పాత వ్యూహాలతో బాబు వరుస పల్టీలు

Chandrababu Naidu Face Political Crisis - Sakshi

సందర్భం

ఇదెప్పుడో క్రీస్తుకు పూర్వం చరిత్ర కాదు. యువకుల నుంచి వృద్ధుల వరకు గుర్తున్న గతమే. ఒకప్పుడు జగన్‌మోహన్‌ రెడ్డి ఎదుర్కొన్నది ఎవరిని? సాక్షాత్తు తను ఏ పార్తీకి లోక్‌సభలో నాయకత్వం వహిస్తున్నాడో ఆ కాంగ్రెస్‌ పార్టీ అధినాయకురాలిని. అప్పటివరకు తన నాన్నగారికి అనుయాయుల్లా, నమ్మిన బంటుల్లా, అనుచరుల్లా వ్యవహరిస్తూ వచ్చిన సొంత పార్టీ ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు అధినాయకురాలికి భయపడిపోయి  తనకు దూరం జరిగినా, తనను దూరం చేసుకున్నా, రాజకీయ ప్రేరేపిత కేసుల్లో చిక్కుకుని పదహారు నెలలు జైల్లో గడిపినా జగన్‌మోహన్‌ రెడ్డి వీసమెత్తు అదరలేదు, బెదరలేదు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనకు వ్యతిరేకంగా వున్నప్పుడు, మీడియాలో అధిక భాగం తన పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన  కాడి కింద పారేయలేదు. అదే ధైర్యం, అదే తెగువ జన సామాన్యంలో అతడిని హీరోను చేసాయి. ఆయనపై పడిన మచ్చలను జనం పట్టించుకోలేని విధంగా రక్షణ కవచంలా కాపాడాయి. ఒకనాడు వైఎస్‌ జగన్‌ ఎదుర్కొన్న ఈ కఠిన పరిస్థితులను చంద్రబాబు ఈనాడు ఒక స్థాయిలో ఎదుర్కొంటున్నారు. నిజానికి ఆ రోజుల్లో  జగన్‌ ఒక్కడూ ఒక పక్క,  మిగిలిన పార్టీలన్నీ మరోపక్క. చంద్రబాబుకి ఈ పరిస్థితి లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌ పార్టీల వంటి కొన్ని రాజకీయ పక్షాలు ఇంకా ఆయనతో మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాయి. బీజేపీతో ఆయన కొని తెచ్చుకున్న వైరం తప్పిస్తే వాళ్ళంతట వాళ్ళు చంద్రబాబు చేతిని వదిలేసి పోయింది లేదు. 2014 నుంచి  2019 వరకు రాష్ట్రంలో అధికారం ఆయనదే.

చంద్రబాబు ఏదో సాధిస్తాడని,  నూతన రాష్ట్రం ఆయన చేతుల్లో పదిలంగా ఉంటుందని జనంలో అపరిమితమైన నమ్మకం. ఆయన దక్షత పట్ల, శక్తియుక్తుల పట్ల చదువుకున్న వారిలో,  మేధావి వర్గాలలో సైతం అంతులేని విశ్వాసం. ఆయన ఏం చేసినా గోరంతను కొండంత చేసి చూపే మీడియా. కేంద్రంలో చాలా కాలం తన మాటకు ఎదురు చెప్పని మిత్ర ప్రభుత్వం. నిజానికి ఏ పరిపాలకుడికి అయినా ఇంతకు మించి ఏం కావాలి?  అయినా ఆయన తన అయిదేళ్ళ పుణ్యకాలాన్ని రకరకాల ఆలోచనలు చేస్తూ, ప్రణాళికలు రచిస్తూ గడిపారే కానీ వాటిల్లో అధిక భాగం అమలుకు నోచుకోలేదు. కొన్ని చేయగలిగినా వాటికి సంపూర్ణత్వం సిద్ధించలేదు. అయిదేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు తన ఆత్మ విశ్వాసం పట్ల ఎనలేని నమ్మకం. నిజానికి నాయకుడు అనేవాడికి ఇది చాలా అవసరం కూడా. అయితే ఆత్మ విశ్వాసం పరిధి మించితే వచ్చేది దుష్ఫలితాలే. 

జగన్‌కు లాగా నెత్తి మీద కత్తిలా ఆయనకు కోర్టు కేసుల గొడవ లేదు. గ్రామస్థాయి కార్యకర్తల బలంతో పోల్చి చూసుకున్నా వైఎస్సార్‌ సీపీ కంటే టీడీపీ మెరుగైన స్థితిలోనే వుంది. ఆయన్ని సమర్థుడైన నాయకుడిగా గుర్తించి, గౌరవించే రాజకీయేతర పెద్ద మనుషులకు కూడా కొదవ లేదు. ఈ రకమైన అభిమానులు చంద్రబాబుకు దేశ విదేశాల్లో అధిక సంఖ్యలో ఉన్న విషయం రహస్యమేమీ కాదు. ఇక రాజకీయ అనుభవమా! ఈ విషయంలో ఆయనది ఎప్పుడూ అగ్రస్థానమే. మరి ఇన్ని సానుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయన నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ ఎందుకు ముక్కుసూటి రాజకీయాలు కాకుండా వ్యూహ, ప్రతివ్యూహాలతో కూడిన రాజకీయ ఎత్తుగడలను ఆశ్రయిస్తోంది? ఒక ఎన్నికలో చతికిల పడిన పార్టీ అంతటితోనే చితికి పోదు, అంతరించిపోదు. దీనికి టీడీపీనే రుజువు. పార్టీ సంస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ జీవించి ఉన్న కాలంలో కూడా ఆ పార్టీకి ఉత్థానపతనాలు తప్పలేదు. టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కూడా ఇదే. 1989లో అధికారంలో ఉన్న ఈ పార్టీ తరువాత ఎన్నికల్లో ఓడిపోయింది. 1994లో అసెంబ్లీలో ఈ పార్టీ బలం కేవలం 26. అలాంటిది 2004 ఎన్నికల నాటికి మళ్ళీ తన బలాన్ని 185కి పెంచుకుంది.

ప్రస్తుత అసెంబ్లీలో మొత్తం 175 స్థానాల్లో టీడీపీకి 23 లభించాయి. మొత్తం 294 స్థానాల్లో 26 గెలుచుకున్న అప్పటి కాంగ్రెస్‌ పరిస్థితితో పోలిస్తే ఇది మెరుగే. కాంగ్రెస్‌ మళ్ళీ పుంజుకొని తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి ఓట మితో టీడీపీ అంతగా కుంగిపోవడం ఎందుకు? వైఫల్యాల్లో అవకాశాలు వెతుక్కునే సమర్థత కలిగిన నాయకుడు ప్రజాస్వామ్య బాటలో సాగి మరో విజ యానికి ప్రయత్నం చేయకుండా కోర్టులు, కేసులు వంటి పరోక్ష పద్ధతిలో కౌటిల్యం చేస్తున్నారనే నిందలు మోయడం ఎందుకు? వెనుకటి రోజుల్లో  అయితే, వీటిని జనంలో చాలామంది తేలిగ్గా తీసుకునేవారేమో కానీ ఇప్పటి సోషల్‌ మీడియా యుగంలో అలాంటి అవకాశం ఉంటుందా! ప్రధాన స్రవంతి మీడియాకు దీటుగా, మరింత ఎక్కువ ప్రభావం చూపగల సోషల్‌ మీడియా పురుడుపోసుకున్న ఈ కాలంలో పాత పద్ధతులు పనికిరాకపోవచ్చు. కాలానుగుణంగా అప్‌ డేట్‌ కావాల్సిన అవసరాన్ని గురించి టెక్నో సావీ నాయకుడైన బాబుకు ఒకరు చెప్పేది ఏమీ వుండదు. ఎన్నికల సమరంలో చదరంగపు ఎత్తులు, ఎత్తుగడలు అవసరమే. కానీ సాంఘిక మాధ్యమాలు రాజ్యం చేస్తున్న ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువ చాణక్యం మేలుచేయకపోవచ్చు.

అధికార పక్షానికి న్యాయస్థానాల అక్షింతలు, మొట్టికాయలు అంటూ నిరంతరంగా సాగించిన ప్రచారం మరో రకంగా జగన్‌ పట్ల సానుభూతిని పెంచేదిగా తయారు అయ్యే అవకాశాలను గురించి ఆలోచించకపోవడం టీడీపీ వ్యూహకర్తల మరో వైఫల్యం. దీనికి తోడు జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక న్యాయస్థానం ఇచ్చిన  తీర్పుల్లో అధికభాగం పై కోర్టులో నిలవకపోవడం కూడా టీడీపీపై వచ్చిన ఆరోపణలకు ఊతం ఇస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నా, ఇప్పుడు కొత్తగా రాష్ట్ర విభజన అనంతరం తీసుకున్నా చంద్రబాబు అత్యంత ఎక్కువ కాలం పాలించిన నాయకుడు. సందేహం లేదు. పరిపాలనా వ్యవస్థకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి,  వ్యవస్థల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కారణం తానే అని ఎవరైనా లేశ మాత్రంగా అనుమానించినా కూడా బాబుకి అది శోభస్కరం కాదు. ఏదో సినిమాలో చెప్పినట్టు ‘‘యుద్ధం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం’’. ఇది హితవచనం మాత్రమే.

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
భండారు శ్రీనివాసరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top