Travel: గిన్నిస్‌ రికార్డు.. జటాయు పార్కు

World Largest Bird Sculpture Jatayu Nature Park In Kerala - Sakshi

రెండు వందల అడుగుల పొడవు. నూట యాభై అడుగుల వెడల్పు. డెబ్బై అడుగుల ఎత్తు...  ఇది ఇక్కడ కనిపిస్తున్న పక్షి పరిమాణం. ఆ పరిమాణమే దీనిని గిన్నిస్‌ బుక్‌లో చేర్చింది. 

జటాయు నేచర్‌ పార్క్‌... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న జటాయు నేచర్‌ పార్కులో ఉన్న జటాయు పక్షిని శిల్పకారుడు రాజీవ్‌ ఆంచల్‌ నిర్మించాడు. అతడు ఫిల్మ్‌ మేకర్‌ కూడా. రామాయణంలో జటాయు ప్రధానమైన పాత్ర. సీతాపహరణ సమయంలో తనను అడ్డగించిన జటాయును రావణాసురుడు సంహరించాడని రామాయణంలో ఉంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. జటాయు తుదిశ్వాస వదిలిన ప్రదేశంలో పార్కు నిర్మించినట్లు చెబుతారు. మన రాష్ట్రంలో అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా మనం చెప్పుకుంటాం. వాస్తవాల అన్వేషణ, అధ్యయనంలోకి వెళ్లకుండా కేరళలోని ఈ పార్కుకు వెళ్తే టూర్‌ మధురానుభూతికి మినిమమ్‌ గ్యారంటీ.

పక్షిలోపల మ్యూజియం
65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో డిజిటల్‌ మ్యూజియం ఉంది. లైట్‌ అండ్‌ సౌండ్‌ షోలో రామాయణంలోని జటాయు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మణం లోపల జటాయు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. 

ప్రపంచంలో ‘లార్జెస్ట్‌ ఫంక్షనల్‌ స్టాచ్యూ ఆఫ్‌ ఎ బర్డ్‌’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్‌ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ రోప్‌వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్‌ క్లైంబింగ్, బైక్‌ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్‌ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్‌ సిటిజెన్‌ అందరికీ ఈ టూర్‌ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది.

జటాయు పార్కు  సందర్శనలో పర్యాటకులు
జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి అయితే పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ సర్వీస్‌ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్‌ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top