ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!

Abk Prasad Article on Sirpurkar Commission on Disha Encounter - Sakshi

రెండో మాట

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ పోలీసులు చెబుతున్న ‘కట్టుకథ’ అని జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది. సుప్రీం కోర్టు కూడా ఎన్‌కౌంటర్‌ దోషులెవరనేది ఇప్పుడు రహస్యమేమీ కాదని పేర్కొంది. ‘దిశ’ నిందితుల్లో ముగ్గురు మైనర్‌ యువకులు. వాళ్ళు మైనర్లని సాధికారికంగా నిర్ధారణకు వచ్చాకనే పోలీసుల ఆరోపణలు ‘నమ్మశక్యం కానివి’గా కమిషన్‌ పేర్కొంది. అలా ఈ వ్యవహారంలో తప్పంతా పోలీసుల మీద పడుతోంది. అయితే యావత్‌ దేశంలో  జరుగుతున్న ఎన్‌కౌంటర్‌ కట్టుకథలకు కేవలం పోలీసులను నిందించడం ఘోరమైన పాక్షిక వైఖరి అవుతుంది. అధికారంలో ఉన్నవారి అనుయాయుల ఎరుక లేకుండా పోలీసు యంత్రాంగం తనకు తానుగా తప్పుడు కేసులకు, ఇలాంటి ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డానికి సాహసిస్తుందా? 

‘‘భారతదేశంలో 1984–2020 మధ్య దేశ పోలీస్‌ యంత్రాంగం ప్రవర్తన మారలేదు. వృత్తి బాధ్యతల పరంగానూ, పోలీస్‌ యంత్రాంగాన్ని నిర్వహించే పాలకుల ఆచరణలోనూ మార్పు లేదు’’          – రిటైర్డ్‌ జడ్జి ఢీంగ్రా
‘‘చటాన్‌పల్లి (హైదరాబాద్‌ శివార్లు)లో ‘దిశ’ హత్య కేసులోని నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఓ కట్టుకథ. పిన్న వయస్సు యువకు లపై జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తక్షణ న్యాయం కోసం పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌ జరపడం అనేది ఆమోదయోగ్యం కాదు. ఎన్‌కౌంటర్‌ జరి పిన పోలీసులపై చర్యలు తప్పనిసరి. హత్యానేరం కింద పోలీసులపై విచారణ చేయాల్సిందే.’’
– జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక (20.5.2022)
‘‘ఎన్‌కౌంటర్‌లో దోషులెవరో కమిషన్‌ గుర్తించింది. ఇందులో దాపరికమంటూ లేదు, కేసును ఇక తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది.’’
– సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటన (21.5.2022)

ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించి అన్నింటి కన్నా ఆశ్చర్యకరమైనది... జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ సాధికార నివేదికను పొక్కనివ్వకుండా చూడమని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పదేపదే విజ్ఞప్తులు చేసుకోవడం. కానీ, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ కమిషన్‌ నివేదికను తదుపరి చర్యలకు తెలంగాణ హైకోర్టుకు పంపించారు. అంతకుముందు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌ హత్యలపై సీబీఐ ప్రత్యేక విచారణను కోరుతూ  పిటిషనర్‌ న్యాయవాది జి.ఎస్‌.మణి ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. దాని ఫలితంగానే 2019 డిసెంబర్‌లో జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ను సుప్రీంకోర్టు నియమించాల్సి వచ్చింది. పిటిషనర్‌ న్యాయవాది మణి ‘మహిళలపై తరచుగా జరుగుతున్న హత్యలను నిరోధించడంలో విఫలమవుతున్న వైనాన్ని గుర్తించకుండా ఉండేందుకే పోలీసులు ఇలాంటి ఎన్‌కౌంటర్లకు బుద్ధిపూర్వకంగా తలపెడుతున్నారని పేర్కొ న్నారు. అందుకే సీబీఐనిగానీ, ప్రత్యేక విచారణ బృందాన్నిగానీ రంగంలోకి దించాలని కోరారు. ఈ విజ్ఞప్తులు అన్నింటి ఫలితంగానే సిర్పూర్కర్‌ కమిషన్‌ నియామకం జరిగింది. 14 మాసాలకు పైగా చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ భాగోతంపై పూర్తి విచారణ జరిపింది. చివరకు ‘ఈ ఎన్‌కౌంటర్‌ కట్టుకథ’ అని తేల్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ... ఆ మాటకొస్తే యావత్తు దేశంలో జరుగుతున్న ‘ఎన్‌కౌంటర్‌’ కట్టు కథలకు కేవలం పోలీసులను మాత్రమే నిందించడం ఘోరమైన పాక్షిక వైఖరి అవుతుంది. ఎందుకంటే, ‘శివుడికి తెలియకుండా చీమైనా కుట్టద’న్న సామెత మనకు ఉగ్గుతో పోసిన పాఠం ఉండనే ఉంది కదా! అలాగే పాలనాధికారంలో ఉన్నవారి అనుయాయుల ఎరుక లేకుండా పోలీసు యంత్రాంగం తానుగా తప్పుడు కేసులకు, ఇలాంటి ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డానికి సాహసిస్తుందా?! పాలకుల స్వార్థ ప్రయోజనాల్ని కనిపెట్టి, కాపు కాసుకుని ఉండే పోలీసు వర్గాలు మాత్రమే ఇలాంటి ఎన్‌కౌంటర్లకు సిద్ధమవుతాయి. ఈ చొరవనే ‘పిలవని పేరంటం’ అనేది! అసలు, సమాజంలో విచ్చలవిడిగా మహిళలపై రకరకాల హత్యలకు, అరాచకాలకు పాల్పడ్డానికి కారణం... భారత సామాజిక వ్యవస్థ అరాచక, దోపిడీ వ్యవస్థగా మారడం. ఫ్యూడల్‌ (భూస్వామిక) వ్యవస్థ పూర్తిగా కనుమరుగు కాకముందే మరింతగా ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష దోపిడీకి ‘గజ్జె’ కట్టిన కారణంగానే భారత సామాజిక స్థితిగతులు 75 ఏళ్ల తర్వాత కూడా అధోగతికి చేరుతూనే ఉన్నాయి.  ఇది మనం మనం కళ్లారా చూస్తున్న దృశ్యమే.

ఈ పరిస్థితికి జవాబుగానే ‘దిశ’ కేసు విచారణలో జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ ‘ఎదురుకాల్పుల నివారణకే ఎన్‌కౌంటర్‌ జరపాల్సి వచ్చిందన్న’ పోలీసు అధికారుల సాకును...  నమ్మలేకనే ‘కట్టుకథ’గా నిర్ధారించవలసి వచ్చింది. ‘ఉగ్రవాదుల’ పేరిట జరిగే ఎదురు బొదురు కాల్పుల సంగతి వేరు. అది సమ ఉజ్జీల మధ్య ‘సమరశంఖం’ కావొచ్చు! కానీ ‘దిశ’ దారుణ హత్యకేసు పేరిట పోలీసులు జరిపిన ‘ఎన్‌కౌంటర్‌’ కేసు సందర్భంగా నిందితులెవరో జాతీయ స్థాయి కమిషన్‌ తేల్చి చెప్పింది. అందువల్లనే ఇంక అది ఏమాత్రం రహస్యం కాదని జస్టిస్‌ రమణ కూడా ప్రకటించాల్సి వచ్చింది. ‘రావలసిన తీర్పు ఎంతకాలం ఆలస్యమైతే, ఆ మేరకు కక్షిదారులకు అంతకాలం అన్యాయం జరిగినట్టే’ అని న్యాయ చట్టం ఘోషిస్తున్నా సరే, మనకు చలనం లేదు! మరొక విశేషమేమంటే మన దేశంలోనే ఒక భూమి తగాదాలో 108 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు రావడం చూశాం మనం!

ఇప్పుడు తాజా కేసులోని ఎన్‌కౌంటర్లో చనిపోయిన నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్‌ యువకులు. వాళ్ల స్కూల్‌ రికార్డులను సైతం పరిశీలించి మరీ వాళ్లు మైనర్లని సాధికారికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే సిర్పూర్కర్‌ కమిషన్‌ పోలీసుల ఆరోపణలు ‘నమ్మశక్యం కానివి’గా తీర్పిచ్చింది! అలాగే, సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను బహిరంగ పర్చకుండా రహస్యంగా కవర్‌లో పెట్టి కోర్టు వారు కింది కోర్టులకు పంపాలిగానీ, బహిరంగపరచ రాదనే వాదనను ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చడం ప్రశంసనీయం. అంతేకాదు, ప్రభుత్వం తరఫు న్యాయవాది శ్యామ్‌ దివాన్‌... కమిషన్‌ నివేదికను బట్టబయలు చేస్తే న్యాయపాలనపై తీవ్రమైన ప్రభావం ఉంటుంద న్నారు. కాబట్టి ‘సీల్డ్‌ కవర్‌’లో పెట్టి పంపాలని వాదించారు. ఈ వాదనను కమిషన్‌ సభ్యురాలైన జస్టిస్‌ కోహ్లీ నిరాకరించారు. ఈ సమయంలోనే ప్రధాన న్యాయమూర్తి రమణ... ‘దేశ భద్రతకు ఏర్పడిన తీవ్ర ప్రమాదకర సన్నివేశం ఏదైనా ఉండి ఉంటే దాన్ని పరిశీలించవచ్చు. ఇది తెలంగాణ పోలీసు ఎన్‌కౌంటర్‌ కేసు కాబట్టి ‘సీల్డ్‌ కవర్‌’ రాజకీయం ఇక్కడ కుదరద’న్నారు! రక్తసిక్తమైన ఢిల్లీ పోలీసుల చేతులు, చేతల గురించి ప్రస్తావిస్తూ ‘ఢిల్లీ పోలీసులంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పోలీసులని అర్థమ’ని సుప్రసిద్ధ భారత అభ్యుదయ, ప్రజాస్వామికవాద ‘కారవాన్‌’ పత్రిక సంపాదకుడైన ప్రభిజిత్‌ సింగ్‌ వ్యంగ్యీకరించడం(మే – 2022) ఇక్కడ ప్రస్తావనార్హం.

‘దిశ’ కేసులో ఉభయపక్షాల బాధితులూ మహిళలూ, కుటుం బాలే. కాబట్టి సజ్జనార్‌ నాయకత్వాన పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతులైన యువకుల వివరాలతో ప్రాథమిక కేసును నమోదు చేయా లని తెలంగాణ మహిళ, ట్రాన్స్‌జెండర్‌ సంస్థల సంయుక్త సంస్థ డిమాండ్‌ చేసింది. పోలీసులను (కమిషనర్‌ సజ్జనార్‌తో సహా) పేరు పేరునా పేర్కొంటూ కమిషన్‌ అభిశంసించిన అధికారులను అందరినీ అరెస్టు చేయాలని కోరింది. ఆ తర్వాతనే 2019 డిసెంబర్‌లో సుప్రీం కోర్టు కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. నేటి భారత మహిళల స్థితి గతుల్ని పరామర్శించుకుంటూ, సమీక్షించుకుంటూ... ఓ మహిళా మూర్తి ఆలోచనల్ని ఇక్కడి పేర్చుకుందాం.

‘‘వెలుగు రేకలు ప్రసరించని చీకటిలో
ఏ ఉదయ కుసుమమూ విచ్చుకోదు
నిరాశా నిస్పృహలను తరిమేసి / దిగంతాలను తాకి వచ్చే
వేకువ పిట్టనొకదాన్ని ఈ భూగోళంపై వదలాలి
విశ్వాసాన్ని కూడదీసుకోలేని జన కూడలిలో
ఏ రేపటి పసితనమూ గుబాళించదు
దురహంకారం మెడలు విరిచి –
విశాల ప్రపంచాన్ని ఒడిసి పట్టుకునే
గర్భాశయానికి ఏ నేలైనా తలవొంచి నిలబడాల్సిందే...’’
                                    – వైష్ణవిశ్రీకి కృతజ్ఞతతో...

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top