గూగుల్‌ నిర్ణయంతో పిల్లలకు చేటు? | Google decision harms children | Sakshi
Sakshi News home page

గూగుల్‌ నిర్ణయంతో పిల్లలకు చేటు?

May 26 2025 6:09 AM | Updated on May 26 2025 6:09 AM

Google decision harms children

సందర్భం

కృత్రిమ మేధ... ఎటు చూసినా ఇదే హాట్‌టాపిక్‌. అయితే ఈ అత్యాధునిక టెక్నాలజీని పిల్ల లకూ చేరువ చేసేందుకు గూగుల్‌ చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధ ఛాట్‌బోట్‌ ‘జెమి నీ’ని 13 ఏళ్ల కంటే తక్కువ వయసు వారికీ అందుబాటు లోకి తెస్తున్నట్లు గూగుల్‌ ఇటీవలే ప్రకటించింది. మొదట అమెరికా, కెనడాల్లో ప్రవేశపెట్టి ఈ ఏడాది చివరికి ఆస్ట్రేలియాలోనూ లాంచ్‌ చేయనున్నట్లు సమా చారం. గూగుల్‌ ఫ్యామిలీ లింక్‌ అకౌంట్లు ఉన్న వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ పరిణామం ఏమంత మంచిది కాదని అనిపిస్తోంది. సోషల్‌ మీడియా వాడకంపై పిల్లలకు నిషేధం ఉన్నా వారిని సురక్షితంగా ఉంచేందుకు ఎన్ని పాట్లు పడాలో ఈ నిర్ణయం హైలైట్‌ చేస్తోంది. బహుశా దీన్ని ముందుగా గూగుల్‌ లాంటి పెద్ద కంపెనీల్లో వెంటనే అమలు చేసి చూడటమే మేలేమో!

పదమూడేళ్ల లోపు పిల్లలకు అందబాటులోకి తెస్తున్న కృత్రిమ మేధ ఛాట్‌బోట్‌ ‘జెమినీ’ వాడకంపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉంటుందని గూగుల్‌ చెబు తోంది. ఫ్యామిలీ లింక్‌ అకౌంట్ల ద్వారా పిల్లలు ఏయే అప్లికేషన్లు వాడవచ్చో నిర్ణయించవచ్చు. పిల్లల పేరుతో అకౌంట్‌ను సృష్టించేందుకు తల్లిదండ్రులు పిల్లాడి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాస్తా వారి వ్యక్తిగత గోప్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకా శాలున్నాయి. అయితే పిల్లల వాడకానికి సంబంధించిన సమాచారాన్ని ఏఐ వ్యవస్థల శిక్షణకు వాడుకోబోమని స్పష్టం చేస్తోంది. 

ఛాట్‌బోట్‌ డీఫాల్ట్‌గా అందుబాటులో ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు నియంత్రణ కోసం కొన్ని ఫీచర్లను స్విచ్చాఫ్‌ చేయాలి. ఈ వ్యవస్థ తప్పులు చేసేందుకు అవకాశముందని అంగీకరిస్తోంది కాబట్టి ఇది అందించే సమాచారం నాణ్యత, విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్నార్థకం. కొన్నిసార్లు ఛాట్‌ బోట్లు కొన్ని సమాధానాలను ఊహించుకుని చెబుతూంటాయి. టెక్‌ పరిభాషలో దీన్ని ‘హెలూసినేషన్‌ ’ అంటూంటారు. పిల్లలు ఒకవేళ తమ హోంవర్క్‌ కోసం ఈ ఛాట్‌బోట్‌ను వాడుతూంటే.. అందులో వాస్తవాలు ఎన్నో... ఛాట్‌ బోట్‌ తాలూకూ భ్రాంతి, భ్రమ ఎంతో తెలియకుండా పోతుంది.
 
గూగుల్, ఇతర సెర్చ్‌ ఇంజిన్లు తమంతట తాము ఒక స్పందన ఇవ్వకుండా...  ఆ యా అంశాలకు సంబంధించిన వేర్వేరు సమాచారాలను మీ ముందు ఉంచు తాయి. వాటిల్లో వార్తలుంటాయి. ఫీచర్‌ కథనాలుంటాయి. విద్యార్థులు ఎవరైనా వీటిని చదివి అర్థం చేసుకుని తమ హోం వర్క్‌లను చేసుకోవచ్చు. అయితే ఏఐ టూల్స్‌ ఇలా కాదు. అందుబాటులో ఉన్న సమా చారంలో ఒక ప్యాటర్న్‌ కోసం వెతుకుతాయి. వాటి ఆధారంగా సమాధానాలను సృష్టిస్తాయి. లేదా చిత్రాన్ని తయారు చేస్తాయి. 

ఇవన్నీ మనం అందించే ప్రశ్న అంటే ప్రాంప్ట్‌ ఆధారంగా జరుగుతాయి. ఉదాహరణకు... ఒక కుర్రాడు పిల్లి బొమ్మ గీయమని అడిగాడని అనుకుందాం. అప్పుడు ‘జెమినీ’ ఛాట్‌బోట్‌ వ్యవస్థ... పిల్లి లక్షణాలు అంటే పొడుచుకొచ్చిన చెవులు, మీసాలు, పొడవైన తోక వంటి వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తుంది. వీటి ఆధారంగా పిల్లి చిత్రాన్ని గీస్తుంది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్లు, జెమినీ ఛాట్‌బోట్‌లు అందించే సమాచారంలోని తేడాలను గుర్తించడం పసిపిల్లలకు సవాలే. ఏఐ టూల్స్‌ పెద్దవాళ్లను కూడా... అది కూడా న్యాయవాదుల వంటి నిపుణులను కూడా తేలికగా బురిడీ కొట్టించగలవని ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. 

వయసుకు తగ్గ సమాచారం మాత్రమే పిల్లలకు అందేలా తాము రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని గూగుల్‌ చెబుతోంది. అయితే ఇలాంటి ఏర్పాట్లు కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఉదాహరణకు... లైంగిక సంబంధిత సమాచారం పిల్లలకు అందకుండా చూసేందుకు కొన్ని పదాలను (ఉదాహరణకు రొమ్ము) నిషేధించామనుకోండి... పిల్లలకు అవసరమైన సమా చారం (కౌమార దశలో శరీరంలో చోటు చేసుకునే మార్పులు) కూడా అందకుండా పోతుంది. 

ఈ–సేఫ్టీ కమిషన్‌  సూచనలు
ఏఐ ఛాట్‌బోట్లతో రాగల సమస్యలను ఈ–సేఫ్టీ కమిషన్‌  ఇప్పటికే వివరించింది. ఏఐ ఛాట్‌బోట్లు ‘‘హాని కరమైన సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని పంచు కోవచ్చు. అలాగే ప్రమాదకరమైన సలహాలూ ఇవ్వ వచ్చు’’ అని హెచ్చరించింది. పిల్లలకు ఛాట్‌బోట్లు అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుందో ఈ సూచన స్పష్టం చేస్తోంది. ఛాట్‌ జీపీటీ, రెప్లికా, టెస్సా వంటి ఛాట్‌బోట్లను ఇప్పటికే పరిశీలించాము. మనుషులు అలిఖిత నిబంధనల సాయంతో చేసే సామాజిక ప్రవర్త లను ఈ ఛాట్‌బోట్ల స్పందనలు ప్రతిబింబిస్తున్నాయి. 

ఈ అలిఖిత నిబంధనలను ‘ఫీలింగ్‌ రూల్స్‌’ అంటారు. తలుపు తెరిచారని ‘థ్యాంక్యూ’ చెప్పడం, లేదా పొర బాటున ఎవరినైనా ఢీకొంటే ‘సారీ’ చెప్పడం వంటివి ఈ ఫీలింగ్‌ రూల్స్‌ కోవలోకి వస్తాయి. వీటిని అనుకరించడం ద్వారా మన నమ్మకాన్ని చూరగొనేలా ఈ ఛాట్‌ బోట్లను రూపొందించారు. అయితే ఈ రకమైన మాన వీయ ప్రవర్తన పిల్లల విషయానికి వచ్చేసరికి గందర గోళం సృష్టించవచ్చు. తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నా నమ్మేలా చేస్తుంది. అంతేకాకుండా... ఓ యంత్రంతో కాకుండా... సాటి మనిషితోనే వ్యవహారాలు నడుపుతున్నామని వారు నమ్మడం మొదలవుతుంది. 

ఆస్ట్రేలియాలో జెమినీ ఛాట్‌బోట్‌ చాలా కీలక సమ యంలో పిల్లలకు అందబాటులోకి వస్తోంది. ఎందుకంటే... పదహారేళ్ల లోపు పిల్లల సోషల్‌ మీడియా అకౌంట్లపై ఈ ఏడాది డిసెంబరు నుంచే నిషేధం అమలు కానుంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్‌  యూని యన్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లు 2023లో చేసిన ‘డిజిటల్‌ డ్యూటీ కేర్‌ చట్టం’ గురించి తెలుసుకోవడం అవసరం. గత ఏడాది నవంబరు నుంచి ఆస్ట్రేలియా ఈ చట్టం అమలును స్తంభింపజేసింది. హానికారక సమాచారం విషయంలో టెక్నాలజీ కంపెనీలనే బాధ్యులను చేస్తుందీ చట్టం!

లీసా ఎం. గివెన్‌  
వ్యాసకర్త ఆర్‌ఎంఐటీ యూనివర్శిటీ అధ్యాపకులు
(‘ద కాన్వర్సేషన్‌ ’ సౌజన్యంతో)

Advertisement
 
Advertisement
Advertisement