చట్టాలలో అస్పష్టత ఎవరి పుణ్యం?!

ABK Prasad Guest Column Judiciary System Gets Respect When Put Practice - Sakshi

రెండో మాట 

న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వులు ఆచరణకు నోచుకున్నప్పుడే వాటికి విలువా, గౌరవమూ ఉంటాయి. పాలకవర్గం ఆ ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకపోతే దేశంలో గందరగోళం నెలకొని ఉన్నట్టే! ఆ గందరగోళమే చట్టాలు చేయడంలోనూ ప్రతిఫలిస్తోంది. ఎన్నో చట్టాలు సరైన చర్చలు లేకుండానే ఆమోదం పొందుతున్నాయి. ఫలితంగా చట్టాల లక్ష్యమేమిటో జనానికి తెలియకుండా పోతోంది. స్వాతంత్య్రోద్యమ కాలం నాటి స్ఫూర్తి, పారదర్శకత అడుగంటడమే ఈ విలువల పతనానికి కారణం. వలస పాలనావశేషాలు తొలగిపోనంతవరకూ వ్యవస్థలో మార్పు రాదు. అందుకే భారత న్యాయవ్యవస్థను పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

‘‘కోర్టులు జారీచేసే ఉత్తర్వులు ఆచర ణలో అమలు జరిగినప్పుడే వాటికి విలువా, గౌరవమూ... క్రమంగా కార్యనిర్వాహక వర్గమైన దేశ పాలకవర్గం కోర్టు ఉత్తర్వులను ‘బేఖాతరు’ చేసే ధోరణిలో ఉంది. అంతేగాదు, చట్టాలు చేయడంలోనూ, దేశంలో పార్లమెంటరీ చర్చల నిర్వహణలోనూ అనుసరిస్తున్న తీరుతెన్నులు సక్రమంగా లేవు. ఇందువల్ల దేశంలో తగాదాలు (లిటిగేషన్‌) పెరిగి, దేశ పౌరులకు, కోర్టులకు, తదితర సంబంధిత వర్గాలకు అసౌకర్యం కలుగుతోంది. చట్టాలు ఎందుకు చేస్తున్నామో స్పష్టత లేనందునే ఈ గందరగోళమంతా. దేశ చట్టాలను చట్ట సభలలో క్షుణ్ణంగా చర్చించిన, ఆమోదించిన రోజులున్నాయి. కానీ దురదృష్టవశాత్తూ కొంతకాలంగా చట్ట సభల్లో జరుగుతున్నదేమిటో మీకు తెలుసు, గుణాత్మకమైన చర్చలు జరగడం లేదు. ఫలితంగా రూపొందుతున్న కొత్త చట్టాల ఉద్దేశంగానీ, లక్ష్యంగానీ బొత్తిగా బోధపడటం లేదు.’’
– 16 ఆగస్టు 2021 – 27 డిసెంబర్‌ 2021 తేదీలలో గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి.

ఆ మాటకొస్తే, చట్టాలు రూపొందిస్తున్న తీరు, పార్లమెంటులో చర్చ లేకుండానే ‘తూతూ మంత్రం’గా ఆమోద ముద్ర వేస్తున్న తీరు గురించి ఒక్క ప్రధాన న్యాయమూర్తి రమణే కాదు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా నిరసన తెలపక తప్పలేదు. చట్టసభలలో చర్చలన్నవి ఎంతో పేలవంగా తయారయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘చట్ట సభలలో నేడు పేరుకు జరుగుతున్న చర్చలు ఇంతగా పతనమవడాన్ని నేడు కళ్లారా చూడవలసి వస్తోంది. సమగ్రమైన చర్చలు జరక్కుండానే చట్టాలు రూపొందిస్తున్నారు. ప్రజాస్వామ్యా నికి ఆధారమే చర్చలూ, సరైన వాదనలూ. అయినా సభలో చర్చలు నిరాటంకంగా జరక్కుండా అడ్డుకోవడం తీవ్ర అభ్యంతరకరం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థల హుందాతనాన్ని, గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీయడమే’’ అని స్పీకర్‌ ఓం బిర్లా హెచ్చరించడం గమనార్హం!

వీటన్నింటికంటే ప్రధానమైనది, ఒకనాటి పత్రికలు సమాజంలో నెలకొల్పిన పాత్రికేయ ప్రమాణాలుగానీ, వాస్తవాలపై ఆధారపడిన పరిశోధనాత్మక జర్నలిజంగానీ ఈ రోజున మనకు మృగ్యమని పేర్కొంటూ గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ నేడు సమాజంలో వాస్తవిక సంచలనం కలిగించగల ఒక్క వ్యాసమన్నా మీడియాలో చోటు చేసుకుందా అని ప్రశ్నించారు. ఒకనాడు భారీ కుంభకోణాలకు సంబంధించిన కథనాలు చదవడానికి పాఠకులు ఉవ్విళ్లూరేవారనీ, కానీ ప్రస్తుత కాలంలో ఏది నిజమో, ఏది కట్టుకథో తెలుసుకోవడం గగనమై పోతోందనీ కూడా జస్టిస్‌ రమణ ఎత్తి పొడిచారు. అంతేగాదు, ఇటీవలనే ‘మాధవన్‌ కుట్టి అవార్డుల’ ప్రదానోత్సవం సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ (18 డిసెంబర్‌ 2021), నేడు దేశంలో వాస్తవాల కోసం ఒక పత్రికపైనో, ఒక చానల్‌పైనో పాఠకుడు ఆధారపడే పరిస్థితి లేదనీ, పాత్రికేయ విలువలు, ప్రమాణాలూ పడిపోతున్నాయనీ, కనీసం ఒక ఘటనపై వాస్తవాలు తెలుసుకోవాలంటే కనీసం నాలు గైదు పత్రికలు చదవాల్సి వస్తోందనీ వ్యాఖ్యానించారు. 

కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలోనే జాతీయోద్యమ కాలంనాటి సామాజిక విలువలు, స్ఫూర్తి మనం ఎందుకు, ఎవరి వలన కోల్పోవలసి వచ్చిందన్న ప్రశ్నకు నేటి తరం స్వార్థపరులైన రాజకీయ పాలకులు ఎవరూ సూటిగా సమాధానం చెప్పగల పరిస్థితుల్లో లేరు. చివరికి అనేకమంది ప్రజాస్వామిక, సామాజిక కార్యకర్తల చొరవ ఫలితంగా, పౌర హక్కుల ఉద్యమకారుల నిరంతర పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన ‘సమాచార హక్కు చట్టాన్ని’ సహితం నీరుగార్చి పాలకులు జీవచ్ఛవంగా మార్చిన విషయం మరిచిపోరాదు. చివరికి ఒక విదేశీ గూఢచారి వ్యవస్థ సలహా సంప్రదింపులపై ఆధారపడి దేశీయ పౌరహక్కుల ఉద్యమాలనూ, పౌరహక్కులనూ అణగదొక్కేందుకు, అరబ్‌ ప్రజలను అణచడంలో అమెరికాకు ‘తైనాతీ’గా పనిచేస్తున్న ఇజ్రాయెల్‌ను మన పాలకులు ఆశ్రయించడం... మన దేశంలోనే కాదు, ప్రపంచ సభ్యదేశాలలో ‘పెగసస్‌’ కుంభకోణం ద్వారా వెల్లడయిందని మరచిపోరాదు. చివరికి మన సుప్రీంకోర్టు చేతిలో దేశ పాలకులు చిక్కుపడిపోయి ‘పెగసస్‌’ కుంభకోణం నుంచి బయటపడగల పరిస్థితులు దాదాపు శూన్యంగా కన్పిస్తున్నాయి. 

ఈ పరిస్థితుల్లోనే ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయ మూర్తులైన ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ భారత న్యాయ వ్యవస్థను బడుగు వర్గాలయిన పేద ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, వలస పాలనావశేషాలకు దూరంగా పునర్నిర్మించు కోవలసిన అవసరం ఉందనీ, మన సమాజ వాస్తవాలకు సన్ని హితంగా మలచుకోవలసిన సమయం వచ్చిందనీ హెచ్చరించడం విశేషం. కనీసం 75 సంవత్సరాల స్వాతంత్య్ర ముహూర్తం కూడా గడిచిపోతున్న సందర్భంలోనైనా మనం కళ్లు తెరవవలసి ఉంది. ప్రజాబాహుళ్య విశాల ప్రయోజనాలకు అనుగుణంగా విదేశీ న్యాయ శాస్త్ర అనుభవాల నుంచి మంచిని గ్రహిస్తూనే, ఒక స్వతంత్ర దేశంగా భారతదేశ న్యాయ వ్యవస్థను వలస పాలనావశేషాలకు కడు దూరంగా పునర్నిర్మించుకోవలసిన అవసరం గురించి 1986 నాటి ఎం.సి. మెహతా కేసులో ఆనాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్‌. భార్గవ గుర్తు చేసిన వాస్తవాన్ని మనం మరవకూడదు. ఈ అనుభవాల నుంచి భారత న్యాయ వ్యవస్థకు రాజ్యాంగంలోని 141వ అధికరణ కింద ఒనగూడిన ప్రత్యేక సదుపాయమే ‘ప్రజా ప్రయో జనాల వ్యాజ్యం’ పౌర హక్కు అని మరచిపోరాదు. 

ఇలా ఎన్ని రకాల హక్కులు దేశ పౌరులకు సమకూడినా– ఈ పెట్టుబడిదారీ భూస్వామ్య జమిలి వ్యవస్థ... ఆచరణలో రద్దు కానంత వరకూ... రాజకీయ పార్టీలు ఎన్ని ముసుగుల్లో అధికార పెరపెరతో ఎన్నికల్లో పాల్గొన్నా, వలస పాలనా చట్ట అవశేషాలు– దేశాధికారం ఎవరి చేతుల్లో ఉన్నా... ప్రజా బాహుళ్యానికి ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటారా? ప్రసిద్ధ ఆంగ్ల కవయిత్రి మౌమిత ఆలం ‘లైవ్‌ వైర్‌’కు రాసిన ‘పొరపాటు’ కవితకు ‘ఉదయమిత్ర’ అనువాదంలోని ఆవేదనను పరిశీలించండి:

‘‘ఔను, వాళ్లెవరినైనా చంపగలరు
రాజ్యం వాళ్లకు హామీపడింది!
ఎవరినైనా, ఎప్పుడైనా, ఎందుకైనా చంపగలరు
చావడానికి మనకు కారణాలుంటాయేమోగానీ
చంపడానికి వాళ్లకు ఏ కారణమూ ఉండనక్కర్లేదు
ఇంట్లో పనిచేసుకుంటున్న అఖ్లాన్‌నీ
రైల్లో ప్రయాణిస్తున్న పెహ్లూన్‌ని చంపగలరు
లక్షలాదిమంది పేర్లూ, చరిత్రనూ తుడిచేసి
నిలువెత్తు జీవితాల్ని నంబర్ల కిందకు కుదించేసి
అనేకానేకుల్ని అనాధ శవాలుగా మార్చేయగలరు...
ఇంతకూ ఎవరువాళ్లు?
వాళ్లు దేశ ప్రేమికులండోయ్‌!
ఏ శిక్షా పడకుండా
సొంత ప్రజలనే చంపగలరు!
గుర్తించడానికి నిరాకరించో
‘పొరపాటు’ గుర్తింపు పేరుమీదనో
ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చంపగలరు!
సర్వకాల సర్వావస్థలకు అతీతులు వాళ్లు సుమా!
అవును, వాళ్లెవరినైనా చంపగలరు
రాజ్యం వాళ్లకు హామీపడింది!’’


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top