
యూత్, టెక్నాలజీ అనేవి వేరు వేరు పదాలు కాదు. టెక్నాలజీని ‘జీ హుజూర్’ అనేలా చేసి సమాజహితానికి ఉపకరించే డివైజ్‌లను ఆవిష్కరిస్తున్నారు యువ ఇన్వెంటర్
వంద కోట్ల కంపెనీ వోనర్!
పదహారు ఏళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ మొదలు పెట్టి ‘వావ్’ అనిపించింది ప్రాంజలి అవస్థీ. మూడు కోట్లతో ప్రాంరంభమైన ఈ కంపెనీ వంద కోట్ల టర్నోవర్‌కు చేరడం విశేషం. ఏడేళ్ల వయసులోనే కోడింగ్ రాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంజలి పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి కుటుంబం ఫ్లోరిడాలో స్థిరపడింది. ఫ్లోరిడా యూనివర్శిటీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ప్రాంజలికి ఏఐ గురించి వివరంగా తెలుసుకునే అవకాశం వచ్చింది.
మొదట్లో ఒక ఏఐ కంపెనీలో పనిచేసిన ప్రాంజలి ఆ తరువాత ‘డెల్వ్. ఏఐ’ పేరుతో సొంత స్టార్టప్ మొదలు పెట్టి విజయం సాధించింది. అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించడం ద్వారా ‘డెల్వ్. ఏఐ’ సంక్లిష్ట డేటా ప్రక్రియను సులభతరం చేస్తుంది. వినియోగదారుల వనరులు, ఆదాయన్ని ఆదా చేస్తుంది.
అథ్లెట్ టు టెక్నో ఎక్స్‌పర్ట్
పదకొండు సంవత్సరాల వయసులో కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ మొదలుపెట్టింది పుహబి చక్రవర్తి. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. ఆటలో విజయం సాధించడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. పోటీల సమయంలో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొన్న పుహబి ‘అథ్లెటిక్స్ ఎక్స్’ అనే ఏఐ మోడల్‌కు రూపకల్పన చేసింది.
చిన్నప్పటి నుంచే పుహబికి కోడింగ్ అంటే ఇష్టం. తమ స్కూల్‌లో నిర్వహించిన ‘రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్’ కార్యక్రమంలో పాల్గొన్న పుహబికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మంచి అవగాహన ఏర్పడింది. ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ కార్యక్రమంలో ఎఎన్‌ఎన్, సీఎన్‌ఎన్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ నేర్చుకుంది.
‘అథ్లెటిక్స్ ఎక్స్’ అప్లికేషన్‌లో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, డైట్ అనే మూడు భాగాలు ఉంటాయి. ఫిజికల్ హెల్త్‌కు సీఎన్‌ఎన్, మెంటల్ హెల్త్‌కు ఏఎన్‌ఎన్, డైట్‌కు జనరల్ లూపింగ్‌ను వాడింది. ఆరోగ్యకరమైన శారీరక, మానసిక జీవనశైలి విషయంలో అథ్లెట్స్‌కు ‘అథ్లెటిక్స్ ఎక్స్’ బాగా ఉపయోగపడుతుంది.
గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్
పద్దెనిమిది సంవత్సరాల కావ్య కొప్పారపు ‘గ్లియోవిజన్’ అనే ఏఐ టూల్‌ను డెవలప్ చేసింది. బ్రెయిన్ ట్యూమర్ ఇమేజ్‌లను త్వరగా విశ్లేషించడానికి ఉపకరించే టూల్ ఇది. డయాబెటిక్ రెటినోపతిని డిటెక్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ సిస్టమ్‌ను కూడా డెవలప్ చేసింది.
టెక్నాలజీకి సంబంధించి అమ్మాయిలను ప్రోత్సహించడానికి ‘గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్’ అనే సంస్థను ప్రారంభించింది. హెల్త్‌కేర్‌కు ఉపకరించే ఏఐ సాధనాలపై దృష్టి పెట్టిన కావ్య టైమ్స్ ‘25 మోస్ట్ ఇన్‌ష్లూయెన్సల్ టీన్స్’ జాబితాలో చోటు సాధించింది.
యువ ఏఐ ఉద్యమం
‘ఎన్‌కోడ్’ అనే సంస్థకు స్నేహ రెవనర్ ఫౌండర్, ప్రెసిడెంట్. రెగ్యులేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉపకరించే యూత్ ఆర్గనైజేషన్ ఇది. అమెరికాలోని ఈ ఆర్గనైజేషన్‌లో వెయ్యి మంది యువతీ,యువకులు ఉన్నారు.
ఏఐ పాలసీ ఇనిషియేటివ్స్‌కు సంబంధించి ‘ఎన్‌కోడ్’ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. వర్క్‌షాప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. టైమ్స్ ‘మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ జాబితాలో స్నేహ చోటు సాధించింది.
ఆ నలుగురు... వందలాది వన్య్రపాణులను రక్షిస్తున్నారు
రోడ్లపై జంతువులు ప్రమాదానికి గురికాకుండా ఉండడానికి కొలరాడో (యూఎస్)లోని ‘స్టెమ్ స్కూల్ హైల్యాండ్స్’కు చెందిన నలుగురు టీనేజ్ అమ్మాయిలు ప్రాజెక్ట్ డీర్’ అనే ఏఐ–పవర్డ్ వైల్డ్‌లైఫ్ డిటెక్షన్ డివైజ్‌ను డెవలప్ చేశారు. థర్మల్ ఇమేజింగ్, ఏఐ సాంకేతికతను ఉపయోగించి పనిచేసే డివైజ్ ఇది.
చీకట్లో, దట్టమైన పొగమంచు ఆవరించినప్పుడు కూడా రోడ్డుపై జంతువులను డిటెక్ట్ చేస్తుంది. ‘రోడ్డుపై జంతువుల ఉనికిని కనిపెట్టిన వెంటనే ప్రాజెక్ట్ డీర్ డ్రైవర్‌లను అప్రమత్తం చేస్తుంది’ అంటుంది నలుగురు ఇన్వెంటర్‌లలో ఒకరైన బ్రి స్కోవిల్లీ. ‘ప్రాజెక్ట్ డీర్ డివైజ్‌లాంటి ఆవిష్కరణ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది పూర్తిగా కొత్త’ అంటుంది మరో స్టూడెంట్ సిద్దీ సింగ్.
(చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్)