
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్సిటీలలో, కళాశాలల్లో స్టూడెంట్ బాడీ ఎన్నికల నిర్వహణపై నిషేధం విధించి 36 ఏళ్ళు అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1988లో ఉస్మానియా విశ్వ విద్యాలయ (Osmania University) అనుబంధ నిజాం కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలో ఓ విద్యార్థి హత్య గావించబడ్డాడనే నెపంతో అప్పటి పాలకులు విద్యార్థి సంఘం ఎన్నికలపై (Student Polls) నిషేధం విధించారు.
ఎనభయ్యో దశకంలో విద్యార్థి సంఘం ఎన్నికలు విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరిచి అభివృద్ధి వైపు నడిపించాయి. విద్యా సంస్థల్లో ఈ ఎన్నికల నుండి ప్రేరణ, చైతన్యం పొంది ప్రధాన స్రవంతి రాజకీయాలలోకి వచ్చిన అనేక మంది సాధారణ విద్యార్థులు నేడు భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో తమ ప్రభావాన్ని చూపు తున్నారు. మరికొంత మంది విద్యా ర్థులు ప్రజల ఆకాంక్షలను సఫలం చేసేందుకు భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. నాడు క్యాంపస్‌లలో స్టూడెంట్ బాడీ ఎన్ని కలలో ఎన్నికైన విద్యార్థులు విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ముందు వరుసలో ఉండేవారు. విద్యార్థుల అకడమిక్ సమస్యలు, వసతి సమస్యలు పరిస్కారమయ్యేవి. దాంతో యూనివర్సిటీలు జ్ఞాన కేంద్రాలుగా, ఉద్యమ కేంద్రాలుగా సమాజంపై గొప్ప ప్రభావాన్ని వేశాయి. నేడు విద్యార్థి సంఘ ఎన్నికలు లేకపోవడంతో విద్యార్థుల డిమాండ్లను లేవనెత్తడం, ఆయా యాజమాన్యాలు, ప్రభుత్వాలను సంప్రదించి పరిష్కరించడం సవాలుగా మారింది.
ఇటీవల కాలంలో విద్యార్థుల పోరాటాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైందనీ, విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవైపు విద్యార్థి సంఘాల ఎన్నికలపై గత పాలకులు విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ... మరోవైపు విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని అనడం విద్యార్థులను మోసం చేయడమే అవుతుంది. ముఖ్యమంత్రి తక్షణమే విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలి. అందుకు గతంలో జేఎమ్ లింగ్డో కమిటీ (JM Lyngdoh Committee) సూచనలు పాటిస్తూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆర్డరుతో 2005 డిసెంబర్ 2వ తేదీన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎమ్ లింగ్డో అధ్యక్షతన ఐదుగురు సభ్యులు ఉన్న కమిటీని... యూనివవర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణ అంశంపై అధ్యయనం చేసేందుకు నియమించింది. 2006 మే 26న కమిటీ తన నివేదికను సమర్పించింది.
ఈ నివేదిక ముఖ్య ప్రతిపాదనలు
దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల ప్రాతినిధ్యతో స్టూడెంట్ బాడీ/యూనియన్ ఎన్నికలు జరపాలి. విద్యార్థి సంఘాలు ఎన్నికల నిర్వహణ కొరకు క్యాంపస్‌లలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాలి. నామి నేషన్ల స్వీకరణలో విద్యార్థుల అకడమిక్ ప్రతిభను పరిణనలోకి తీసుకోవాలి. ఐదేళ్లకు ఒకసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలను, ప్రెసిడెంట్ ఎన్నికలను నమూనా మోడల్‌గా తీసుకోవాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి విద్యార్థి సంఘం ఎన్నికలపై సమీక్ష జరగాలి. ఆఫీస్ బేరర్ల ఎన్నికలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ – ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ నమూనా పాటించాలి. విద్యార్థి సంఘం ఎన్నికలు (student union elections) రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి. యూనివర్సిటీ ఎన్నికలలో పాల్గొనే విద్యార్థుల తరగతిగది హాజరు 70% ఉండాలి.
చదవండి: చంపాల్సింది కులాన్ని... ప్రేమికుల్ని కాదు!
ఈ నివేదికను అమలు చేస్తూ స్టూడెంట్ బాడీ ఎన్నికలు జరపాలని 2006 సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు మరో ఆర్డరు జారీచేసింది. దాంతో, యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ) 2007లో దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో ఎన్నికల నిర్వహణకై ఆదేశాలు జారీచేసింది. తదనుగుణంగా దేశంలో స్టూడెంట్ బాడీ ఎన్నికలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కానీ ఎన్నికలపై విధించిన నిషేధం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగడం లేదు. విద్యార్థులు ఇందుకోసం ఉద్యమించాలి.
– కోట ఆనంద్
విద్యార్థి నాయకుడు