ఉత్సుకతను రేకెత్తించే పర్యాటక ప్రదేశాలు.. కానీ అక్కడకు నో ఎంట్రీ.. | Worlds Five most forbidden places and what lies behind the | Sakshi
Sakshi News home page

ఉత్సుకతను రేకెత్తించే పర్యాటక ప్రదేశాలు.. కానీ అక్కడకు నో ఎంట్రీ..

Jul 6 2025 12:12 PM | Updated on Jul 6 2025 12:27 PM

Worlds Five most forbidden places and what lies behind the

నిషిద్ధ ప్రదేశాలు ప్రపంచంలోని చాలా దేశాల్లో పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా, ప్రపంచంలోని కొన్ని ప్రదేశాల్లోకి అడుగు పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే, అవి నిషిద్ధ ప్రదేశాలు. ప్రపంచంలోని కొన్ని ప్రసిద్ధి పొందిన నిషిద్ధ ప్రదేశాల గురించి, వాటి నిషేధ కారణాల గురించి తెలుసుకుందాం.

బొహీమియన్‌ గ్రోవ్‌
అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని మాంటిరియోలో ఉన్న రహస్య ప్రదేశం ఇది. ఇదొక ‘పెద్దమనుషుల’ క్లబ్‌. సభ్యులకు తప్ప అన్యులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం. చాలా క్లబ్బుల కార్యకలాపాలు అప్పుడప్పుడు వార్తా కథనాల ద్వారా ప్రపంచానికి తెలుస్తూ ఉంటాయి. ఈ క్లబ్బు గురించిన వార్తలేవీ బయటకు రావు. హెన్నీ ఎడ్వర్డ్స్‌ అనే రంగస్థల నటుడు 1872లో ఈ క్లబ్బును నెలకొల్పాడు. దాదాపు 2700 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ క్లబ్బులోకి సభ్యులు కానివారు ప్రవేశించడానికి వీల్లేదు. ఈ క్లబ్బులో 2500 మంది సభ్యులు ఉన్నారు. 

ఇందులో సభ్యత్వం కోసం చాలామంది ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ ఉంటారు. ఇందులో సభ్యులు బస చేయడానికి, విందు వినోదాలు జరుపుకోవడానికి విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, అమిత సంపన్నులైన వ్యాపారవేత్తలు, హాలీవుడ్‌ ప్రముఖులు మాత్రమే ఇందులో సభ్యత్వం పొందగలరు. ఈ క్లబ్బులో క్లింట్‌ ఈస్ట్‌వుడ్, రొనాల్డ్‌ రీగన్, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ వంటి ప్రముఖులు సభ్యులుగా ఉండేవారు. సామాన్య పౌరులకు, పర్యాటకులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం.

సర్పద్వీపం
బ్రెజిల్‌ తీరానికి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ సర్పద్వీపం. ఇక్కడ అసంఖ్యాకంగా విషస్పరాలు తిరుగుతూ ఉంటాయి. ఈ దీవి అసలు పేరు ‘ఇలా ద క్వీమాడా గ్రాండె’. ఈ దీవిలో అడుగడుగునా పాములు ఉండటం వల్ల దీనికి ‘స్నేక్‌ ఐలండ్‌’ అనే పేరు వచ్చింది. ఈ దీవి విస్తీర్ణం 4.30 లక్షల చదరపు మీటర్లు. ఇందులో ప్రతి చదరపు అడుగుకు ఒక పాము చొప్పున కనిపిస్తాయి.

 ఇక్కడ తిరిగే పాముల్లో ‘పిట్‌ వైపర్‌’ వంటి అత్యంత ప్రమాదకరమైన పాములు కూడా ఉంటాయి. ‘పిట్‌ వైపర్‌’ కాటు వేస్తే, గంట లోపే ప్రాణాలు పోవడం ఖాయం. పాముల కారణంగానే ఈ దీవిలోకి మనుషులకు ప్రవేశం నిషిద్ధం. బ్రెజిల్‌ పౌరులు గాని, పర్యాటకులు గాని పొరపాటుగానైనా ఈ దీవి వైపుగా వెళ్లరు.

సర్‌ట్సీ దీవి
భూమ్మీద కొత్తగా ఏర్పడిన దీవి ఇది. ఐస్‌లండ్‌ దక్షిణ తీరానికి ఆవల అట్లాంటిక్‌ సముద్రంలో ఉన్న ఈ దీవి 1963లో సముద్ర గర్భంలో సంభవించిన అగ్నిపర్వతం పేలుడు ఫలితంగా ఏర్పడింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలినప్పుడు దాదాపు ముప్పయివేల అడుగుల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మింది. ఇది జరిగిన నాలుగేళ్లకు సముద్రజలాల ఉపరితలంపై లావా గడ్డకట్టి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ చిన్నదీవి ఏర్పడింది. 

ఐస్‌లండ్‌ ప్రభుత్వం దీనిని ప్రకృతి సంరక్షణ కేంద్రంగా ప్రకటించి, ఈ దీవిలో మొక్కలు, జంతువుల పెరుగుదలపై పరిశోధనలు చేపడుతోంది. యునెస్కో దీనిని 2008లో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించింది. అగ్నిపర్వతం పేలుడు కారణంగా ఈ దీవి ఏర్పడటంతో, దీనికి ‘నార్స్‌’ ప్రజల అగ్నిదేవుడైన ‘సర్‌ట్సీ’ పేరు పెట్టారు. ఇందులో పర్యాటకులకు, పౌరులకు ప్రవేశం నిషిద్ధం.

గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌
ఇది ప్రపంచదేశాల విత్తనాల ఖజానా. నార్వే దేశానికి, ఉత్తర ధ్రువానికి మధ్య మంచుకొండలతో నిండి ఉండే స్వాల్‌బార్డ్‌ దీవిలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనాల ఖజానా. వేలాది తిండిగింజలు, ఇతర పంటలకు చెందిన విత్తనాలు, నాలుగువేలకు పైగా వృక్షజాతులకు చెందిన విత్తనాలు ఇందులో భద్రంగా పదిలపరచి ఉన్నాయి. 

ప్రకృతి బీభత్సాల వల్ల గాని, యుద్ధ వినాశనాల వల్ల గాని ప్రపంచంలో ప్రళయోత్పాతంలాంటి పరిస్థితులు ఏర్పడితే, దీనిలో భద్రపరచిన విత్తనాలను పంపిణీ చేయడం ద్వారా పరిస్థితులను చక్కదిద్దే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. నార్వే ప్రభుత్వం 12.7 మిలియన్‌ డాలర్ల (రూ. 110.2 కోట్లు) ఖర్చుతో దీనిని మరింతగా పటిష్టపరచింది. సంబంధిత శాస్త్రవేత్తలు, రక్షణాధికారులకు తప్ప మరెవరికీ దీనిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు.

రెడ్‌ జోన్‌
ఫ్రాన్స్‌ ఈశాన్య ప్రాంతంలో దాదాపు 1200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రదేశాలను అక్కడి ప్రభుత్వం ‘రెడ్‌ జోన్‌’గా ప్రకటించింది. కొద్దిమంది సైనిక సిబ్బంది తప్ప ఇతరులెవరూ ఈ ప్రదేశాల్లోకి అడుగుపెట్టడం నిషిద్ధం. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు ఈ ప్రాంతంలోని గ్రామాలన్నీ పచ్చని పంట పొలాలతో కళకళలాడేవి. మొదటి ప్రపంచయుద్ధంలో ఈ ప్రాంతంలో బాంబు దాడులు, ఫిరంగి దాడులు జరగడంతో ఇక్కడ ఉన్న చెట్టూ చేమా కూడా తీవ్రంగా నాశనమైపోయాయి. 

ఇక్కడ పడిన బాంబుల్లో కొన్ని పేలనివి కూడా ఉంటాయి. ఇవి ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. మొదటి ప్రపంచయుద్ధం 1918లో ముగిసిన తర్వాత ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఇక్కడి గ్రామస్థులను ఇతర ప్రదేశాలకు తరలించి, ఈ ప్రాంతాన్ని ‘రెడ్‌ జోన్‌’గా ప్రకటించి, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. 

ఈ ప్రాంతంలోని నేలను తిరిగి యథాతథ స్థితికి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా పనులు సాగిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న పనులు ఇలాగే కొనసాగితే, ఈ ప్రాంతంలోని భూమి వ్యవసాయయోగ్యంగా మారడానికి మరో మూడు నుంచి ఏడు శతాబ్దాలు పట్టవచ్చని అంచనా.

మిర్నీ వజ్రాల గని
రష్యాలోని తూర్పు సైబీరియా ప్రాంతంలో ఉన్న వజ్రాల గని ఇది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ నిర్మిత బిలం. దీనిని ‘మిర్‌ మైన్‌’ అని కూడా అంటారు. దీని లోతు 1700 అడుగులు. సోవియట్‌ హయాంలో ఈ ప్రదేశంలో 1955లో వజ్రాల నిక్షేపాలు బయట పడ్డాయి. అప్పటి సోవియట్‌ అధినేత జోసెఫ్‌ స్టాలిన్‌ ఇక్కడ గని తవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు. 

సోవియట్‌ 1991లో విడిపోయిన తర్వాత ఏర్పడిన రష్యా ప్రభుత్వం కూడా ఇక్కడ 2001 వరకు ఉపరితల ఖనిజ నిక్షేపాల వెలికితీత కొనసాగించింది. రష్యా ప్రభుత్వం ఇప్పటికీ ఇక్కడ భూగర్భంలో గని తవ్వకాలను రహస్యంగా కొనసాగిస్తోందని చెబుతారు. ఈ ప్రదేశం గురించి రకరకాల వదంతులు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ గనికి ఎగువనున్న గగనతలం మీదుగా విమానాలు గాని, హెలికాప్టర్లు గాని ఎగరవు. 

ఇదివరకు దీని మీదుగా ఎగిరిన హెలికాప్టర్లు కొన్ని దిగువవైపుగా సాగే గాలి ఒత్తిడి వల్ల గని లోపలికి లాక్కుపోయాయని చెప్పుకుంటారు. అయితే, దీనికి సంబంధించిన ఆధారాలేవీ లేవు. ఈ గని పరిసరాల్లోకి అడుగుపెట్టడానికి గని కార్మికులకు, సంబంధిత అధికారులకు తప్ప ఇతరులెవరికీ అనుమతి ఉండదు. సామాన్యులకు ఇది నిషిద్ధ ప్రదేశం. 

(చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం అనాథగా ఆ చిట్టితల్లి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement