అఖండ ఇజ్రాయెల్‌ భావన ప్రమాదకరం | Buddiga Jamindar Views on Akhand Israel Concept | Sakshi
Sakshi News home page

అఖండ ఇజ్రాయెల్‌ భావన ప్రమాదకరం

Apr 3 2026 12:15 PM | Updated on Apr 3 2026 12:21 PM

Buddiga Jamindar Views on Akhand Israel Concept

ప్రస్తుత యుద్ధరంగంలో లెబనాన్, పాలస్తీనా, ఇరాన్‌ ప్రతిఘటనల్ని అణచివేసి ‘అఖండ ఇజ్రాయెల్‌’ స్థాపనకు ఇజ్రాయెల్‌ విశ్వ ప్రయత్నం చేస్తోంది. దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానంలో అతని సంతానానికి నైలునది–యూప్రటీసుల మధ్యగల భూభాగం చెందు తుందని పురాణం చెబుతున్నట్లంటుంది. దీని ప్రకారం ఇరాన్, జోర్డాన్, లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా దేశాలన్నింటినీ లేదా వాటిల్లో కొంత భూభాగాన్ని ఇజ్రాయెల్‌ ‘అఖండ ఇజ్రాయెల్‌’ కింద పరిగణిస్తోంది.

ఆటోమన్‌ సామ్రాజ్యంపై విజయం సాధించిన బ్రిటిష్‌ సామ్రాజ్యం... అరబ్బులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసి దానిపై పరిపాలనాధికారాన్ని 1948 వరకు తన దగ్గరే ఉంచుకొంది. 1917లో యుద్ధ సమయంలో యూదు నాయకుడు తియోడర్‌ హెర్షల్‌కు, బ్రిటిష్‌ వాళ్లకు మధ్య జరిగిన బల్‌ఫోర్స్‌ రహస్య ఒప్పందం ఫలితంగా... పాలస్తీనా భూభాగంలో యూదులకు తలదాచుకోవటానికి వాగ్దానం చేశారు.

1948లో వారి అనుకూల ఐక్యరాజ్య సమితిలో 118వ తీర్మానంతో ఇజ్రాయెల్, పాలస్తీనాలుగా భూభాగాన్ని విభజించారు. కానీ 1948 యుద్ధంలో ఇజ్రాయెల్‌... గాజా, వెస్ట్‌బ్యాంక్‌లు మినహా బ్రిటిష్‌ మాండేటరీ పాలస్తీనా మొత్తాన్నీ తన ఆధీనంలోకి తీసుకొంది. 1967లో ఆరు రోజుల యుద్ధంలో వెస్ట్‌బ్యాంక్, గాజాలతో పాటుగా ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంతోపాటు సిరియాలోని గోలెన్‌ హైట్స్‌ను ఆక్రమించి, 1982లో సినాయ్‌ను ఈజిప్టుకు తిరిగి ఇచ్చింది. ఇప్పటికీ ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ అదుపుకలిగి ఉండటం గమనార్హం.

ఇరాన్‌ యుద్ధాన్ని అదునుగా చేసుకొని దక్షిణ లెబనాన్‌లో, రాజధాని బీరూట్, మధ్య జిల్లాలతోపాటు బెకాలోయపై ఇజ్రాయెల్‌ బాంబుల దాడులు చేస్తున్నది. నివాస ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. 15 లక్షల మందికి పైగా, దేశంలో దాదాపు 20 శాతం ప్రజలు తమ ఇళ్లను వదిలి వలసలకు వెళ్లిపో వాల్సి వచ్చింది. ఇది అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని ఐరాస ప్రకటించింది. హెజ్బొల్లాను నిరాయుధులుగా చేసేవరకు లెబనాన్‌ భూమిని ఆక్రమిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రజలను భయభ్రాంతుల్ని చేయటం ద్వారా హెజ్బొల్లాకు వ్యతిరేకంగా వారిని మార్చాలనే వ్యూహంలో ఇజ్రాయెల్‌ ఉంది.

ప్రస్తుతం అమెరికా మద్దతుగా ఉన్న సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అలాషర్‌తో ఇజ్రాయెల్‌ మరింత బలపడుతోంది. సిరియా ద్వారా లెబనాన్‌ సరిహద్దులను, కదలికలను గమనిస్తూ లెబనాన్‌కు సహాయం అందకుండా చేస్తోంది. లెబనాన్‌ తూర్పు సరిహద్దును మూసివేయించింది. దేశంలో ఇప్పటికే అనేక వంతెనలను కూల్చింది. లెబనాన్‌ ఆక్రమణ దిశగా సాగుతోంది.

చ‌ద‌వండి: అమెరికా.. త‌న ఆట‌లో త‌నే పాయిందా?

కానీ డెమోరా అణుకేంద్రంపై ఇరాన్‌ చేసిన దాడి ఇజ్రాయెల్‌కు వణుకుపుట్టించింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన అమెరికా అధ్య క్షుడు ట్రంప్‌ ఏకంగా కొన్ని రోజులపాటు ఇరాన్‌ ఇంధన కేంద్రాలపై దాడిచేయబోమని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ‘అఖండ ఇజ్రాయెల్‌’ సాకారమవ్వడం అసాధ్యం. ఒక వేళ ఈ యుద్ధంలో ఇజ్రా యెల్‌– అమెరికా నెగ్గితే మొత్తం పశ్చిమాసియాను ఆక్రమించి దీనికి ‘నూతన పురాణ అఖండ ఇజ్రాయెల్‌’గా మరొక పురాణగాథ చెప్ప టానికి అవి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇరాన్‌ దగ్గర వాటి ఆటలు సాగడం లేదు. ‘రెండు దేశాల’ సిద్ధాంతానికి ఇజ్రాయెల్‌ కట్టుబడిన నాడే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమవుతుంది. అంతవరకూ పశ్చిమాసియా కాష్ఠం రగులుతూనే ఉంటుంది.

– బుడ్డిగ జమిందార్‌
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement