చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..! | World Art Day: Celebrating Indian art forms through pencils | Sakshi
Sakshi News home page

World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!

Apr 14 2026 5:08 PM | Updated on Apr 14 2026 5:48 PM

 World Art Day: Celebrating Indian art forms through pencils

భారతీయ కళలు గురించి ఈ తరానికి ఎన్ని తెలుసు అని అడిగితే కచ్చితంగా నీళ్లు నములుతారు. మహా అయితే ఒకటో, రెండో చెబుతారు అంతే. కానీ ఈ చిన్నారి అంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించి..చేస్తున్న మహత్తర కార్యం గురించి తెలిస్తే..శెభాష్‌ అని అభినందించకుండా ఉండరు. ఎందుకంటే జస్ట్‌ నాల్గో తరగతికే ఆ చిన్ని మనసు ఎంతో బాధ్యతగా ఆలోచించ విధానం..అందుకోసం పడుతున్న తపన ప్రతి ఒక్కర్ని కదలిస్తుంది. రేపు ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా ఆ చిన్నారి కళా వారసత్వం కోసం చేస్తున్న​ కృషి గురించి సవివరంగా చూద్దామా.

ఆ అమ్మాయే మన భాగ్యనగరం బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న శ్రేష్ట అక్షయ్‌. పిల్లలందరికి నచ్చినట్లుగానే అక్షయ్‌కు కూడా రంగురంగుల పెన్సిళ్లు అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొత్త కార్టూన్‌ డిజైన్ల పెన్సిళ్ల కోసం తెగ వెతికేది. ఒక రోజు అమ్మని అడిగింది ఇతర దేశాల్లో తయారైన పెన్సిళ్లు, ఇతర దేశాల కార్టూన్‌లతో ఉండే పెన్సిళ్లను ఎందుకు వాడుతున్నాం అని అమాయకంగా ప్రశ్నించింది. ఆ సందేహమే తనను విలక్షణమైన చిన్నారిగా అందరిచేత ప్రశంసలందుకునేలా చేస్తుందని అక్షయ్‌గానీ, ఆమె తల్లిగానీ ఆరోజు ఊహించలేదు. 

ఆ ప్రశ్నతో మొదలైన ఆ చిన్నారి అక్షయ్‌ ఆలోచన..మన కళా రూపాలపై ఆసక్తిని పెంచుకునేందుకు దారితీసింది. మనదేశంలో ఉన్న ప్రముఖమైన కళా రూపాలతో పెన్సిళ్లు ఎందుకు ఉండకూడదు అనుకుంది. అంతేగాదు తానే ఎందుకు అలాంటి పెన్సిళ్లను తీసుకురాకూడదు అనుకుంది. దీనివల్ల తనలాంటి పిల్లలందరికి మన భారతదేశ కళలు, వాటి గొప్పదనం గురించి తెలుస్తుంది కదా అని అనుకుంది. అంతేగాదు మన అందమైన కళారూపాలైన..మధుబని కళ, గోండ్ కళ, పైట్కర్ కళ, పిథోరా కళ, వార్లీ కళ వంటి కళల పేర్లను పెన్సిళ్లపై రాస్తే, అవి ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా, మన గొప్ప వారసత్వం గురించి తెలుసుకోగలుగుతారని భావించింది అక్షయ్‌. 

ఆ నేపథ్యంలోనే తల్లిదండ్రుల సహాయం తీసుకుని మరి బీహార్‌కు చెందిన మధుబని కళ, మహారాష్ట్రకు చెందిన వార్లీ కళ, రాజస్థాన్‌కు చెందిన పిచ్వాయి కళ, కర్ణాటకకు చెందిన కావి కళ, రాజస్థాన్‌కు చెందిన బ్లూ పాటరీ కళ, మధ్యప్రదేశ్‌కు చెందిన గోండ్ కళ, గుజరాత్‌కు చెందిన పిథోరా కళ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కలంకారి కళ, తెలంగాణకు చెందిన చెరియల్ కళ, తదితర భారతీయ కళారూపాలను పెన్సిళ్లపైకి తీసుకువచ్చే పనిలో పడింది. 

ఆ క్రమంలో డిజైనింగ్, క్రాపింగ్, ప్రింటింగ్ ఎలా చేస్తారు, వాటిని ఇంట్లో, ప్రింటింగ్‌ షాపుల్లో ఎలా చేస్తారు వంటి చాలా విషయాలు నేర్చుకుంది. అలా తన పేరెంట్స్‌ సాయంతో సొంతంగా కళారూపాలతో కూడిన పెన్సిల్‌ బ్రాండ్‌ “ఆరా పెన్సిల్స్”  ఏర్పాటు చేసి, దానికో www.aurapencils.com. అనే వెబ్‌సైట్‌ని కూడా క్రియేట్‌ చేసింది. అక్కడ ఆన్‌లైన్‌లో కళారూపల పెన్సిళ్లు ఆర్డర్‌ పెట్టుకుని కొనుగోలు చెయ్యొచ్చట. 

తన ఆలోచన గురించి తన స్నేహితులకు కూడా చెప్పాను వాళ్లంతా కూడా మెచ్చుకున్నారని సంతోషంగా చెబుతోంది. అంతేకాదండోయ్‌ మన భారతీయ కళారూపాల గురించి తెలుసుకునేలా చేయడమే కాకుండా భారతదేశంలో తయారై పెన్సిళ్లనే కొనుగోలు చేసేలా ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటోంది ఈ చిన్నారి అక్షయ్‌.

(చదవండి: ఆ గాయం ఆమె లైఫ్‌నే టర్న్‌ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..)

 

Advertisement
 
Advertisement
Advertisement