ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఏబీవీపీకి షాక్
న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్ష కూటమి తన ప్రాబల్యాన్ని నిలుపుకుంది. కీలకమైన నాలుగు పోస్టులనూ కైవసం చేసుకుంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్‌ఏ), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డీఎస్‌ఎఫ్)ల కూటమి ఈ ఎన్నికల్లో క్యాంపస్‌పై తమ ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నాయి.
దాదాపు దశాబ్ద కాలం తర్వాత గత ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీ పోస్టును దక్కించుకున్న ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఏబీవీపీకి ఈ దఫా ఆ ఒక్క పోస్టు కూడా నిలుపుకోలేక పోవడం గమనార్హం.
ఏఐఎస్‌ఏ తరఫున ప్రెసిడెంట్ పదవికి పోటీ పడిన అదితి మిశ్రా, ఏబీవీపీకి చెందిన వికాస్ పటేల్‌పై 449 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి కిఝాకూట్ గోపికా బాబు ఎన్నికయ్యారు. డీఎస్‌ఎఫ్ అభ్యర్థి సునీల్ యాదవ్, ఏఐఎస్‌ఏకు చెందిన డానిష్ అలీ జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులకు ఎన్నికయ్యారు. మొత్తం అర్హులైన 9,043 మంది విద్యార్థులో 67 శాతం మంది ఓటేశారు. గతేడాది 70 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం.


