఉండటమే ఆర్గానిక్‌ ఇంటెలిజన్స్‌.

కృత్రిమ మేధ యుగంలో సహజ మేధతో ఉండటమంటే... మనం చూడని, మనకు తెలియని, మనం ఎంతమాత్రం అదుపు చేయలేని యంత్రం ముందు మోకరిల్లి, అది చెప్పినట్లు ఆడటం కాదు; మనం ఏం చేయాలో ఎంచుకునే అధికారం మనకు ఉండి తీరాలి!   

గోపాలకృష్ణ గాంధీ 
వ్యాసకర్త పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్, ఆధునిక భారత చరిత్ర విద్యార్థి (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Advertisement
 
Advertisement
Advertisement